సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు గడువు సమీపిస్తోంది. కానీ.. ఇప్పటికీ షెడ్యూల్–2లో ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందా.. లేదంటే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి కృషిచేస్తుందా.. అన్నది ఆసక్తిగా మారింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటుచేస్తూ 2014 మే 28న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కానీ పరిధిని కేంద్రం ఖరారు చేయకపోవడంవల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో బోర్డులు ప్రభావం చూపలేకపోతున్నాయి.
2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే బోర్డుల పరిధిని ఖరారుచేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు నీటి కేటాయింపులు జరిగే వరకు బోర్డుల పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోసిపుచ్చుతూ బోర్డుల పరిధిని ఖరారు చేస్తామని తేల్చిచెప్పారు.
తరువాత కేంద్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసేలా చేస్తోంది. ఇలా ఏపీ హక్కులను కాలరాస్తుండటాన్ని గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ
ఏపీ హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై సీఎం జగన్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 15న రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసింది. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి ఆరునెలల్లో అంటే 2022 జనవరి 15న అమల్లోకి రావాలి. నోటిఫికేషన్ అమలుపై పలుమార్లు బోర్డులతో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు.
ఒకేసారి సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు డిపాజిట్ చేయలేమని, ఎప్పటికప్పుడు నిర్వహణ వ్యయాన్ని అందజేస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది.
అలాగే అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకునేందుకు ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లు సమర్పించింది. కానీ, తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్‌లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును ఆరునెలలు పొడగిస్తూ ఫిబ్రవరి 2న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ నోటిఫికేషన్లు ఈనెల 15 నుంచి అమలు కావాల్సి ఉంది.
కుదరని ఏకాభిప్రాయం
గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎం.పి.సింగ్, ఎం.కె.సిన్హా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పాతపాటే పాడుతోంది. దీంతో ఈనెల 15 నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును కేంద్రం మరోసారి పొడగిస్తుందా? లేదంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధకు కృషిచేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
కృష్ణా, గోదావరి గెజిట్లు అమలయ్యేనా?
Published Mon, Jul 4 2022 2:57 AM | Last Updated on Mon, Jul 4 2022 2:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment