సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్‌బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు.
ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
తలసరి ఆదాయంలో మూడో స్థానం..
తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన..
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ..
సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment