సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం నిర్వహించిన రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఏపీ ప్రభుత్వం తరఫున రెండు బోర్డుల్లో సభ్యులైన జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ తరఫున సభ్యులైన ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ గైర్హాజరయ్యారు. దాంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన రెండు బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి.
నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ఇరు రాష్ట్రాలతో చర్చించి.. బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేసుకోవాలని కేంద్రం దిశానిర్దేశం చేసిందని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని అందజేయాలని కోరగా.. ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. నోటిఫికేషన్‌లో కొన్ని అంశాలను సవరించాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రాజెక్టులను కూడా బోర్డుల పరిధిలోకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి ప్రాజెక్టులు మినహా అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని నెలలోగా అందజేస్తామని చెప్పారు.
ఒకేసారి రూ.200 కోట్లు ఎందుకు..
బోర్డులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా సీడ్ మనీ కింద ఒక్కో బోర్డు ఖాతాలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. రెండు బోర్డుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని.. ఆయా బోర్డులు పంపిన బిల్లులను 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని గెజిట్ నోటిఫికేషన్‌లో ఉందని ఏపీ అధికారులు ఎత్తి చూపారు. దీనివల్ల బోర్డుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ దృష్ట్యా ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున రెండు బోర్డులకు రూ.400 కోట్లను డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ఏపీ అధికారులు ప్రశ్నించారు. గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు 60 రోజుల్లోగా సీడ్ మనీ జమ చేయాల్సిందేనని చైర్మన్లు చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు స్పష్టం చేశారు.
విభజన చట్టంలో ప్రాజెక్టులకు రక్షణ..
విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులు.. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేంద్రం రక్షణ కల్పించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. కానీ.. గెజిట్ నోటిఫికేషన్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు తప్పుగా పడిందని.. ఆ ప్రాజెక్టుకు రక్షణ కల్పించాలని ఏపీ అధికారులు కోరారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్ బలగాలతో భద్రత కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్ శక్తి శాఖ చర్చలు జరుపుతోందని చెప్పారు.
రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను మాత్రమే బోర్డుల అధీనంలోకి తీసుకుని.. వాటికే సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తే వ్యయం తగ్గుతుందని, లేదంటే భద్రత వ్యయం భారీగా పెరుగుతుందని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని బోర్డుల చైర్మన్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచే అమల్లోకి వస్తుందని.. సమయం తక్కువగా ఉండటంతో బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయడానికి ఇకపై తరచుగా సమావేశాలు నిర్వహిస్తామని.. సహకరించాలని చేసిన సూచనకు ఏపీ అధికారులు సానుకూలంగా స్పందించారు. సమావేశానికి తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో మళ్లీ బోర్డుల ఉమ్మడి భేటీని నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment