'అప్ప'నంగా.. ఇదేందప్పా? | Andhra Pradesh government to write letter to Ministry On Jal Shakti | Sakshi
Sakshi News home page

'అప్ప'నంగా.. ఇదేందప్పా?

Published Mon, Jan 31 2022 4:40 AM | Last Updated on Mon, Jan 31 2022 5:00 AM

Andhra Pradesh government to write letter to Ministry On Jal Shakti - Sakshi

సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులే లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అవాస్తవాలను వల్లె వేస్తోంది. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ గత నెల 6న నిర్వహించిన హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పించడంపై ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

బచావత్‌ ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ–1) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఇప్పటిదాకా నోటిఫై చేయని నేపథ్యంలో అప్పర్‌ భద్రకు సాంకేతిక, పెట్టుబడి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అప్పర్‌ భద్రను నిలుపుదల చేసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. అయితే  రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా, కర్ణాటకను సమర్థిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్‌(సౌత్‌) విభాగం డైరెక్టర్‌ ఎన్‌.ముఖర్జీ ఈనెల 12న జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నెల 25న దీన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి జల్‌ శక్తి శాఖ పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసలు ఏపీ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ వివరణ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం... 

► ఏపీ సర్కార్‌ అభ్యంతరం–1: విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీల నీటి వినియోగం తగ్గిందని కర్ణాటక చెబుతున్న లెక్కలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునలే కొట్టిపారేసింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్‌ భద్రకు బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ 9 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అప్పర్‌ భద్ర హైడ్రాలజీపై పునఃసమీక్షించాలి. 
► సీడబ్ల్యూసీ సమాధానం: బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆధారంగానే అప్పర్‌ భద్రకు సాంకేతిక అనుమతి ఇచ్చాం. ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం అంశాన్ని సాంకేతిక అనుమతి 
ఇచ్చేటప్పుడు పరిశీలించాం. 
► ఏపీ సర్కార్‌: అప్పర్‌ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ను కర్ణాటక సర్కార్‌ కోరింది. తుంగభద్రలో నీటి లభ్యత లేనందున అప్పర్‌ భద్రకు నీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్‌ నిరాకరించింది. విజయనగర చానళ్లు, భద్ర, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని ట్రిబ్యునలే తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్‌ భద్రకు ఇచ్చిన హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌ తప్పు. దాన్ని పునఃసమీక్షించాలి. 

► ఏపీ సర్కార్‌ అభ్యంతరం–2: మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి కర్ణాటక సర్కార్‌ 2002లో నియమించిన కమిటీ తుంగభద్రలో ఆరు టీఎంసీలు మిగులు ఉందని తేల్చింది. కానీ ఆ ఆరు టీఎంసీలను అటు బచావత్‌గానీ ఇటు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌గానీ కర్ణాటకకు కేటాయించలేదు. 

► సీడబ్ల్యూసీ: ఆరు టీఎంసీలు మిగులు జలాలు కాదు. కర్ణాటకకు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో భాగమే. కే–8, కే–9 సబ్‌ బేసిన్‌లలో చిన్న నీటివనరుల విభాగంలో ఉపయోగించుకోని ఆరు టీఎంసీలను అప్పర్‌ భద్రకు కేటాయించామని కర్ణాటక సర్కార్‌ పేర్కొంది. 
► ఏపీ సర్కార్‌: కే–8, కే–9 సబ్‌ బేసిన్‌లలో చిన్న నీటివనరుల విభాగంలో నీటి వినియోగం తగ్గిందన్న కర్ణాటక వాదనపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? అక్కడ నీటి వినియోగం పెరిగిందేగానీ తగ్గలేదు. 

► ఏపీ సర్కార్‌ అభ్యంతరం–3: బచావత్‌ ట్రిబ్యునల్‌ తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేటాయించింది. కానీ తుంగభద్ర డ్యామ్‌కు 1976–77 నుంచి 2007–08 వరకూ ఏటా సగటున 186.012 టీఎంసీలే వచ్చాయి. అప్పర్‌ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు ప్రవాహం మరింత తగ్గిపోతుంది. ఇది కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది.  

► సీడబ్ల్యూసీ: కర్ణాటక సర్కార్‌ 2019 నవంబర్‌ 27న జారీ చేసిన జీవో 176 ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో 21.50 టీఎంసీలు, గోదావరి ట్రిబ్యునల్‌ ప్రకారం వచ్చే అదనపు నీటిలో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 సబ్‌ బేసిన్‌లలో మిగిలిన ఆరు టీఎంసీలు వెరసి 29.90 టీఎంసీలతో అప్పర్‌ భద్రను చేపట్టినందున దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదు. 
► ఏపీ సర్కార్‌: బచావత్‌ ట్రిబ్యునల్‌ అప్పర్‌ భద్రకు ఒక్క చుక్క కూడా కేటాయించలేదు. అలాంటప్పుడు 21.5 టీఎంసీలు ఎక్కడ నుంచి వచ్చాయి? సబ్‌ బేసిన్‌లలో ఆరు టీఎంసీల మిగులు లేదు. కర్ణాటక కట్టుకథలనే సీడబ్ల్యూసీ వల్లె వేయడం ధర్మం కాదు. 

► ఏపీ అభ్యంతరం–4: వేదవతిపై వాణీవిలాసాగర్, బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ల మధ్య కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. దీన్ని తుంగలో తొక్కుతూ అప్పర్‌ భద్రలో అంతర్భాగంగా పరశురాంపుర వద్ద బ్యారేజీని కర్ణాటక నిర్మిస్తోంది. 
► సీడబ్ల్యూసీ: 2020 డిసెంబర్‌ 24న నిర్వహించిన సాంకేతిక సలహా మండలి సమావేశం దృష్టికి పరశురాంపుర బ్యారేజీ నిర్మాణం రాలేదు. అప్పర్‌ భద్ర డీపీఆర్‌లో కూడా ఆ బ్యారేజీ విషయం లేదు. 
► ఏపీ సర్కార్‌: అప్పర్‌ భద్ర ప్రాజెక్టులో అంతర్భాగంగా పరశురాంపుర బ్యారేజీ నిర్మిస్తున్నట్లు కర్ణాటక సర్కార్‌ టెండర్లు పిలిచింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? 

► ఏపీ అభ్యంతరం–5: అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌ ఇచ్చేటప్పుడు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. అప్పర్‌ భద్ర డీపీఆర్‌లను మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు పంపకుండానే అనుమతి ఇచ్చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? 
► సీడబ్ల్యూసీ: బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పర్‌ భద్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 
► ఏపీ సర్కార్‌: బచావత్‌ ట్రిబ్యునల్‌ అప్పర్‌ భద్రకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడం కాదా? 

► ఏపీ అభ్యంతరం–6: అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ప్రతిపాదనపై చర్చించేందుకు డిసెంబర్‌ 6న నిర్వహించిన హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నీటి వాటాలు, హైడ్రాలజీ గురించి వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు విషయంలో పరివాహక రాష్ట్రాలకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? 

► సీడబ్ల్యూసీ: హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశం మినిట్స్‌ ఇంకా రావాల్సి ఉంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగానే అప్పర్‌ భద్రకు అనుమతి ఇచ్చాం. 
► ఏపీ సర్కార్‌: బచావత్‌ ట్రిబ్యునల్‌ అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ ట్రిబ్యునల్‌ తీర్పును పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చామనడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాల్సిందే. 

ఇదీ అప్పర్‌ భద్ర ప్రాజెక్టు..
అప్పర్‌ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. అయితే మాస్టర్‌ ప్లాన్, ఆధునికీకరణ, కృష్ణా డెల్టాకు పోలవరం మళ్లింపు జలాల్లో వాటా, పునరుత్పత్తి జలాలు, కృష్ణా బేసిన్‌లో అదనపు మిగులు జలాలు తదితరాల రూపంలో   తమకు 30.4 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్‌ భద్ర ద్వారా వాడుకుంటామని ప్రకటించింది. 
► అప్పర్‌ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. 
► ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి 2019 వరకూ రూ.4,830 కోట్లను ఖర్చు చేసిన కర్ణాటక సర్కార్‌ అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ పంపింది. 
► 2020 డిసెంబర్‌ 24న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో  అప్పర్‌ భద్రకు రూ.16,125.48 కోట్లతో (2018–19 ధరల ప్రకారం) పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతేడాది మార్చి 25న జల్‌శక్తి శాఖ ఆమోదముద్ర వేసింది. 
► ఈ రెండు అనుమతుల ఆధారంగా దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించే అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై గత డిసెంబర్‌ 6న జల్‌ శక్తి శాఖ హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement