సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా ఖరారుచేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్‌సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ–సవరించిన వ్యయ కమిటీ)ని ఏర్పాటుచేస్తూ గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు.
కేంద్ర జల్‌శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ (పీపీఓ) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచామిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్‌సీసీకి సీడబ్ల్యూసీ సీఈ (పీఏఓ) యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ ఖరారుచేసిన సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి రెండు వారాల్లోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌సీసీని ఆదేశించారు.
ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌శక్తి శాఖ పంపనుంది. పీఐబీ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలిదశ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి 2013–14 ధరల ప్రకారం కేవలం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు.
కానీ, 2013, భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది.. కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లు దండుకోవడమే. 2016, సెప్టెంబరు 7 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు అదే చేశారు. ఇదే అంశాన్ని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు.
ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ సవరించిన వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారుచేస్తూ ఈనెల 13న కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి, పీఐబీకి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, సంబంధిత ప్రాజెక్టును ప్రతిపాదించే శాఖ అధికారులతో ఆర్‌సీసీని ఏర్పాటుచేయాలని 2016, సెప్టెంబరు 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌సీసీ ఇచ్చే నివేదికే అత్యంత కీలకం. దీనిని యథాతథంగా పీఐబీ ఆమోదించనుంది.
తొలిదశ పూర్తికాగానే రెండో దశ..
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు) స్థాయిలో నీటిని నిల్వచేయాలంటే.. ఇటీవల లైడార్ సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే 90 గ్రామాల పరిధిలోని 171 ఆవాసాల్లోని 37,568 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో ఇప్పటికే 12,658 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మరో 24,910 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి.
తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలంటే 137గ్రామాల పరిధిలోని 200 ఆవాసాల్లో 64,155 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశలో, రెండో దశలో నీటిని నిల్వచేయాలంటే ముంపునకు గురయ్యే 1,10,879 హెకార్ల భూమిని సేకరించాలి.
మరోవైపు.. తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేశాక.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్ల వరకూ 194.6 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం నిల్వచేయనుంది. రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి సవరించిన అంచనా వ్యయాన్ని తొలిదశ పనులు పూర్తయ్యే నాటికి కేంద్రం ఆమోదించనుంది.
‘పోలవరం’పై మరో ముందడుగు
Published Fri, Oct 20 2023 4:54 AM | Last Updated on Fri, Oct 20 2023 2:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment