సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు పలు సవరణలు సూచిస్తూ రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై కేంద్రం దృష్టి సారించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ శుక్రవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్‌లకు సూచిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి శనివారం ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపారు.
బోర్డు పరిధిపైనే ప్రధానంగా చర్చ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా.. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత జూలై 15న వాటి పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల లోగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలని, లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేస్తామని పేర్కొంది. షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డులే అధీనంలోకి తీసుకుని.. సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) బలగాల పహారాలో వాటిని నిర్వహిస్తాయని స్పష్టం చేసింది. బోర్డులు సమర్థవంతంగా పని చేయడానికి వీలుగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు జమ చేయాలని దిశానిర్దేశం చేసింది.
అక్టోబర్ 14 నుంచే అమలుకు కేంద్రం దిశా నిర్దేశం
కేంద్రం ఆదేశాల మేరకు గెజిట్ నోటిఫికేషన్ అమలుపై గత నెల 3, 9న బోర్డుల సమన్వయ కమిటీ నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ సర్కార్ గైర్హాజరైంది. ఈ క్రమంలో గత నెల 16న నిర్వహించిన ఉమ్మడి బోర్డుల సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రెండు బోర్డుల చైర్మన్‌లు తమ అభిప్రాయాలను వివరించారు. బోర్డు పరిధి, గెజిట్ నోటిఫికేషన్ అమలు ఖరారుపై సోమవారం నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని చర్చిస్తూనే.. మరో వైపు అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగానే చర్యలు చేపట్టాలని రెండు బోర్డులకు ఇప్పటికే కేంద్రం దిశా నిర్దేశం చేసింది.
సవరణలు చేయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
► కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. ఇదే సమయంలో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నాం.
► కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తీసుకుని, నిర్వహించి.. మిగతా ప్రాజెక్టుల్లో రోజు వారీ నీటి వినియోగాన్ని రెండు రాష్ట్రాల నుంచి సేకరిస్తే సరిపోతుంది. దీని వల్ల కృష్ణా బోర్డుపై భారం తగ్గుతుంది.
► ఉమ్మడి ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలి. మాచ్‌ఖండ్, సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలను గోదావరి బోర్డు నుంచి తప్పించాలి.
► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను అనుమతి ఉన్నట్లుగానే గుర్తించాలి. రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులనే కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనాలి. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు గుర్తించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనను సడలించాలి.
వాయిదా వేయాలి : తెలంగాణ సర్కార్
► నీటి కేటాయింపులు తేలే వరకూ గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలి. అనుమతి లేని ప్రాజెక్టులుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొనడం వల్ల వాటికి రుణాలు తెచ్చుకోవడం సమస్యగా మారుతుంది.
► అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతి తెచ్చుకోవాలన్న నిబంధనలను సడలించాలి.
Comments
Please login to add a commentAdd a comment