సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధికారులను అభినందించారు. షెడ్యూల్ ప్రకారం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఫైలెట్ ఛానల్ పూర్తి చేసి గోదావరి వరదను సమర్ధంగా మళ్లించారని రాష్ట్ర జలవనరుల అధికారులను, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని అభినందించారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య పడిన అగాధాలను మళ్లీ వరద వచ్చేలోగా పూడ్చివేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా ‘యు’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానించాలని చెప్పారు.
తద్వారా వరదల్లోనూ ప్రధాన (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్) డ్యామ్ పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ముంపు ప్రభావంపై సోమవారం ఢిల్లీలో పంకజ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, పీపీఏ సీఈవో శివనందన్ కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్యూసీ) చైర్మన్ కుష్వీందర్ వోరా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పీపీఏ, రాష్ట్ర జల వనరులు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సవరించిన అంచనాలకు సానుకూలం
ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సీడబ్యూసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్ 45.72 మీటర్ల వరకు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2017–18 సవరించిన అంచనాల్లో పేర్కొన్నామని చెప్పారు. కానీ మరో 36 గ్రామాలు కూడా ముంపు పరిధిలోకి వస్తాయని, ఆ గ్రామాల్లో నిర్వాసితులకూ పునరావాసం కల్పించాలని కోరారు. దీనిపై పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.
నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల్లో లైడార్ సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు వినతి పత్రాలు ఇచ్చారన్నారు.
తొలుత 41.15 మీటర్ల వరకు, ఆ తరువాత 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతెంత నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్యూసీ చైర్మన్ వోరాను ఆదేశించారు. ప్రాజెక్టు సత్వర పూర్తికి అడ్‌హాక్‌గా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నిధులు ఎంత అవసరమో తేల్చడానికి పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నాలుగు రోజుల్లో సీడబ్యూసీ చైర్మన్ వోరా సమావేశం కానున్నారు.
బ్యాక్ వాటర్ ప్రభావం ఉండదు
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో భూమి ముంపునకు గురవుతోందని సుప్రీం కోర్టులో తెలంగాణ, ఒడిశా, చతీస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చేసిన కేసుపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాతో సీడబ్యూసీ సర్వే చేసిందని, అందులో బ్యాక్ వాటర్ ప్రభావం ఏ మాత్రం ఉండదని వెల్లడైందని అధికారులు వివరించారు. సుప్రీం కోర్టు నియమించిన గోపాలకృష్షన్ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. సీడబ్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ సుప్రీం కోర్టుకు కేంద్రం తరపున చెప్పాల్సిన అంశాలను స్పష్టం చేస్తామన్నారు.
ఈ నెలాఖరులోగా పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెలాఖరులోగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం వస్తారని వెదిరె శ్రీరాం చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్ స్పందిస్తూ విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో నీటి పారుదల విభాగం వ్యయం మొత్తాన్ని భరించాల్సిన బాధ్యత కేం‘ద్రానిదేనని పునరుద్ఘాటించారు. ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
పోలవరం పనులు భేష్..
Published Tue, Apr 11 2023 2:21 AM | Last Updated on Tue, Apr 11 2023 2:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment