పోలవరానికి రూ.17,148 కోట్లు | Gajendra Singh Shekhawat On Polavaram Project Funds | Sakshi
Sakshi News home page

పోలవరానికి రూ.17,148 కోట్లు

Published Tue, Jul 4 2023 4:08 AM | Last Updated on Tue, Jul 4 2023 4:11 AM

Gajendra Singh Shekhawat On Polavaram Project Funds - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన రూ.17,148 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర కేబినెట్‌కు పంపాల్సిన ప్రతిపాదన (మెమొరాండం)ను ఈనెల 31లోగా సిద్ధం­చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులకు ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకా­వత్‌ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో ప్రాజెక్టు పను­ల పురోగతిని సోమవారం ఆయన సమీక్షించారు.

రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి­భూ­షణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు ఆ వివరాలను తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–2లో వర­దల ఉధృతికి ఏర్పడిన అగాథాలలో ఇసుక పూడ్చి­వేత పనులు పూర్తయ్యాయని.. వైబ్రో కాంపాక్షన్‌ ద్వా­రా యథాస్థితికి తెచ్చే పనులు చేస్తున్నామని అధికా­రు­లు చెప్పారు. షెడ్యూలు ప్రకారమే పనులు చేస్తుం­డటంతో మంత్రి షెకావత్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. 

36 గ్రామాలకు పునరావాసం కల్పించడానికి ఓకే..
ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని.. కానీ, 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని.. అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని శశిభూషణ్‌కుమార్‌ చెప్పారు. ఈ వ్యయాన్ని కలుపుకుంటే.. తొలిదశ పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమని వివరించారు.

ఇందుకు మంత్రి షెకావత్‌ అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఈనెల 15లోగా సీడబ్ల్యూసీకి పీపీఏ పంపాలని.. అనంతరం ఈనెల 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు. ఆ మెమొరాండాన్ని కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని షెకావత్‌ చెప్పారు.

డయాఫ్రమ్‌వాల్‌పై మేధోమథనం..
మరోవైపు.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట్ల.. దానికి సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే పనులపై నిర్మాణ సంస్థ మేఘా అనుమానాలు వ్యక్తంచేస్తోందని మంత్రి షెకావత్‌కు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. మంత్రి స్పందిస్తూ.. పాత డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి ఎంత వ్యయమవుతుంది? గ్యాప్‌–2లో మొత్తం 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు.

దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా స్పందిస్తూ.. పాత దానిలో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.400 కోట్లు.. మొత్తం 1,396 మీటర్ల పొడవున కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ వేయడానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. దీనిపై షెకావత్‌ స్పందిస్తూ.. ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశాలపై సోమవారంలోగా తుది నిర్ణయాన్ని తనకు వెల్లడించాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరాకు మంత్రి షెకావత్‌ కోరారు.

పోలవరం పనులకు లైన్‌ క్లియర్‌
స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను మరో ఏడాదిపాటు నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు
2024 జులై లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి అఫిడవిట్‌ దాఖలు చేసేదాకా ఈ ఉత్తర్వులు అమలులోనే..

పోలవరం ప్రాజెక్టు పనులను నిర్విఘ్నంగా కొనసాగించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ జారీచేసిన ‘స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌’ అమలును మరో ఏడాదిపాటు నిలుపుదల చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్త యోగేంద్రపాల్‌ సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ ఉత్తర్వులు ఈనెల నుంచి 2024, జులై వరకూ లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జల్‌శక్తి శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసేవరకూ అమల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. తద్వారా పోలవరం పనులకు కేంద్ర లైన్‌క్లియర్‌ చేసింది. బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చాకే ఆ ప్రాజెక్టు పనులను జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు.

వీటివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ ఒడిశా సర్కార్‌ 2007లో సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ 2011, ఫిబ్రవరి 8న కేంద్రాన్ని ఆదేశించింది.

దాంతో ప్రాజెక్టు పనులను ఆపేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను జారీచేసింది. ప్రాజెక్టు పనులను చేపట్టాలంటే.. స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను నిలుపుదల చేయడం లేదా ఎత్తేయడం తప్పినిసరి. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను ఎత్తేయడం న్యాయ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు పనులు చేసుకోవడానికి వీలుగా స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ అమలును నిలుపుదల (అబయన్స్‌లో పెట్టాలని) చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి కేంద్రానికి ప్రతిపాదన పంపుతోంది. 

నిజానికి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేయడానికి వీలుగా రెండేళ్లపాటు స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ అమలును నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం 2019 నుంచి స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ నుంచి రెండేళ్లపాటు నిలుపుదల చేస్తూ వస్తోంది.

ఈ గడువు ఈ నెలతో పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లపాటు నిలుపుదల చేయాలని కోరగా జులై 2024 వరకు లేదా సుప్రీంకోర్టులో కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్‌ దాఖలుచేసే వరకూ స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ను నిలుపుదల చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement