Ministry Of Jal Shakti Approval For Polavaram New Diaphragm Wall, Details Inside - Sakshi
Sakshi News home page

Polavaram Project: కొత్త డయాఫ్రమ్‌ వాల్‌!

Published Mon, Jul 10 2023 4:32 AM | Last Updated on Mon, Jul 10 2023 9:45 AM

Ministry Of Jal Shakti Approval For Polavaram New diaphragm wall - Sakshi

డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రాంతం

సాక్షి, అమరావతి: పోలవరం ఈసీ­ఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం ఆవశ్యకతపై నివేదిక సమ­ర్పిం­చడమే అజెండాగా కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌­కుమార్‌ సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహి­స్తు­­న్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తుది నిర్ణయం తీసుకోను­న్నారు.

పోలవరం నిర్మాణ ప్రాంతంలో భౌగోళిక పరిస్థి­తుల కారణంగా వరద ప్రవాహాన్ని దిగువకు పంపే స్పిల్‌ వేను గోదావరి కుడి గట్టుకు అవతల రాతి నేలపై.. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల  పొడవున ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను మూడు భాగాలుగా (గ్యాప్‌–1లో 564, గ్యాప్‌–2లో 1,750, గ్యాప్‌–3­లో 140 మీటర్లు) గోదావరి గర్భంలో ఇసుక తిన్నెలపై నిర్మించేలా సీడ­బ్ల్యూ­సీ డిజైన్‌ను రూపొందించింది. ఈసీ­ఆర్‌­ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ను నిర్మించారు. గ్యాప్‌–1, గ్యాప్‌­–2­­లో పునాది డయా­ఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ పేర్కొంది.


కమీషన్ల కోసం చంద్రబాబు ఘోర తప్పిదం..
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను తొలుత పూర్తి చేసి ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు కట్టాలి. వాటి మధ్యన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–2లలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి. కానీ చంద్రబాబు కమీషన్ల దాహంతో స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే గ్యాప్‌–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని 2018 జూన్‌ 11 నాటికి పూర్తి చేసి ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఇరువైపులా 800 మీటర్ల పొడవున ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు.

ఈ నేపథ్యంలో గోదావరికి 2019 అక్టోబర్‌లో భారీ వరద వచ్చింది. 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడంతో 800 మీటర్లకు కుచించుకుపోయింది. దీంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌ వాల్‌ కోతకు గురై దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నిర్వాకాల కారణంగా పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఆ తప్పిదాలను సరిదిద్దేందుకు రూ.2,020 కోట్లకుపైగా వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.
 
► సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేశారు. గోదావరి వరదను మళ్లించాక ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌–1లో 393 మీటర్ల పొడవుతో డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. వరద ఉద్ధృతికి గ్యాప్‌–1లో డయాఫ్రమ్‌ వాల్‌కు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు.

► వరదల ఉద్ధృతికి గ్యాప్‌–2లో జి.కొండ కుడివైపున 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకూ 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌ గత సర్కారు నిర్వాకాలతో దెబ్బతింది. 

► దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టతపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌) నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించి 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకూ 185 మీటర్ల మేర డయాఫ్రమ్‌ వాల్‌ ధ్వంసమైనట్లు తేల్చారు. 

► 480 నుంచి 510 మీటర్ల మధ్య 30 మీటర్ల మేర డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. 950 – 1,020 మధ్య 70 మీటర్ల మేర దెబ్బతినగా 1,170 నుంచి 1,370 మీటర్ల వరకూ 200 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు తేల్చారు. అంటే 1,396 మీటర్ల పొడవున నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌లో 485 మీటర్ల మేర పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. 

► 363 మీటర్ల నుంచి 1,035 మీటర్ల వరకూ 672 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్‌ పైభాగంలో ఐదు మీటర్ల మేర దెబ్బతిన్నట్లు ఎన్‌హెచ్‌పీసీ స్పష్టం చేసింది. 

డ్యామ్‌ భద్రత దృష్ట్యా..
దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా ‘యూ’ ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించి పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని తొలుత సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ప్రతిపాదించారు. అయితే ఈ పనులు చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేయలేదు. అంతిమంగా ఇది డ్యామ్‌ భద్రతకే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఈనెల 3న కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాత డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న చోట్ల సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించడం కంటే డ్యామ్‌ భద్రత దృష్ట్యా 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికే జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మొగ్గు చూపారు. దీనిపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వాలని జల్‌ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించడంతో నేడు ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో 75 శాతం (నికర జలాలు) లభ్యత ఆధారంగా ఏటా సగటున 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం తాజాగా తేల్చింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 484.7 టీఎంసీలను వినియోగించుకోవడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌ (జీడబ్ల్యూడీటీ) మన రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది.

అంటే ట్రిబ్యునల్‌ అనుమతించిన దాని కంటే పోలవరం వద్ద గోదావరిలో నికర జలాల లభ్యత 13.37 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సబ్‌ బేసిన్ల వారీగా గోదావరిలో నీటి లభ్యతను తేల్చాకే రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోరాయి. దీంతో గోదావరి బోర్డు ఆ బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించింది. 

పోలవరానికి సగటున 1,198.35 టీఎంసీలు
తెలుగు రాష్ట్రాల పరిధిలో పెన్‌గంగా (జీ–7), ప్రాణహిత (జీ–9), దిగువ గోదావరి (జీ–10), ఇంద్రావతి(జీ–11), శబరి (జీ–12) పరీవాహక ప్రాంతాలలో 1971–72 నుంచి 2011–12 మధ్య 41 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధా­రంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో గోదావరిలో ఏటా 1,435 టీఎంసీల నికర జలాల లభ్యత ఉంటుందని తేల్చింది.

పోలవరం వద్దకు ఏటా సగటున 1,198.35 టీఎంసీల ప్రవాహం వస్తుందని అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని  తేల్చింది. పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల మధ్య ఏటా సగటున 778.39 టీఎంసీల ప్రవాహం ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే 45.83 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement