![Estimated Cost required to complete the first phase of Polavaram - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/10/polavaram.jpg.webp?itok=8jazCf6p)
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముందస్తు ఫలాలను రైతులకు అందించడానికి సత్వరమే తొలి దశ పనులను పూర్తి చేయాలని, ఇందు కోసం రూ.16,952.07 కోట్లు తక్షణమే విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఏప్రిల్ 10న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు పూర్తి చేయడానికి అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రతిపాదన పంపినట్లు పేర్కొంది.
వీటితో పాటు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు సమగ్రంగా పూర్తి చేయడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్‌కు జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు..
♦ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు విడుదల చేయాలని 2022 జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, అందులో రూ.10,485.38 కోట్లు మంజూరు చేయాలని సీడబ్ల్యూసీ కేంద్ర జల్ శక్తి శాఖకు 2022 ఏప్రిల్ 21న సిఫార్సు చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ డిజైన్లు ఖరారయ్యాక ప్రాజెక్టు తొలి దశ తుది ప్రతిపాదనలు పంపాలని గతేడాది జూన్ 15న సీడబ్ల్యూసీ (జాతీయ ప్రాజెక్టుల విభాగం) డైరెక్టర్ సూచించారు.
♦ ఈ ఏడాది మార్చి 4, 5న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ప్రాజెక్టును సందర్శించి.. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో గోదావరి వరదల ఉద్ధృతికి ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చటం, గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌లో దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే విధానాన్ని ఖరారు చేసింది. ఈ పనులకు రూ. 2,020.05 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
♦ డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌తో సహా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపాలని ఏప్రిల్ 10న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
♦ ప్రధాన డ్యామ్‌తో సహా కాలువల్లో మిగిలిన పనులకు రూ.6,593.02 కోట్లు, డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, అగాధాలను పూడ్చటానికి రూ.2,020.05 కోట్లు, ప్రాజెక్టు నిర్వహణకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు రూ.945 కోట్లు అవసరం.
♦ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 123 ముంపు గ్రామాల్లో మిగిలిన భూమి సేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.2,177 కోట్లు, ఎడమ కాలువలో కుమ్మరలోవ గ్రామంలో భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.90 కోట్లు అవసరం.
♦ ప్రాజెక్టు 41.15 మీటర్ల పరిధిలో అదనంగా ముంపునకు గురయ్యే 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాల పునరావాసానికి రూ.5,127 కోట్లు ఖర్చవుతుంది. వెరసి తొలి దశ పనులను సమగ్రంగా పూర్తి చేయడానికి రూ.16,952.07 కోట్లు అవసరం.
♦ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు కేంద్ర జల్ శక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
నిధులు ఇస్తే సత్వరమే పోలవరం..
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇస్తే షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయొచ్చు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే రూ.4,730.71 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లు ఖర్చు చేసింది.
అంటే.. కేంద్రం 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్లకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో పీపీఏ ఖర్చులతో కలిపి కేంద్రం రూ.14,418.89 కోట్లను రీయింబర్స్ చేసింది. ఈ నేపథ్యంలో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించి.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment