సాక్షి, అమరావతి: పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రూ.పది వేల కోట్లను ముందస్తు (అడ్‌హక్)గా ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ వినతిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రిచా శర్మ చెప్పారు. ఈ అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశం తర్వాత పోలవరానికి అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో 15 అంశాల అజెండాతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. పీపీఏ సభ్యులైన రిచా శర్మ ఇందులో పాల్గొన్నారు. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా సీఎం జగన్ ప్రతిపాదించిన మేరకు అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు. దీనిపై రిచా శర్మ, చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ అడ్‌హక్‌గా నిధులు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
రీయింబర్స్ నిధులివ్వండి..
ఈ సీజన్‌లో మార్చి వరకూ పనులకు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 2,807 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ నెల 21న జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ అంశాలను వివరించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో చెప్పారు.
ప్రణాళికాయుతంగా పూర్తి..
గోదావరికి జూన్‌లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గతేడాది ఆమోదించిన వర్కింగ్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, ఈ సీజన్‌లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో పీపీఏ కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనులను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికపై సర్వ సభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు.
గోదావరిలో వరద ప్రవాహం 24 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో పనులు ప్రారంభించామని, జనవరి ఆఖరుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను డిజైన్ మేరకు 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఉన్న నీటిని తోడివేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–1లో పనులు ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని పీపీఏ ఆదేశించింది.
ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనుల పరీక్షలను నిర్వహించి సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఫిబ్రవరికి భూ ఉపరితలం స్థాయికి పూర్తి చేయాలని నిర్దేశించింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను ఆమోదించారు.
తొలిదశలో కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలు, రెండో దశలో మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని పీపీఏ సూచించింది. డిసెంబర్‌లో పీపీఏ సమావేశాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహించి ఈ సీజన్‌లో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చిద్దామని రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనకు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అంగీకరించారు. రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం తరలింపుపై కూడా సానుకూలంగా స్పందించారు.
బ్యాక్ వాటర్‌పై రీ సర్వేకు నిరాకరణ
గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంతోపాటు తమ భూభాగంలో 827 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) రేఖ తమ భూభాగంలో లేదని, ఎఫ్‌ఆర్‌ఎల్‌కు మించి జలాలు వెనక్కి ఎగదన్నడం వల్ల తమ భూభాగం ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్ రేఖ ఏపీ భూభాగంలోనే ఉంటుందని, కావాలంటే క్షేత్రస్థాయిలో చూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌కు, బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధమే ఉండదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదని సూచించారు.
ఈ దశలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇప్పటికే అధ్యయనం చేశామని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావమే ఉండదని అందులో తేలిందని, మళ్లీ అధ్యయనం చేసే ప్రశ్నే లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు ప్రాంతాల రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ రెండు దఫాలు సమావేశాలు నిర్వహించాయని గుర్తు చేశారు. జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ త్వరలో ముంపు ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చకు అనుమతించబోమని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment