సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఏర్పడిన గుంతలు పూడ్చే విధానం, ప్రధాన డ్యామ్ డిజైన్లపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఏప్రిల్ 1న ఢిల్లీలో సమావేశమై వాటిని కొలిక్కి తెద్దామని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నిపుణులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా హాజరవుతారని చెప్పారు.
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై వెదిరె శ్రీరాం అధ్యక్షతన శుక్రవారం వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మట్టికట్టల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్, రిటైర్డు ప్రొఫెసర్ వీఎస్ రాజు, నిపుణులు గోపాలకృష్ణన్, దేవేందర్‌సింగ్, డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ సభ్యులు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ఎస్‌ఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాన డ్యామ్ వద్ద నదీ గర్భంలో ఏర్పడిన గుంతలను పూడ్చడంపై ప్రధానంగా చర్చించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడకుండానే గుంతలు ఉన్న ప్రదేశాల్లో పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్ (అధిక ఒత్తిడితో కూరడం) చేయాలని వీఎస్ రాజు ప్రతిపాదించారు. దాంతో కోతకు గురైన ఇసుక పొరలు మునుపటిలా తయారవుతాయని చెప్పారు. దీనిపై ఏబీ పాండ్య, దేవేందర్‌సింగ్‌లు విభేదించారు.
కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని పూర్తిగా తోడేసి పొరలు పొరలుగా ఇసుక వేస్తూ డెన్సిఫికేషన్, వైబ్రో కాంపక్షన్ చేయాలని ప్రతిపాదించారు. దీనిపై నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గ్యాప్–2లో 550 మీటర్లు, గ్యాప్–1లో 1,750 మీటర్ల పొడవున ప్రధాన డ్యామ్ డిజైన్ల పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏప్రిల్ 1న మరోసారి సమావేశమవ్వాలని వెదిరె శ్రీరాం నిర్ణయించారు. శుక్రవారంనాటి సమావేశంలో వెల్లడైన అంశాలపై మరోసారి అధ్యయనం చేసి తుది ప్రతిపాదనతో ఆ సమావేశానికి హాజరుకావాలని నిపుణులకు, అధికారులకు సూచించారు.
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై భిన్నాభిప్రాయాలు
Published Sat, Mar 26 2022 4:57 AM | Last Updated on Sat, Mar 26 2022 2:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment