సాక్షి, అమరావతి: పోలవరం డిజైన్ల ఆమోద ప్రక్రియలో ముందడుగు పడింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చివేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు సంబంధించిన డిజైన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది. పోలవరం పెండింగ్ డిజైన్లపై బుధవారం ఢిల్లీలో షెకావత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లతోపాటు గ్యాప్–2లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, స్పిల్ చానల్ ఎడమ గట్టును పటిష్టం చేయడంపై ఢిల్లీ ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో నిపుణులతో చర్చించి ఈనెల 25లోగా డిజైన్లను కొలిక్కి తేవాలని షెకావత్ ఆదేశించారు. ఈనెల 28న లేదా 29న మళ్లీ సమావేశం నిర్వహించి ఆ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద ఉధృతితో కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత అదనపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.
దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమం..
దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 నుంచి 660 మీటర్ల వరకూ 220 మీటర్ల పొడవున గోదావరి వరద ఉధృతికి 36 మీటర్ల లోతున కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లు వేసి పూడ్చేలా రూపొందించిన డిజైన్‌పై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఇటీవల నిర్వహించిన సమావేశంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, పీపీఏ, సీడబ్ల్యూసీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వెదిరె శ్రీరాం ఇదే అంశాన్ని షెకావత్‌కు వివరించడంతో డిజైన్‌ను ఆమోదించాలని సీడబ్ల్యూసీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సీడబ్ల్యూసీ అధికారులు అక్కడికక్కడే ఆమోదించారు. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది.
ఈసీఆర్‌ఎఫ్ డిజైన్లు కొలిక్కి..
పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా గోదావరికి అడ్డంగా ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మించాలి. గ్యాప్–3లో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్‌ను ఇప్పటికే నిర్మించారు. గ్యాప్–1లో 5505 మీటర్లు, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవుతో ఈసీఆర్‌ఎఫ్ నిర్మించాలి. గోదావరి వరద ఉధృతితో గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. గ్యాప్–1, గ్యాప్–2 ఈసీఆర్‌ఎఫ్ డిజైన్లతోపాటు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై షెకావత్ సమీక్షించారు. స్పిల్ వే ఎడమ గట్టును పటిష్టం చేసే డిజైన్‌ను కొలిక్కి తేవాలని ఆదేశించారు.
సీఎం జగన్ విజ్ఞప్తిపై స్పందించిన షెకావత్
జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ ఈనెల 4న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడం, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 తదితర డిజైన్ల ఆమోదంలో పీపీఏ, సీడబ్ల్యూసీ జాప్యం వల్ల పనులకు అంతరాయం కలుగుతోందని షెకావత్ దృష్టికి సీఎం తెచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున మూడు నెలల పాటు సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు దోహదం చేస్తుందని సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనకు షెకావత్ అంగీకరించారు. ఈ క్రమంలో పెండింగ్ డిజైన్లపై ఈనెల 10న వెదిరె శ్రీరాం సమీక్ష నిర్వహించి షెకావత్‌కు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగానే షెకావత్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment