సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఢిల్లీలో గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేశాక.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ పంపుతారు. దానిపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనప్పుడు అడ్‌హక్‌గా రూ.పదివేల కోట్లు విడుదల చేసి, రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం లేకుండా చూడటం ద్వారా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి రైతులకు ముందస్తు ఫలాలను అందించడానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు పోలవరానికి నిధుల విడుదలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ పూర్తి చేయడం ద్వారా ముందస్తు ఫలాలను రైతులకు అందించడంపై ఏప్రిల్ 10న రాష్ట్ర జలవనరుల శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కమీషన్ల కక్కుర్తితో, ప్రణాళికారాహిత్యంతో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటంతోపాటు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో కొత్తగా 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అవసరమైన వ్యయంపై సవరించిన ప్రతిపాదనలనుపంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఆ మేరకు తొలిదశ పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లతో సవరించిన వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4న పీపీఏకి పంపింది. ప్రాజెక్టును సమగ్రంగా పూర్తిచేయడం కోసం 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని కోరింది.
వెంటాడుతున్న చంద్రబాబు పాపాలు
♦ విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి. కానీ కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రంపై అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేంద్రం 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు.
♦ 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే రూ.4,730.71 కోట్లను పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని మినహాయిస్తే రూ.15,667.90 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పింది.
♦ భూసేకరణ చట్టం–2013 ప్రకారం పోలవరం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరమైతే.. కేవలం రూ.20,398.61 కోట్లతోనే పోలవరాన్ని పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడం ద్వారా ఆ ప్రాజెక్టుకు సమాధి కట్టారు.
♦ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు రూ.4,730.71 కోట్లు, తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చుచేసింది. చంద్రబాబు అంగీకరించిన మేరకు 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్ల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు వ్యయం చేసింది. దీంతో ఇకపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయాలంటే సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించాలి.
పూర్తిచేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు
కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరానికి నిధుల సమస్యను పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లకు పలుమార్లు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నేపథ్యంలో రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేయడం అసాధ్యమని వివరించారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ వస్తున్నారు. వాటిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ రెండుదశల్లో పోలవరాన్ని పూర్తిచేసేందుకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment