Pankaj Kumar
-
10న పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలనే అంశంపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య, సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) డైరెక్టర్ ఆర్.చిత్ర, వ్యాప్కోస్ సీఈఓ అమన్ శర్మ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్‌కుమార్, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) మాజీ ఈడీ ఎస్ఎల్ కపిల్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతోపాటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థలు బావర్, కెల్లర్ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో నిర్మించిన పునాది డయాఫ్రమ్ వాల్ గోదావరి వరదల ఉధృతికి 30 శాతం దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు తేల్చాయి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఈనెల 3న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ప్రతిపాదన మేరకు డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దితే.. పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేసే అవకాశాలు తక్కువని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు భద్రత అత్యంత ప్రధానమని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవునా పాత దానికి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. అప్పుడు రెండు డయాఫ్రమ్ వాల్లు ఉన్నట్లవుతుందని.. డ్యామ్‌కు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ, పీపీఏ, ఎన్‌హెచ్‌పీసీ, వ్యాప్కోస్, సీఎస్‌ఆర్‌ఎంఎస్, డీడీఆర్పీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించి సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని పంకజ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. -
పోలవరం నిధులపై ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రాజెక్టు తొలిదశ పూర్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.16,952.07 కోట్లతో పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను మదింపు చేసి.. త్వరితగతిన నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రిమండలికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను పంపుతామన్నారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. నిధుల సమస్యను పరిష్కరించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనపై గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యాలయంలో పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా, సీడబ్ల్యూసీ వాటర్ ప్లానింగ్, ప్రాజెక్టŠస్ విభాగం సభ్యులు నవీన్‌కుమార్ తదితరులతో ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూలు ప్రకారం పనులు.. తొలుత ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తిచేసి.. గోదావరి ప్రవాహాన్ని 2021, జూన్ 11న స్పిల్ వే మీదుగా ఏపీ ప్రభుత్వం మళ్లించిందన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి ఇసుక తిన్నెలు కో తకు గురై ఏర్పడిన అగాధాలను పూడ్చివేసి, యథాస్థితికి తెచ్చే పనులు ప్రారంభమయ్యాయని.. వరదలు వచ్చేలోగా ఆ పనులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టారని వివరించారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించే పనులు ప్రారంభిస్తారని.. వాటికి సమాంతరంగా గ్యాప్–1లో ప్రధా న డ్యామ్ పనులు చేపడతారని చెప్పారు. షె డ్యూలు ప్రకారం ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేస్తోందన్నారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిం చే ప నులను కూడా వేగవంతం చేసిందన్నారు. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టు పనులు జరుగుతుండటంపై పంకజ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్రంగా పరిశీలించి నివేదిక.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ప్రధానంగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల సంఖ్యను పక్కాగా తేల్చి.. ఆ గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడం, భూసేకరణకు ఎంత నిధులు అవసరమో తేల్చాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాన డ్యామ్, కుడి, ఎడమ కాలువలు.. తొలిదశలో ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టాల్సిన డిస్ట్రిబ్యూటరీలకు ఎంత వ్యయం అవసరమో తేల్చాలని సూచించారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పిం చడం.. ప్రధాన డ్యామ్, కాలువల పనులకు అయ్యే వ్యయాన్ని విడివిడిగా లెక్కించి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు స్పందిస్తూ.. సవరించిన అంచనా వ్యయాన్ని తేల్చి, నివేదిక ఇస్తామన్నారు. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఢిల్లీలో గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేశాక.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ పంపుతారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనప్పుడు అడ్‌హక్‌గా రూ.పదివేల కోట్లు విడుదల చేసి, రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు ముందస్తు ఫలాలను అందించడానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ పూర్తి చేయడం ద్వారా ముందస్తు ఫలాలను రైతులకు అందించడంపై ఏప్రిల్ 10న రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. కమీషన్ల కక్కుర్తితో, ప్రణాళికారాహిత్యంతో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటంతోపాటు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో కొత్తగా 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అవసరమైన వ్యయంపై సవరించిన ప్రతిపాదనలనుపంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఆ మేరకు తొలిదశ పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో సవరించిన వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న పీపీఏకి పంపింది. ప్రాజెక్టును సమగ్రంగా పూర్తిచేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని కోరింది. వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు ♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి. కానీ కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రంపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. ♦ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే రూ.4,730.71 కోట్లను పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని మినహాయిస్తే రూ.15,667.90 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ♦ భూసేకరణ చట్టం–2013 ప్రకారం పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరమైతే.. కేవలం రూ.20,398.61 కోట్లతోనే పోలవరాన్ని పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడం ద్వారా ఆ ప్రాజెక్టుకు సమాధి కట్టారు. ♦ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు రూ.4,730.71 కోట్లు, తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చుచేసింది. చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్ల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు వ్యయం చేసింది. దీంతో ఇకపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయాలంటే సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించాలి. పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరానికి నిధుల సమస్యను పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్లకు పలుమార్లు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నేపథ్యంలో రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేయడం అసాధ్యమని వివరించారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. వాటిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ రెండుదశల్లో పోలవరాన్ని పూర్తిచేసేందుకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
పోలవరం తొలి దశ పూర్తికి రూ.16,952 కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముందస్తు ఫలాలను రైతులకు అందించడానికి సత్వరమే తొలి దశ పనులను పూర్తి చేయాలని, ఇందు కోసం రూ.16,952.07 కోట్లు తక్షణమే విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఏప్రిల్ 10న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు పూర్తి చేయడానికి అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రతిపాదన పంపినట్లు పేర్కొంది. వీటితో పాటు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు సమగ్రంగా పూర్తి చేయడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్‌కు జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు విడుదల చేయాలని 2022 జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, అందులో రూ.10,485.38 కోట్లు మంజూరు చేయాలని సీడబ్ల్యూసీ కేంద్ర జల్ శక్తి శాఖకు 2022 ఏప్రిల్ 21న సిఫార్సు చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ డిజైన్లు ఖరారయ్యాక ప్రాజెక్టు తొలి దశ తుది ప్రతిపాదనలు పంపాలని గతేడాది జూన్ 15న సీడబ్ల్యూసీ (జాతీయ ప్రాజెక్టుల విభాగం) డైరెక్టర్ సూచించారు. ♦ ఈ ఏడాది మార్చి 4, 5న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ప్రాజెక్టును సందర్శించి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో గోదావరి వరదల ఉద్ధృతికి ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చటం, గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌లో దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే విధానాన్ని ఖరారు చేసింది. ఈ పనులకు రూ. 2,020.05 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ♦ డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌తో సహా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపాలని ఏప్రిల్ 10న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ♦ ప్రధాన డ్యామ్‌తో సహా కాలువల్లో మిగిలిన పనులకు రూ.6,593.02 కోట్లు, డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, అగాధాలను పూడ్చటానికి రూ.2,020.05 కోట్లు, ప్రాజెక్టు నిర్వహణకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు రూ.945 కోట్లు అవసరం. ♦ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 123 ముంపు గ్రామాల్లో మిగిలిన భూమి సేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.2,177 కోట్లు, ఎడమ కాలువలో కుమ్మరలోవ గ్రామంలో భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.90 కోట్లు అవసరం. ♦ ప్రాజెక్టు 41.15 మీటర్ల పరిధిలో అదనంగా ముంపునకు గురయ్యే 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాల పునరావాసానికి రూ.5,127 కోట్లు ఖర్చవుతుంది. వెరసి తొలి దశ పనులను సమగ్రంగా పూర్తి చేయడానికి రూ.16,952.07 కోట్లు అవసరం. ♦ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు కేంద్ర జల్ శక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు ఇస్తే సత్వరమే పోలవరం.. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇస్తే షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయొచ్చు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే రూ.4,730.71 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లు ఖర్చు చేసింది. అంటే.. కేంద్రం 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్లకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో పీపీఏ ఖర్చులతో కలిపి కేంద్రం రూ.14,418.89 కోట్లను రీయింబర్స్ చేసింది. ఈ నేపథ్యంలో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించి.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పోలవరం పనులు భేష్..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధికారులను అభినందించారు. షెడ్యూల్ ప్రకారం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలెట్ ఛానల్ పూర్తి చేసి గోదావరి వరదను సమర్ధంగా మళ్లించారని రాష్ట్ర జలవనరుల అధికారులను, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని అభినందించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య పడిన అగాధాలను మళ్లీ వరద వచ్చేలోగా పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా ‘యు’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానించాలని చెప్పారు. తద్వారా వరదల్లోనూ ప్రధాన (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్) డ్యామ్ పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ముంపు ప్రభావంపై సోమవారం ఢిల్లీలో పంకజ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, పీపీఏ సీఈవో శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్యూసీ) చైర్మన్ కుష్వీందర్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పీపీఏ, రాష్ట్ర జల వనరులు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సవరించిన అంచనాలకు సానుకూలం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీడబ్యూసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 45.72 మీటర్ల వరకు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2017–18 సవరించిన అంచనాల్లో పేర్కొన్నామని చెప్పారు. కానీ మరో 36 గ్రామాలు కూడా ముంపు పరిధిలోకి వస్తాయని, ఆ గ్రామాల్లో నిర్వాసితులకూ పునరావాసం కల్పించాలని కోరారు. దీనిపై పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో లైడార్ సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు వినతి పత్రాలు ఇచ్చారన్నారు. తొలుత 41.15 మీటర్ల వరకు, ఆ తరువాత 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతెంత నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్యూసీ చైర్మన్ వోరాను ఆదేశించారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి అడ్‌హాక్‌గా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నిధులు ఎంత అవసరమో తేల్చడానికి పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నాలుగు రోజుల్లో సీడబ్యూసీ చైర్మన్ వోరా సమావేశం కానున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావం ఉండదు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో భూమి ముంపునకు గురవుతోందని సుప్రీం కోర్టులో తెలంగాణ, ఒడిశా, చతీస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో సీడబ్యూసీ సర్వే చేసిందని, అందులో బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని వెల్లడైందని అధికారులు వివరించారు. సుప్రీం కోర్టు నియమించిన గోపాలకృష్షన్ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. సీడబ్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున చెప్పాల్సిన అంశాలను స్పష్టం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం వస్తారని వెదిరె శ్రీరాం చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో నీటి పారుదల విభాగం వ్యయం మొత్తాన్ని భరించాల్సిన బాధ్యత కేం‘ద్రానిదేనని పునరుద్ఘాటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. -
పోలవరానికి నిధులు!
సాక్షి, అమరావతి: పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా రూ.పది వేల కోట్లను ముందస్తు (అడ్‌హక్)గా ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ వినతిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రిచా శర్మ చెప్పారు. ఈ అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశం తర్వాత పోలవరానికి అడ్‌హక్ నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో 15 అంశాల అజెండాతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. పీపీఏ సభ్యులైన రిచా శర్మ ఇందులో పాల్గొన్నారు. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు వీలుగా సీఎం జగన్ ప్రతిపాదించిన మేరకు అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు. దీనిపై రిచా శర్మ, చంద్రశేఖర్ అయ్యర్ స్పందిస్తూ అడ్‌హక్‌గా నిధులు ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రీయింబర్స్ నిధులివ్వండి.. ఈ సీజన్లో మార్చి వరకూ పనులకు, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని భూసేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని సమావేశంలో రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 2,807 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ నెల 21న జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ అంశాలను వివరించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో చెప్పారు. ప్రణాళికాయుతంగా పూర్తి.. గోదావరికి జూన్‌లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గతేడాది ఆమోదించిన వర్కింగ్ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో పీపీఏ కమిటీని నియమించింది. ప్రాజెక్టు పనులను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదికపై సర్వ సభ్య సమావేశంలో చర్చించి ఆమోదించారు. గోదావరిలో వరద ప్రవాహం 24 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో పనులు ప్రారంభించామని, జనవరి ఆఖరుకు దిగువ కాఫర్ డ్యామ్‌ను డిజైన్ మేరకు 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఉన్న నీటిని తోడివేసి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–1లో పనులు ప్రారంభించి డిసెంబర్ 2023 నాటికి 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని పీపీఏ ఆదేశించింది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత పనుల పరీక్షలను నిర్వహించి సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఫిబ్రవరికి భూ ఉపరితలం స్థాయికి పూర్తి చేయాలని నిర్దేశించింది. డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేలాక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికను ఆమోదించారు. తొలిదశలో కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలు, రెండో దశలో మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని పీపీఏ సూచించింది. డిసెంబర్లో పీపీఏ సమావేశాన్ని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వహించి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా చర్చిద్దామని రాష్ట్ర అధికారులు చేసిన ప్రతిపాదనకు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అంగీకరించారు. రాజమహేంద్రవరానికి పీపీఏ కార్యాలయం తరలింపుపై కూడా సానుకూలంగా స్పందించారు. బ్యాక్ వాటర్‌పై రీ సర్వేకు నిరాకరణ గోదావరికి జూలైలో వచ్చిన వరదలకు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంతోపాటు తమ భూభాగంలో 827 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యాయని తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) రేఖ తమ భూభాగంలో లేదని, ఎఫ్ఆర్ఎల్కు మించి జలాలు వెనక్కి ఎగదన్నడం వల్ల తమ భూభాగం ముంపునకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్ఎల్ రేఖ ఏపీ భూభాగంలోనే ఉంటుందని, కావాలంటే క్షేత్రస్థాయిలో చూపించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్కు, బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధమే ఉండదన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండి కూడా అందుకు విరుద్ధంగా మాట్లాడటం తగదని సూచించారు. ఈ దశలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ బ్యాక్ వాటర్ ప్రభావంపై ఇప్పటికే అధ్యయనం చేశామని గుర్తు చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావమే ఉండదని అందులో తేలిందని, మళ్లీ అధ్యయనం చేసే ప్రశ్నే లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలవరం ముంపు ప్రాంతాల రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ రెండు దఫాలు సమావేశాలు నిర్వహించాయని గుర్తు చేశారు. జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ త్వరలో ముంపు ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాక్ వాటర్ ప్రభావంపై చర్చకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. -
‘పోలవరం’పై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్ వాటర్ ప్రభావంపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల సందేహాలను నివృత్తి చేయడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌గుప్తా వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను ఈనెల 6న సుప్రీంకోర్టు విచారించింది. ముంపు ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అవసరమైన సహకారాన్ని సంపూర్ణంగా అందించాలని కేంద్ర ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓలను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమచేసిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ సహాయ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు బదిలీ రూపం (డీబీటీ)లో వారి ఖాతాల్లో జమచేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2014, మే 28న ఏర్పాటైన పీపీఏ పాలక మండలి తొలి సమావేశాన్ని మంగళవారం వర్చువల్‌గా పంకజ్‌కుమార్ నిర్వహించారు. ఏపీ సీఎస్ సమీర్‌శర్మ తరఫున రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సీఎస్ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై పాలక మండలి సంతృప్తి వ్యక్తంచేసింది. పీపీఏ సీఈఓ వ్యాఖ్యపై అభ్యంతరం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం బడ్జెట్లో కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడమేనని పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పడంపై జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడంలేదని గుర్తుచేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని పంకజ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో నీటిని నిల్వచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖాధికారులు చెప్పారు. కానీ, ఆగస్టులోగా తొలిదశలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని.. వాటికి నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ.. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని డీబీటీ రూపంలో వారి ఖాతాల్లో జమచేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. పరిశీలిస్తాం పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులతోపాటు.. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించి, పెట్టుబడి అనుమతిచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కోరారు. రీయింబర్స్‌మెంట్‌లో జాప్యంలేకుండా చూసి.. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత తలెత్తకుండా చూస్తామని పంకజ్‌కుమార్ స్పష్టంచేశారు. -
'అప్ప'నంగా.. ఇదేందప్పా?
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులే లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అవాస్తవాలను వల్లె వేస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గత నెల 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఇప్పటిదాకా నోటిఫై చేయని నేపథ్యంలో అప్పర్ భద్రకు సాంకేతిక, పెట్టుబడి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అప్పర్ భద్రను నిలుపుదల చేసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా, కర్ణాటకను సమర్థిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్(సౌత్) విభాగం డైరెక్టర్ ఎన్.ముఖర్జీ ఈనెల 12న జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నెల 25న దీన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి జల్ శక్తి శాఖ పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసలు ఏపీ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ వివరణ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం... ► ఏపీ సర్కార్ అభ్యంతరం–1: విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీల నీటి వినియోగం తగ్గిందని కర్ణాటక చెబుతున్న లెక్కలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కొట్టిపారేసింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్ ట్రిబ్యునల్ 9 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అప్పర్ భద్ర హైడ్రాలజీపై పునఃసమీక్షించాలి. ► సీడబ్ల్యూసీ సమాధానం: బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే అప్పర్ భద్రకు సాంకేతిక అనుమతి ఇచ్చాం. ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం అంశాన్ని సాంకేతిక అనుమతి ఇచ్చేటప్పుడు పరిశీలించాం. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్‌ను కర్ణాటక సర్కార్ కోరింది. తుంగభద్రలో నీటి లభ్యత లేనందున అప్పర్ భద్రకు నీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. విజయనగర చానళ్లు, భద్ర, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని ట్రిబ్యునలే తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రలాజికల్ క్లియరెన్స్ తప్పు. దాన్ని పునఃసమీక్షించాలి. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–2: మాస్టర్ ప్లాన్ తయారీకి కర్ణాటక సర్కార్ 2002లో నియమించిన కమిటీ తుంగభద్రలో ఆరు టీఎంసీలు మిగులు ఉందని తేల్చింది. కానీ ఆ ఆరు టీఎంసీలను అటు బచావత్గానీ ఇటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌గానీ కర్ణాటకకు కేటాయించలేదు. ► సీడబ్ల్యూసీ: ఆరు టీఎంసీలు మిగులు జలాలు కాదు. కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో భాగమే. కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో ఉపయోగించుకోని ఆరు టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించామని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ► ఏపీ సర్కార్: కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో నీటి వినియోగం తగ్గిందన్న కర్ణాటక వాదనపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? అక్కడ నీటి వినియోగం పెరిగిందేగానీ తగ్గలేదు. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–3: బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేటాయించింది. కానీ తుంగభద్ర డ్యామ్‌కు 1976–77 నుంచి 2007–08 వరకూ ఏటా సగటున 186.012 టీఎంసీలే వచ్చాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు ప్రవాహం మరింత తగ్గిపోతుంది. ఇది కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ► సీడబ్ల్యూసీ: కర్ణాటక సర్కార్ 2019 నవంబర్ 27న జారీ చేసిన జీవో 176 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 21.50 టీఎంసీలు, గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం వచ్చే అదనపు నీటిలో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 సబ్ బేసిన్లలో మిగిలిన ఆరు టీఎంసీలు వెరసి 29.90 టీఎంసీలతో అప్పర్ భద్రను చేపట్టినందున దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు ఒక్క చుక్క కూడా కేటాయించలేదు. అలాంటప్పుడు 21.5 టీఎంసీలు ఎక్కడ నుంచి వచ్చాయి? సబ్ బేసిన్లలో ఆరు టీఎంసీల మిగులు లేదు. కర్ణాటక కట్టుకథలనే సీడబ్ల్యూసీ వల్లె వేయడం ధర్మం కాదు. ► ఏపీ అభ్యంతరం–4: వేదవతిపై వాణీవిలాసాగర్, బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ల మధ్య కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీన్ని తుంగలో తొక్కుతూ అప్పర్ భద్రలో అంతర్భాగంగా పరశురాంపుర వద్ద బ్యారేజీని కర్ణాటక నిర్మిస్తోంది. ► సీడబ్ల్యూసీ: 2020 డిసెంబర్ 24న నిర్వహించిన సాంకేతిక సలహా మండలి సమావేశం దృష్టికి పరశురాంపుర బ్యారేజీ నిర్మాణం రాలేదు. అప్పర్ భద్ర డీపీఆర్‌లో కూడా ఆ బ్యారేజీ విషయం లేదు. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్ర ప్రాజెక్టులో అంతర్భాగంగా పరశురాంపుర బ్యారేజీ నిర్మిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ టెండర్లు పిలిచింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ► ఏపీ అభ్యంతరం–5: అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. అప్పర్ భద్ర డీపీఆర్‌లను మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు పంపకుండానే అనుమతి ఇచ్చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? ► సీడబ్ల్యూసీ: బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడం కాదా? ► ఏపీ అభ్యంతరం–6: అప్పర్ భద్రకు జాతీయ హోదా ప్రతిపాదనపై చర్చించేందుకు డిసెంబర్ 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నీటి వాటాలు, హైడ్రాలజీ గురించి వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు విషయంలో పరివాహక రాష్ట్రాలకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ► సీడబ్ల్యూసీ: హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశం మినిట్స్ ఇంకా రావాల్సి ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగానే అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చాం. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చామనడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాల్సిందే. ఇదీ అప్పర్ భద్ర ప్రాజెక్టు.. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. అయితే మాస్టర్ ప్లాన్, ఆధునికీకరణ, కృష్ణా డెల్టాకు పోలవరం మళ్లింపు జలాల్లో వాటా, పునరుత్పత్తి జలాలు, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు తదితరాల రూపంలో తమకు 30.4 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని ప్రకటించింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. ► ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి 2019 వరకూ రూ.4,830 కోట్లను ఖర్చు చేసిన కర్ణాటక సర్కార్ అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపింది. ► 2020 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో (2018–19 ధరల ప్రకారం) పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతేడాది మార్చి 25న జల్‌శక్తి శాఖ ఆమోదముద్ర వేసింది. ► ఈ రెండు అనుమతుల ఆధారంగా దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై గత డిసెంబర్ 6న జల్ శక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. -
ఢిల్లీలో చర్చిద్దాం రండి..
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు సూచిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపారు. బోర్డు పరిధిపైనే ప్రధానంగా చర్చ కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా.. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత జూలై 15న వాటి పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల లోగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలని, లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేస్తామని పేర్కొంది. షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డులే అధీనంలోకి తీసుకుని.. సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) బలగాల పహారాలో వాటిని నిర్వహిస్తాయని స్పష్టం చేసింది. బోర్డులు సమర్థవంతంగా పని చేయడానికి వీలుగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు జమ చేయాలని దిశానిర్దేశం చేసింది. అక్టోబర్ 14 నుంచే అమలుకు కేంద్రం దిశా నిర్దేశం కేంద్రం ఆదేశాల మేరకు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గత నెల 3, 9న బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ సర్కార్ గైర్హాజరైంది. ఈ క్రమంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రెండు బోర్డుల చైర్మన్లు తమ అభిప్రాయాలను వివరించారు. బోర్డు పరిధి, గెజిట్ నోటిఫికేషన్ అమలు ఖరారుపై సోమవారం నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తూనే.. మరో వైపు అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగానే చర్యలు చేపట్టాలని రెండు బోర్డులకు ఇప్పటికే కేంద్రం దిశా నిర్దేశం చేసింది. సవరణలు చేయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ► కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నాం. ► కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించి.. మిగతా ప్రాజెక్టుల్లో రోజు వారీ నీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుంది. దీని వల్ల కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుంది. ► ఉమ్మడి ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలి. మాచ్‌ఖండ్, సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలి. ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలి. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలి. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు గుర్తించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలి. వాయిదా వేయాలి : తెలంగాణ సర్కార్ ► నీటి కేటాయింపులు తేలే వరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులుగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం వల్ల వాటికి రుణాలు తెచ్చుకోవడం సమస్యగా మారుతుంది. ► అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనలను సడలించాలి. -
బీఎస్ఎఫ్ డీజీగా పంకజ్ కుమార్
న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బీఎస్ఎఫ్ డీజీ విధులతో పాటు ఐటీబీపీ డీజీగా పని చేస్తున్న ఎస్ఎస్ దేశ్వాల్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం పంకజ్ కుమార్ బాధ్యతలు చేపడతారని కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వెంట 6,300 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను బీఎస్ఎఫ్ జవాన్లే చూసుకుంటున్నారు. బీఎస్ఎఫ్లో సుమారు 2.65 లక్షల మంది సైనికులు ఉన్నారు. పంకజ్ కుమార్ తండ్రి ప్రకాశ్ సింగ్ కూడా ఐపీఎస్ ఆఫీసరే కావడం గమనార్హం. ఆయన కూడా గతంలో బీఎస్ఎఫ్ డీజీగా పని చేశారు. పంకజ్‌తో పాటు తమిళనాడు కేడర్‌కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ సంజయ్ ఆరోరాను ఐటీబీపీ డీజీగానూ, ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన బాలాజీ శ్రీవాస్తవ్‌ను బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)గా నియమించింది. -
బుజ్జగింపులో వింత కోణం
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లను బుజ్జగించే పనిలో అటు బహుజన్ సమాజ్ పార్టీ, ఇటు సమాజ్‌వాదీ పార్టీ తలమునకలవుతున్నాయి. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్లు ఓటు వేయని కారణంగా ఈ రెండు పార్టీలూ ఓడిపోలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గాన్ని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత ఎస్పీ కూడా దానికి వంతపాడింది. మరి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్న క్రమంలో ఇన్నాళ్ళూ ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. మొత్తం మీద, ఎస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. ఈ సరికొత్త బుజ్జగింపు యూపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరం. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ 2018 నవంబర్ 20న ‘బ్రాహ్మణ పితృస్వామ్యాన్ని తుదముట్టించండి’ అనే పోస్టర్ పట్టుకుని తీవ్ర వివాదాన్ని రేకెత్తించారు. దాన్ని చూడగానే కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆగ్రహోదగ్రులయ్యారు. తివారీ ఆగ్రహం వెనుక సారం లేనప్పటికీ సరిగ్గా మూడేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో మండల్ రాజకీయాల పతాక ధారులు బీఎస్పీ, ఎస్పీలు తన ప్రకటనను సీరియస్‌గా తీసుకుంటారని తివారీ అసలు ఊహించి ఉండరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీని బుజ్జగించడానికి యూపీ వ్యాప్తంగా బ్రాహ్మణ సమ్మేళనాలను నిర్వహిస్తామంటూ బీఎస్పీ ప్రకటించగా, తర్వాత సమాజ్ వాదీ పార్టీ కూడా దానికి వంతపాడింది. ఈ మార్పు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. బీఎస్పీ, ఎస్పీ వంటి మండల్ రిజర్వేషన్ల అనుకూల పార్టీలను తమ రాజకీయాలను పునర్నిర్వచించుకునేలా బీజేపీ ఒత్తిడి పెడుతోందా? తమను తాము కొత్తగా ఆవిష్కరించుంటున్న క్రమంలో ఇన్నాళ్లు ఈ పార్టీలు ప్రబోధిస్తూ వచ్చిన సామాజిక న్యాయం, సెక్యులరిజం సిద్ధాంతాల గతేమిటి అనేది ప్రశ్న. ఇలాంటి మౌలిక పరివర్తనతో ఈ పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం సాధిస్తాయా అన్నదీ ప్రశ్నే. 2019 లోక్ సభ ఎన్నికల పోలింగ్ అనంతరం లోక్‌నీతి–సీఎస్డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం యూపీలో 72 శాతం యాదవేతరులు, కొయిరి–కుర్మీ ఓబీసీలు బీజేపీకే ఓటు వేసినట్లు తేలింది. వీరిలో 18 శాతం మంది మాత్రమే ఘట్బంధన్ కూటమికి ఓట్లేశారు. దిగువ తరగతి ఓబీసీలు, దళితులలో ఇంత మౌలిక మార్పు ఆశ్చర్యం గొలుపుతుంది. ఎందుకంటే బీజేపీలో వారి ప్రాతినిధ్యం కనీస స్థాయిలోకూడా లేదు. ఉత్తరప్రదేశ్‌లో 44.9 శాతం అగ్రకులాలు, 19.7 శాతం ఓబీసీలు గత యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. ప్రధానంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్న బీజేపీకి దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఓట్లు తరలిపోవడం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి ప్రధాన కారణం ఉంది. మండల్ రాజకీయాలు యూపీలోని దిగువ తరగతి ఓబీసీలకు, దళితులకు భౌతికపరంగా (ఉద్యోగాలు, విద్య), రాజకీయపరంగా (రాజకీయ ప్రాతినిధ్యం, గుర్తింపు) ఎలాంటి ప్రయోజనాలు కలిగించలేదు. పలుకుబడిన కొన్ని బీసీ, ఓబీసీ కులాలకు మాత్రమే ప్రయోజనాలు సిద్ధించాయి. ఉదాహరణకు, 2017 అక్టోబర్‌లో నియమించిన కమిషన్ కేంద్ర స్థాయిలో ఓబీసీలో ఉప వర్గీకరణకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేసింది. యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎమ్లతోపాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీల ప్రవేశంపై గత మూడేళ్ల డేటాను చూస్తే 97 శాతం ఓబీసీ కోటా ప్రయోజనాలు ఓబీసీల్లోని 25 శాతం ఉప–కులాలకు మాత్రమే అందాయి. మొత్తం 983 ఓబీసీ కమ్యూనిటీలకు (ఓబీసీల్లో 37 శాతం) ఉద్యోగాలు, అడ్మిషన్లలో సున్నా ప్రాతినిధ్యం దక్కింది. పైగా, ఓబీసీల్లో 10 కమ్యూనిటీలు మాత్రమే 24.95 శాతం ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందాయి. అంటే రిజర్వేషన్లు రెండంచుల కత్తిలాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దిగువ కులాలను ఐక్యం చేయడంలో రిజర్వేషన్లు ఒక సాధనంగా పనిచేసినప్పటికీ, అదే సమయంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇంత అసమానంగా పంపిణీ కావడంతో ఒక విస్తృతస్థాయి సంఘీభావం, సామూహిక కార్యాచరణ దిగువకులాల్లో లోపించింది. అదే సమయంలో ఏక జాతి సిద్ధాంతాన్ని బలంగా ప్రబోధించే బీజేపీ వైపు దీర్ఘకాలిక ఆలోచన లేకుండా ఓబీసీల్లో విశ్వాసం పెరగడానికి కూడా ఇదే కారణం. దిగువ కులాలు చీలిపోవడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం అనేవి మండల్ రాజకీయాలను ద్వంద్వ సంక్షోభంలోకి నెట్టివేశాయి. కుల రాజకీయాల గుణపాఠాలు దిగువ తరగతి ఓబీసీల, దళితుల ఆందోళనలు నిజమైనవే అయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీ నాయకత్వం వీరి సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించడంపై నిర్లక్ష్యం వహించాయి. పైగా వారి సమస్యలను కనీ సంగా గుర్తించడంలో కూడా ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర పరాజయానికి కారణాలను సమీక్షించుకోవడంలో కూడా ఈ రెండు పార్టీలు వెనుకబడ్డాయి. పైగా ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల వ్యూహాల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఉదాహరణకు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభివృద్ధి సాధనను తన నినాదంగా తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ రహదారులు, మెట్రోలు, ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటివి తన ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకుంది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి సామాజిక న్యాయం వైపు దిశ మార్చి మహాపరివర్తనకు అదొక్కటే మార్గమని ఢంకా భజాయించింది. కానీ ఆ రెండు ఎన్నికల్లోనూ ఎస్పీ ఘోర వైఫల్యం చవిచూసింది. అదే సమయంలో బీఎస్పీ సైతం ముస్లిం ఓటర్లను గెల్చుకోవడానికి ప్రయత్నించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 100 టికెట్లను ముస్లింల పరం చేసింది. ఇది కూడా పనిచేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఆ పార్టీ బ్రాహ్మణులను బుజ్జగించడం అనే ప్రయోగం చేస్తోంది. అంటే అభివృద్ది పంథా కానీ మండల్ శైలి రాజకీయాలు కానీ ఈ రెండు పార్టీలకు ప్రయోజనాలు కలిగించలేకపోయాయని స్పష్టమవుతోంది. మరోవైపున బీజేపీ నిస్సందేహంగానే కుల ప్రాతిపదికన ఓటర్ల సమీకరణను పునర్నిర్వచించి, ఓబీసీల్లో కొన్ని సెక్షన్లను మరికొన్ని సెక్షన్లకు వ్యతిరేకంగా నిలిపింది. ఇన్నాళ్లూ తమకు మద్దతు పలికిన వర్గాలను తిరిగి గెల్చుకునే ప్రయత్నం చేపట్టడానికి బదులుగా ఎస్పీ, బీఎస్పీలు తాజాగా బ్రాహ్మణులను బుజ్జగించే పనిలో పడిపోయాయి. తమ రాజకీయాలకు కొత్తదనం తీసుకొచ్చే క్రమంలో ఈ రెండు పార్టీలు దళిత బహుజన రాజకీయాలు, సామాజిక న్యాయం, సెక్యులరిజం మౌలిక సూత్రాలకు భిన్న మార్గంలో పయనిస్తున్నాయి. అందుకే సామాజిక న్యాయం, ఉనికిలో ఉన్న కోటాలను అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించడం, కులాలవారీ జనగణనకు ప్రభుత్వ తిరస్కరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుపర్చడం వంటి అనేక కీలక సమస్యలపై ఈ రెండు పార్టీలు ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోరాటాలను చేపట్టలేకపోయాయి. పైగా, అయోధ్యలో బీఎస్పీ నిర్వహించిన బ్రాహ్మణ్ సమ్మేళనం బీజేపీకీ, బీఎస్పీకి మధ్య తేడా లేకుండా చేసింది. ఆ సమ్మేళనంలో బీఎస్పీ ‘జై శ్రీరాం’ అని నినదించడమే కాకుండా పాలక బీజేపీ కంటే రామాలయాన్ని వేగంగా నిర్మిస్తానని శపథం చేసింది కూడా. యూపీలో ఇటీవలి సంవత్సరాల్లో కులపరమైన అత్యాచారాలు, అణచివేత పెరుగుతున్నప్పటికీ బీఎస్పీ తన మౌలిక విలువలతో రాజీపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద, ఏస్పీ, బీఎస్పీలు తమ రాజకీయాలను సరైన దిశలో నడిపించడానికి బదులుగా సైద్ధాంతిక విలువలను పక్కనబెడుతున్నాయి. బిహార్‌లో ముస్లింలు మజ్లిస్ పార్టీ వైపు తరలిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ పార్టీలు ఇకపై ముస్లిం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించడం కూడా సాధ్యం కాదు. పంకజ్ కుమార్ వ్యాసకర్త పీహెచ్‌డి స్కాలర్, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్,జేఎన్‌యూ -
నేడు పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య తదితరులు పాల్గొంటారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో, వచ్చే సీజన్లో చేపట్టాల్సిన పనులు, గడవులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సమీక్షలో కోరనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో బకాయిపడిన రూ.1,600 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. నిర్వాసితులకు పురావాసం కల్పించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించనున్నారు. -
ఏపీకి 512.04.. తెలంగాణకు 298.96 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు అమల్లోకి(నోటిఫై) వచ్చేవరకూ ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున కేటాయించి, పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమాచారమిచ్చారు. సర్వ సభ్య సమావేశంలో కేంద్రం ప్రతిపాదనను ప్రవేశపెట్టి.. ఇరు రాష్ట్రాల నుంచి లాంఛనంగా ఆమోదం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బచావత్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 కృష్ణా నదీజలాల్లో 75 % లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాలు చేస్తూ ఏపీ, తెలంగాణలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషిన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు పునఃపంపిణీ చేయాలని ఆ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఆదేశించడంతో కేడబ్ల్యూడీటీ–2 గడువును పొడిగించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 ఇరు రాష్ట్రాల వాదనలను వింటోంది. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015, జూన్ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఆ మేరకు 2015–16 నుంచి ఇప్పటివరకూ కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేయడానికి ఏటా ప్రతిపాదనలు చేయడం.. వాటిని ఏపీ, తెలంగాణలు ఆమోదించడం.. ఆ మేరకు నీటిని పంపిణీ చేయడం జరుగుతూ వస్తోంది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రానందున ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం మరోసారి కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది. ఆ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ జూన్ 19, 2015న ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు 2 రాష్ట్రాలకు నీటిని కేటాయించి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. -
మరణించి కూడా ఊరిలో వెలుగులు నింపిన జవాను
మహరాజ్‌గంజ్, యూపీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు. బతికున్నప్పుడు దేశ సేవ కోసం పని చేసి, మరణించిన తర్వాత కూడా తన ఊరి కష్టాలను తీర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్-నేపాల్ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్‌గంజ్‌లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది. పంకజ్ కుమార్ ఊరిలో ప్రాథమిక పాఠశాల కూడా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పాఠశాలనుబాగుచేయాలని ఊరిపెద్దలు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నారు. పంకజ్ కుమార్ త్రిపాఠి వీరమరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటూ ఉన్నతాధికారులు ఆ ఊరికి రావడంతో, ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టిపడింది. పాఠశాల పునర్నిర్మాణపనులు చకచకా ప్రారంభమయ్యాయి. పాఠశాల పేరును కూడా పంకజ్ త్రిపాఠి పేరుగా మార్చారు. అంతేకాకుండా ఊర్లో అధ్వాహ్నంగా ఉన్న రోడ్లకు సంబంధించి మరమత్తు పనులను పూర్తి చేశారు. ఆదిత్యనాథ్ ఆదివారం పంకజ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. పంకజ్‌చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆదిత్యనాథ్ వారికి ప్రభుత్వం తరపున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు. రెండు నెలల 17 రోజుల సెలవు అనంతరం ఫిబ్రవరి 10న పంకజ్ కుమార్ త్రిపాఠి తిరిగి ఉద్యోగంలో చేరారు. పంకజ్ కుమార్, భార్య రోహిణి గర్భిణి. మరికొన్ని రోజుల్లో రాబోయే తమ రెండో సంతానం కోసం వీరిద్దరూ ఎన్నో కలలు కన్నారు. బిడ్డపుట్టగానే ఊర్లో అందరికి పెద్ద పార్టీ ఇస్తానని చెప్పేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పంకజ్ కుమార్ త్రిపాఠికి సంబంధించి కేవలం లైసెన్స్, పాన్ కార్డు మాత్రమే లభ్యమయ్యాయని, చివరి చూపుకూడా చూసుకోలేకపోయామని తండ్రి ఓం ప్రకాశ్ త్రిపాఠి కన్నీటిపర్యంతమయ్యారు. 'పంకజ్ చివరిసారిగా ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14న ఉదయం ఫోన్లో మాతో మాట్లాడాడు. శ్రీనగర్‌కు వెలుతున్నామని, సాయంత్రం వరకు అక్కడికి చేరుకుంటామని నాతో చెప్పాడు. ఉగ్రదాడికి సంబంధించిన వార్తలను రేడియోలో విన్న తర్వాత పంకజ్ ఫోన్‌కు ఎంత ట్రై చేసినా కలవలేదు. ఏ రోజు కూడా సీఆర్పీఎఫ్లో జాయిన్ అవ్వమని నేను నా కుమారుడితో చెప్పలేదు. డబ్బు సంపాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చి మా కళ్ల ముందే ఉండేలా ఏదైనా పని చేసుకోమని మాత్రమే చెప్పేవాడిని' అని ఓం ప్రకాశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. పంకజ్ కుమార్ 2012లో సీఎఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అయ్యాడు. -
ఏటీఎం నుంచి నకిలీ కొత్త కరెన్సీ నోటు!
పాట్నా: నకిలీ నోట్లను, బ్లాక్‌మనీని నిర్మూలిస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన పాత నోట్ల రద్దు ప్రక్రియ ఏ మేరకు అనుకున్న లక్ష్యాన్ని చేధించగలదనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు ఆజ్యం పోస్తూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఐటీ రైడ్స్‌లో దొరకడం, అక్కడక్కడా నకిలీ కొత్త నోట్లు వెలుగులోకి రావడం జరుగుతోంది. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి నకిలీ కొత్త రూ.2000 కరెన్సీ నోటు బయటికి వచ్చినట్టు తెలిసింది. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి అచ్చం ఒరిజినల్ నోటు మాదిరి నకిలీ కొత్త రూ.2000 నోట్లు డ్రా అయినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఈ నోటును అందించినప్పుడు ఇది నకిలీ నోటని అతను తిరస్కరించడంతో ఆశ్చర్యానికి గురైనట్టు పంకజ్ తెలిపాడు. వెంటనే మంగళవారం బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. అదేవిధంగా డుమ్రా పోలీసు స్టేషన్లోనూ దీనిపై ఫిర్యాదుచేసినట్టు చెప్పాడు. పంకజ్ ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని డుమ్రా పీఎస్ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎక్కడైతే పంకజ్ నకిలీ నోటు విత్‌డ్రా చేసుకున్నాడో ఆ ఏటీఎం ఖజానా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ రావు తెలిపారు. ఏటిఎం ఖజానా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారులు సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే వాటికి సీల్ కూడా వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి నకిలీ నోటు విత్‌డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటూ ఈ విషయాన్ని రావు తోసిపుచ్చారు. -
ఇంజనీర్‌ను అపహరించిన మావోయిస్టులు
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇంజనీర్ పంకజ్ కుమార్‌ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. రాంచీ జిల్లాలోని సుమండి గ్రామంలో నిర్మిస్తున్న వంతెనను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం వెళ్లారు. అనంతరం ఆయన అక్కడి నుంచి రాంచీకి వాహనంలో తిరుగు ప్రయాణమైయ్యారు. ఆ క్రమంలో పంకజ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు అడ్డగించి, పంకజ్ కుమార్‌ను మారణాయుధాలతో బెదిరించి తమతోపాటు అడవిలోకి తీసుకువెళ్లారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి భీమ్సేన్ టుటీ వెల్లడించారు. పంకజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు వివరించారు.