estimated cost
-
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.30,437 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం తాజా (2023, మార్చి) ధరల ప్రకారం రూ.30,436.95 కోట్లు అని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) 2023 అక్టోబర్ 19న తేల్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో చెప్పారు. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కోతకు గురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ పునరుద్ధరణ, డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులకు రూ.2,620.24 కోట్లు ఖర్చువుతుందని ఆర్సీసీ అంచనా వేసిందని మంగళవారం టీడీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చేలా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చేశారని, ఇది ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి దోహదపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. నిధుల సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబువిభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు.. 2016 సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. 2013–14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు పనులకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు పోను మిగతా రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబితే దానికీ తలూపారు. నిజానికి 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.24 కోట్లు. కానీ.. ప్రాజెక్టు మొత్తాన్ని రూ.15,667.90 కోట్లతోనే పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం.సంక్షోభం నుంచి తప్పించిన వైఎస్ జగన్వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని అనేకమార్లు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని.. ప్రాజెక్టును రెండో దశల్లో పూర్తి చేద్దామని, తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు, ఆ తర్వాత 45.72 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేద్దామని చెప్పారు. ఆ మేరకు తొలి దశ పనుల పూర్తికి (డయాఫ్రం వాల్ పునరుద్ధరణ, మరమ్మతులతో కలిపి) తాజా ధరల ప్రకారం రూ.31,625.37 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనాలకు 2023 జూలైలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదముద్ర వేసి, ఆర్సీసీకి నివేదించింది. వాటిని పరిశీలించిన ఆర్సీసీ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా నిర్ధారించింది. నాడు మోకాలడ్డి.. నేడు వినతులుపోలవరం తొలి దశలో ఇప్పటివరకూ అయిన పనులకు చేసిన వ్యయం, కేంద్రం రీయింబర్స్ చేసిన మొత్తంపోనూ మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని గత మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అజెండా నుంచి తప్పించింది. ఇలా ఆ నిధులకు మోకాలడ్డిన చంద్రబాబే.. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం తొలి దశకు ఇవ్వాల్సిన రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని, ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
వార్ధా ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్‌ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని.. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది. మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్‌లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది. -
పోలవరం తొలి దశ పూర్తికి రూ.16,952 కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ముందస్తు ఫలాలను రైతులకు అందించడానికి సత్వరమే తొలి దశ పనులను పూర్తి చేయాలని, ఇందు కోసం రూ.16,952.07 కోట్లు తక్షణమే విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఏప్రిల్ 10న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు పూర్తి చేయడానికి అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రతిపాదన పంపినట్లు పేర్కొంది. వీటితో పాటు ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకు సమగ్రంగా పూర్తి చేయడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి, నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈవో శివ్‌నందన్‌కుమార్‌కు జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు విడుదల చేయాలని 2022 జనవరి 10న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, అందులో రూ.10,485.38 కోట్లు మంజూరు చేయాలని సీడబ్ల్యూసీ కేంద్ర జల్ శక్తి శాఖకు 2022 ఏప్రిల్ 21న సిఫార్సు చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ డిజైన్లు ఖరారయ్యాక ప్రాజెక్టు తొలి దశ తుది ప్రతిపాదనలు పంపాలని గతేడాది జూన్ 15న సీడబ్ల్యూసీ (జాతీయ ప్రాజెక్టుల విభాగం) డైరెక్టర్ సూచించారు. ♦ ఈ ఏడాది మార్చి 4, 5న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ప్రాజెక్టును సందర్శించి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో గోదావరి వరదల ఉద్ధృతికి ఏర్పడిన భారీ అగాధాలను పూడ్చటం, గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌లో దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేసే విధానాన్ని ఖరారు చేసింది. ఈ పనులకు రూ. 2,020.05 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ♦ డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌తో సహా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు పంపాలని ఏప్రిల్ 10న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ♦ ప్రధాన డ్యామ్‌తో సహా కాలువల్లో మిగిలిన పనులకు రూ.6,593.02 కోట్లు, డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, అగాధాలను పూడ్చటానికి రూ.2,020.05 కోట్లు, ప్రాజెక్టు నిర్వహణకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు రూ.945 కోట్లు అవసరం. ♦ 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 123 ముంపు గ్రామాల్లో మిగిలిన భూమి సేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.2,177 కోట్లు, ఎడమ కాలువలో కుమ్మరలోవ గ్రామంలో భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి రూ.90 కోట్లు అవసరం. ♦ ప్రాజెక్టు 41.15 మీటర్ల పరిధిలో అదనంగా ముంపునకు గురయ్యే 36 గ్రామాల్లోని 16,642 కుటుంబాల పునరావాసానికి రూ.5,127 కోట్లు ఖర్చవుతుంది. వెరసి తొలి దశ పనులను సమగ్రంగా పూర్తి చేయడానికి రూ.16,952.07 కోట్లు అవసరం. ♦ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు కేంద్ర జల్ శక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు ఇస్తే సత్వరమే పోలవరం.. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో బిల్లులు చెల్లించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇస్తే షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయొచ్చు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందే రూ.4,730.71 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రూ.16,218.78 కోట్లు వెరసి.. రూ.20,949.49 కోట్లు ఖర్చు చేసింది. అంటే.. కేంద్రం 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.20,398.61 కోట్లకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా రూ.550.88 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో పీపీఏ ఖర్చులతో కలిపి కేంద్రం రూ.14,418.89 కోట్లను రీయింబర్స్ చేసింది. ఈ నేపథ్యంలో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించి.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
అలా.. జల విహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్ నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్ ప్రారంభమవగా సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ విరామం అనంతరం సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. బోటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది! పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. – ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
జరిమానా వద్దులే..నజరానా ఇస్తాం
సాక్షి, అమరావతి : సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన సర్కారు నజరానాల వర్షం కురిపిస్తోంది. అంచనా వ్యయాన్ని పెంచి ఇప్పటికే రూ.120.93 కోట్ల మేర లబ్ది చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచి రూ.268.93 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లలో రెండుసార్లు అంచనా వ్యయాన్ని పెంచడంపై ఆర్థికశాఖ అభ్యంతరాలు బుట్టదాఖలయ్యాయి. అంచనాలు పెంచి మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు... విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగాండ్రేడు వద్ద చంపావతి నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును నిర్మించి కొత్తగా 24,710 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 8,172 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే పనులకు 2005 ఫిబ్రవరి 19వతేదీన రూ.220.04 కోట్లతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. బొల్లినేని శీనయ్యకు చెందిన సీఆర్18జీ–బీఎస్పీసీఎల్(జేవీ) ఈ ప్రాజెక్టు పనులను రూ.181.50 కోట్లకు దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2008 మే నెల నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి చేయకపోవడంతో గడువు మరో రెండేళ్లు పొడిగించారు. అయితే ఆ గడువు కూడా దాటిపోయినా పనులు పూర్తి చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌పై వేటు వేయాల్సిన టీడీపీ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ప్రాజెక్టు డిజైన్ మారడం వల్ల తనకు గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్ మొండికేయడంతో 2015లో మట్టికట్టలో 2.200 కి.మీ. నుంచి 5.749 కి.మీ. వరకూ, 0.00 నుంచి 0.890 కి.మీ. వరకు (డైక్–1) పనులను సీఆర్18జీ–బీఎస్పీసీఎల్ నుంచి తప్పించారు. ఆ పనుల విలువ రూ.51.30 కోట్లే. కానీ వాటి అంచనా వ్యయాన్ని రూ.172.23 కోట్లకు పెంచేసి బొల్లినేని శీనయ్యకే చెందిన ఎస్సీఎల్ (శీనయ్య కంపెనీ లిమిటెడ్) ఇన్‌ఫ్రాటెక్‌కు కట్టబెట్టేశారు. అంటే రూ. 120.93 కోట్ల మేరకు కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.220.04 కోట్ల నుంచి 471.31 కోట్లకు పెంచేస్తూ 2015 సెప్టెంబరు 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకూ కేవలం రూ.37.34 కోట్ల విలువైన 20.57 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నోటీసులిచ్చిన అధికారులపై చిందులు.. ఒప్పందం మేరకు పనులు చేయడంలో విఫలమైన కాంట్రాక్టర్‌కు గత అక్టోబర్‌లో 61–సీ నిబంధన కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్టర్ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సొరంగం, కుడి, ఎడమ కాలువ పనుల నుంచి తొలగించి రూ.99.77 కోట్ల అంచనాతో గత డిసెంబర్ 17న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీడీఎస్‌ఎస్ నిబంధనల ప్రకారం ఇందులో 95 శాతాన్ని పాత కాంట్రాక్టర్ నుంచి జరిమానాగా వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్ దీన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తేవడంతోపాటు కోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు టెండర్లను నిలుపుదల చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు అందుకు భిన్నంగా చీవాట్లు పెట్టినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. పనులు గిట్టుబాటు కాకుంటే కొట్టినా సరే కాంట్రాక్టర్లు పనులు చేయరంటూ తీర్మానించిన ప్రభుత్వ పెద్దలు అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.471.31 కోట్ల నుంచి రూ.740.24 కోట్లకు పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆర్థికశాఖ అభ్యంతరాలు బేఖాతర్.. తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు కోసం మరో 136.14 ఎకరాల భూమిని సేకరించాలి. 799 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 2015 సెప్టెంబరు 19న అంచనా వ్యయం పెంచిన సమయంలోనే భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి నిధులు కేటాయించారు. అంటే తాజాగా అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు కేవలం కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమేనని స్పష్టమవుతోంది. ఆర్థిక శాఖ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్లలోనే అంచనా వ్యయాన్ని రూ.268.93 కోట్లు ఎలా పెంచేస్తారంటూ ప్రశ్నించింది. పనుల పరిమాణం పెరగడం వల్లే అంచనా వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందన్న జలవనరుల శాఖ వాదనను కొట్టిపారేసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆర్థిక శాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
అంచనాల్లో ఇంత అరాచకమా!?
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లోని లోపాలను కేంద్రం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్)తో పోల్చితే.. 2013–14 ఎస్ఎస్ఆర్ ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం అధికంగా ఉండటంపై నివ్వెరపోయింది. హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాల్లో భారీగా అంతరాలు ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. భూసేకరణ.. సహాయ, పునరావాస ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణ నివేదికలపై ఈనెల 12 నుంచి ఢిల్లీలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని.. వాటికి సంబంధిత అధికారులు హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహేతుకమైన వివరణలు ఇస్తే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను ఆమోదించి.. సాంకేతిక సలహా మండలి (టీఏసీ)కి పంపుతామని తెలిపింది. సవరణల్లో లోపాలను అధ్యయనం చేయండి పోలవరం పనుల పురోగతి, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు మసూద్ హుస్సేన్, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్కే గుప్తా, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల (2010–11 ధరల ప్రకారం) నుంచి 2013–14 ధరల ప్రకారం రూ.57,940.86 కోట్లకు సవరిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిలో కేంద్ర జలవనరుల శాఖ ఎత్తిచూపిన లోపాలపై గత నెల 13న రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఆ నివేదికపై ఈ నెల 12లోగా సమగ్రంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్ ఆదేశించారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీపైనా అనుమానాలు ఇదిలా ఉంటే.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్ల నుంచి రూ.33,225.74 కోట్లకు పెరగడంపై కూడా కేంద్రం అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగకపోయినా ముంపునకు గురయ్యే భూమి రెండింతలకు చేరడం, ముంపు గ్రామాలు పెరగడం, నిర్వాసితుల కుటుంబాల సంఖ్య భారీగా పెరగడంపై అధ్యయనం చేసి, పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. అంతలోనే ఇంత తేడానా.. పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.6,600.56 కోట్లనీ.. ఇందులో కేవలం స్పిల్ వే, ఈసీఆర్ ఆఫ్ పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ఆధారంగా రూ.4,054 కోట్ల నుంచి రూ.5535.41 కోట్లకు పెంచారని.. ఈ లెక్కన 2015–16 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయం రూ.8,081.41 కోట్ల అవుతుందని కేంద్ర జలవరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ పేర్కొన్నారు. కానీ.. 2013–14 ధరల ప్రకారం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.11,338.37 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలు తక్కువగా ఉంటాయని.. ఆ లెక్కన అంచనా వ్యయం తగ్గాల్సి ఉండగా ఎందుకు పెరిగిందని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ నిలదీశారు. 2015–16 ధరల ప్రకారం ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు పెంచారని, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు పెంచారనీ.. కానీ 2013–14 ధరల ప్రకారం పంపిన ప్రతిపాదనల్లో ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 4,476.96 కోట్లకు, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,644.13 కోట్లకు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
‘తెలుగుగంగ’లో రూ.100 కోట్లకు ఎసరు!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినకాడికి దిగమింగడమే ప్రభుత్వ పెద్దలు పనిగా పెట్టుకున్నారు. రూ.172.99 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.180.48 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ.99.79 కోట్ల మేర పెంచినట్లు స్పష్టమవుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో ముఖ్యనేత సాగిస్తున్న అక్రమాలకు ఇదో తార్కాణం. ఈ వ్యవహారంలో రూ.100 కోట్ల మేర ముడుపులు చేతులు మారనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంచనాల్లో వంచన తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ 2007 మార్చి 20న రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ ఈ ఏడాది మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో మిగిలిపోయిన పనులను సన్నిహిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు. ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్ చేయడం, 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ చానల్ 0.00 కి.మీ. నుంచి 7.380 కి.మీ. వరకూ లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ, మార్చి 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యనేత హుకుం తెలుగుగంగ కాలువ లైనింగ్ పనుల అంచనా వ్యయాన్ని మళ్లీ పెంచేయాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెచ్చారు. దాంతో అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న జల వనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంచనా వ్యయంతో తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యనేత హుకుం జారీ చేశారు. ఈ పనుల అంతర్గత విలువను రూ.239.03 కోట్లగా నిర్ణయించిన అధికారులు.. ఈ నెల 16న ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 30వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. 31న టెక్నికల్ బిడ్, ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచి టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. కి.మీ.కు రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తారట! టెండర్లు పిలిచిన పనుల్లో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ. నుంచి 18.20 కి.మీ. వరకూ లైనింగ్ పనులు మాత్రమే కొత్తగా చేపట్టాల్సినవి. ప్రధాన కాలువ 18.200 కి.మీ. నుంచి 42.566 కి.మీ. వరకూ.. కేవలం 800 నుంచి 900 మీటర్ల పొడవున మాత్రమే లైనింగ్ పనులు మిగిలిపోయాయి. బీసీఆర్ లింక్ చానల్లో 650 మీటర్ల పనులు మాత్రమే గతంలో చేయకుండా వదిలేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కేవలం 19.650 కి.మీల. పొడవున మాత్రమే లైనింగ్ చేయాలి. ప్రభుత్వం ఖరారు చేసిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే కి.మీ.కు సగటున రూ.12.16 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి కిలోమీటర్‌కు రూ.7 కోట్లకు మించి వ్యయం కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జీఎస్టీ, లేబర్ సెస్, సీనరేజీ చార్జీల రూపంలో మరో రూ.36.29 కోట్లు కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. టీడీపీ ఎంపీ సంస్థకు పనులు దక్కేందుకే.. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించడం గమనార్హం. సాధారణంగా ‘పేవర్’ అనే యంత్రంతో కాలువల లైనింగ్ చేసిన అనుభవం ఉన్న కాంట్రాక్టర్లే బిడ్ దాఖలుకు అర్హులని నిబంధన పెడతారు. కానీ, పేవర్తోపాటు ‘షార్ట్ క్రీటింగ్’ విధానంలో చేసి పనులు ఉండాలనే నిబంధన పెట్టడం గమనార్హం. ఈ విధానంలో పనులు చేసిన అనుభవం టీడీపీ రాజ్యసభ సభ్యుడి సంస్థకు ఉండటం వల్లే.. ఆ నిబంధనను ప్రత్యేకంగా పెట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పోలవరం కల సాకారమెలా?
⇒ బడ్జెట్లో రూ.9 కోట్లు మాత్రమే కేటాయించిన రాష్ట్ర సర్కార్ ⇒ కేంద్రం నాబార్డు ద్వారా రూ.6,880 కోట్ల రుణం ఇప్పిస్తుందని అంచనా! ⇒ 2018 నాటికి పాక్షికంగా,2019 నాటికి పూర్తిగా ప్రాజెక్టు సిద్ధమవుతుందని హామీ అమరావతి: రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. అయితే కేంద్రం.. నాబార్డు నుంచి రూ.6,880 కోట్లను రుణంగా ఇప్పిస్తుందని అంచనా వేసింది. కానీ గతేడాది డిసెంబర్ 26న నాబార్డు ద్వారా వచ్చిన రూ.1,981.54 కోట్ల వినియోగానికి సంబంధించిన వినియోగపత్రాలు పంపితేనే కేంద్రం మరో దఫా రుణం ఇప్పించే అవకాశం ఉంటుంది. అంతేతప్ప రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2010–11 ఎస్ఎస్ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఏప్రిల్ 1, 2014 నుంచి చేసిన ఖర్చును మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తామని స్పష్టం చేసింది. ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా రుణం ఇప్పిస్తామని తేల్చిచెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ ప్రతిపాదనలు పంపింది. ఏటా ధరల సర్దుబాటు కింద పది శాతం అంచనా వ్యయం పెరుగుతుందని.. 2019 నాటికి అంచనా వ్యయం రూ.42 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదించింది. ఏప్రిల్ 1, 2014 నుంచి గత ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3,762.52 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలా అరకొరగానే కేటాయింపులు చేస్తూ.. 2019 నాటి పోలవరంను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అలా పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభు త్వ అంచనాల ప్రకారమే మరో రూ.33 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.9 కోట్లు. మరోవైపు నాబార్డు రుణం మంజూరు అనుమానాస్పదమే. 2019 నాటికి పోలవరం ఎలా పూర్తవుతుందో చంద్రబాబే చెప్పాలి. -
పెరిగిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు
-
గాలేరు-నగరి.. ఆగుతూ.. సాగుతూ!
అంచనాలు పెంచినా అలసత్వమే గత నెలతోనే ముగిసిన నిర్మాణ గడువు జూన్ నాటికే పూర్తి చేస్తామన్న సీఎం, మంత్రి వచ్చే ఏడాది జూన్ వరకు గడువు పొడిగింపు కర్నూలు సిటి: నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా పురోగతి కరువయింది. ఈ ఏడాది జూన్ నాటికి గాలేరు-నగరి పనులు పూర్తి చేసి గండికోటకు కృష్ణా జలాలను తరలిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించినా.. మాటలకే పరిమితమయింది. మాటలకు.. చేతలకు పొంతన లేని పరిస్థితి చూస్తే ప్రాజెక్టులను అనుకున్న గడువులోపు పూర్తి చేయడం అసాధ్యమనే విషయం ఇట్టే అర్థమవుతుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి నిర్మాణ పనుల గడువు గత నెలతో ముగిసింది. మరోసారి గడువు పెంపునకు హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి పంపగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లక్ష్యం.. శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలింపుతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. ఇప్పుడెక్కడ.. రూ.2155.45 కోట్లతో ఫేజ్-1 పనులను పది ప్యాకేజీలుగా విభజించి ప్రారంభించారు. ఇటీవల రూ.2800.89 కోట్లకు అంచనాలు పెంచారు. గత నెలతో గడువు ముగియగా.. మరో ఏడాది పొడిగించారు. ప్యాకేజీల వారీగా పనుల తీరుతెన్నులివీ - 24వ ప్యాకేజీ: మే నెలతో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కావాలని కాంట్రాక్టర్ కోరారు. పోతిరెడ్డిపాడు వద్ద బానకచర్ల వరకు చేపట్టిన కాల్వ విస్తరణ పనులు 94.13 శాతం పూర్తయ్యాయి. - 25 ప్యాకేజీ: బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఎస్ఆర్బీసీ కాల్వను విస్తరించి సామర్థ్యం మేరకు అదనపు గేట్ల పనులు 90 శాతం పూర్తి కావచ్చాయి. అంచనా వ్యయం రూ.186.8 కోట్ల నుంచి 372.90.95 కోట్లకు చేరుకుంది. ఇందులో 167.16 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగియగా.. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు కోరారు. - 26 ప్యాకేజి: ప్రధాన కాల్వ 25.076 కి.మీ నుంచి 56.775 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.257.85 కోట్ల నుంచి రూ.584 కోట్లకు పెంచారు. సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి 76.20 శాతం పని చేశారు. గతనెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువును ప్రతిపాదించారు. - 27వ ప్యాకేజీ: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 17 కి.మీ వరకు గాలేరు కాల్వ పనులు 82 శాతం చేపట్టారు. అంచనా వ్యయం రూ.290 కోట్ల నుంచి రూ.414 కోట్లకు చేరుకుంది. ఇందులో సుమారు రూ.340 కోట్లు ఖర్చు చేశారు. గత నెల 30తో గడువు ముగిసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు కోరారు. - 28, 28ఏ ప్యాకేజీలు: గాలేరు-నగరి కాల్వ 20వేల క్యుసెక్కుల సామర్థ్యం మేరకు 17 కి.మీ నుంచి 46 కి.మీ వరకు విస్తరణ పనులు, నిర్మాణాలు చేపట్టారు. అంచనా వ్యయం రూ.214 కోట్ల నుంచి రూ.340.45 కోట్లకు చేరుకోగా, 83 శాతం పనులు పూర్తయ్యాయి. గత నెల జూన్‌తో గడువు ముగిసింది. ఇందులో 28వ ప్యాకేజీ పనులకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు, 28ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచాలని కోరారు. - 29, 29ఏ ప్యాకేజీ: గాలేరు కాల్వ 46 కి.మీ నుంచి 57.70 కి.మీ వరకు విస్తరణ పనుల అంచనా వ్యయం రూ.229.39 కోట్ల నుంచి రూ.310.51 కోట్లకు పెరిగింది. ప్రధాన కాల్వ పనులు 93 శాతం, నిర్మాణ పనులు 72.85 శాతం పూర్తయ్యాయి. గత నెలతోనే గడువు ముగిసింది. 29వ ప్యాకేజీకి వచ్చే ఏడాది జూన్.. 29ఏ ప్యాకేజీకి సెప్టెంబర్ వరకు గడువు కోరారు. - 30వ ప్యాకేజీ: అవుకు వద్ద రెండు సొరంగాలు ఒక్కోటి 10వేల క్యుసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫాల్ట్ జోన్లో కాంక్రీట్ పనులకు ఇటీవలే రీడిజైన్ సీఈ సీడీఓ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. రూ.519 కోట్ల అంచనాలో రూ.425 కోట్లు ఖర్చు చేశారు. పనులు 82 శాతం పూర్తి చేశారు. పనుల పూర్తికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువు కోరారు. - ఓసీ 50 ప్యాకేజీ: ఎస్ఆర్బీసీ 56 కి.మీ వద్ద 12 టీఎంసీల సామర్థ్యంతో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇటీవల అంచనా వ్యయం రూ.448 కోట్ల నుంచి రూ.601 కోట్లకు చేరింది. 88 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువివ్వాలని ప్రతిపాదించారు. నెలాఖరులోపు ప్రధాన కాల్వ పనులు పూర్తి చేస్తాం గత నెలతోనే గాలేరు-నగరి నిర్మాణ గడువు ముగిసింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చింది. ప్రధాన కాల్వ పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేస్తాం. గండికోటకు నీరు తీసుకెళ్లే ఉద్దేశంతో పనులు వేగంగా చేయిస్తున్నాం. 21,700 క్యుసెక్కుల స్థానంలో.. 10వేల క్యుసెక్కుల నీరు తీసుకెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. - చిట్టిబాబు, సీఈ, కర్నూలు జల వనరుల శాఖ ప్రాజెక్ట్స్ -
మన్నవరం మందగమనం
అంచనా వ్యయం రూ.6వేల కోట్లు నేటికి వెచ్చించింది రూ.100కోట్లు ఐదేళ్లు దాటుతున్నా కనిపించని పురోగతి ఎంపీ పరిశీలనలో బయుటపడిన నిజాలు వున్నవరం(శ్రీకాళహస్తి రూరల్): చిత్తూరు జిల్లాకు తలవూనికంగా నిలుస్తుందని అందరూ భావించిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్బీపీపీఎల్ పనులు నత్తనడకన కొనసాగుతున్నారుు. ఐదేళ్లు దాటుతున్నా పది శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6వేలు కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు వూత్రం చేశారు. దీన్నిబట్టి ఇక్కడ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్‌రావు శనివారం వున్నవరం పరిశ్రవులను పరిశీలించడానికి వెళితే కొన్ని నిజాలు బయుటపడ్డారుు. ఉన్నతాశయంతో వైఎస్సార్ రూపకల్పన దివంగత వుుఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో 2009లో శ్రీకాళహస్తి వుండలం వున్నవరం సమీపంలో భెల్-ఎన్టీపీసీ సంయుుక్త భాగస్వావ్యుంతో రూ. 6వేల కోట్ల వ్యయుంతో విద్యుత్ ఉపకరణాల విడి భాగాలు తయూరీ చేసే ప్రాజెక్టు నిర్మించటానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అనుమతులు తీసుకొచ్చారు. దీనివల్ల 6వేల వుందికి ప్రత్యక్షంగాను వురో 20వేల వుందికి పరోక్షంగాను ఉపాధి కల్పించాలని వైఎస్ సంకల్పించారు. అరుుతే వైఎస్సార్ అనంతరం, అప్పటి వుుఖ్యవుంత్రి రోశయ్యు 2010, సెప్టెంబర్ 1న శంకుస్థాపన చేశారు. వెచ్చించింది వంద కోట్లు ఇక్కడ ఎన్బీపీపీఎల్ పరిశ్రవు స్థాపనకు రూ. 6వేలు కోట్లు అంచనా వేశారు. అరుుతే పరిశ్రవు స్థాపించి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికి కేవలం రూ.100 కోట్లు వూత్రమే ఖర్చు చేశారు. ఇందులో రూ.75 కోట్లు భవనాలు, రోడ్లు, ప్రహరీగోడ, అంతర్గత రహదారుల నిర్మాణాలకు ఖర్చు చేశారు. అరుుతే ఇప్పటికీ ఫ్యాబ్రికేషన్ పనులు నిర్మాణ దశలోనే ఉన్నారుు. మిగతా రూ.25కోట్లతో చిన్నచిన్న పరికరాలు వూత్రం కొనుగోలు చేశారు. 2013 నాటికి ఉత్పత్తులు ప్రారంభించాలని... 2013లో ఉత్పత్తులు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో రూ.1200 కోట్లు వెచ్చించి ఉత్పత్తులు ప్రారంభించాలని అంచనా వేశారు. రెండో విడతలో రూ.4800 కోట్లతో పనులు పూర్తి చేసి పూర్తి స్థారుులో ఉత్పత్తులు సాధించాలని ప్రణాళికలు వేశారు. అరుుతే ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇక్కడ ఉత్పత్తులకు బదులు ఇతర పరిశ్రవుల నుంచి విద్యుత్ ఉపకరణాల విడిభాగాలు కొనుగోలు చేసి విక్రరుుస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులను విదేశాలకు ఎగువుతి చేయూల్సి ఉండగా ఉత్పత్తి లేకపోవడంతో కొనుగోలు చేసుకుని విక్రరుుంచాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ విభాగంలో ప్రత్యక్షంగా 25 వుందికి, పరోక్షంగా 40 వుందికి వూత్రమే ఉపాధి కల్పించారు. -
గుదిబండగా కృష్ణపట్నం..!
- విద్యుత్ ప్లాంట్‌పై 5,250 కోట్ల అదనపు వ్యయం - పెట్టుబడిని అమాంతం పెంచి చూపిన ఏపీ జెన్కో - యోగదారులపై చార్జీల మోతకు కుట్ర - తెలంగాణకూ భారం కానున్న విద్యుత్ కొనుగోలు -సీఈఆర్సీకి చిక్కకుండా ఏపీ సర్కారు దొంగాట హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ అంచనా వ్యయం తడిసి మోపెడైంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) నిర్దేశించిన అంచనాలతో పోల్చితే దాదాపు రూ. 5,250 కోట్ల వ్యయం అధికంగా అయినట్లు ఏపీ జెన్కో తాజాగా లెక్కలేసింది. దీన్నే సాకుగా చూపించి ప్రజలపై విద్యుత్ చార్జీల వాత పెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఈ ప్లాంట్ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ రావాల్సి ఉంది. దీంతో కృష్ణపట్నంలో అదనపు వ్యయం ఫలితంగా అక్కడినుంచి వచ్చే విద్యుత్ కొనుగోలు చార్జీలు కూడా పెరిగి భవిష్యత్తులో తెలంగాణ వినియోగదారులపైనా భారం పడే ప్రమాదముంది. కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల సామర్థ్యం గల తొలి యూనిట్లో చేపట్టిన వాణిజ్య ఉత్పత్తి గత వారంలో విజయవంతమైంది. రెండో యూనిట్లో మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఇందులో న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన వాటాను పంపిణీ చేసేందుకు ఏపీ మోకాలడ్డుతోంది. మరోవైపు దొంగదెబ్బ తీసినట్లుగా ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచేయడంతో రెండు రాష్ట్రాల వినియోగదారులపై పెనుభారం పడటం ఖాయమైంది. సీఈఆర్సీ 2011 అక్టోబర్‌లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అంచనా వ్యయం ఒక్కో యూనిట్‌కు సగటున రూ. 4.59 కోట్లకు మించకూడదు. రైల్వే లైన్లు, లింకింగ్ పాయింట్, లోకోమోటివ్ లైన్లు, అన్లోడింగ్ పాయింట్లు తదితరాలను పరిగణించినా ఈ ఖర్చు యూనిట్‌కు రూ. 4.75 కోట్లకు మించదని విద్యుత్ నిపుణులు లెక్కతేల్చారు. ఈ లెక్కన కృష్ణపట్నంలో తొలి రెండు యూనిట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 7,600 కోట్లకు మించకూడదు. కానీ ఇప్పటికే రూ. 12,850 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ జెన్కో లెక్కలేసుకుంది. అంటే రూ. 5,250 కోట్ల అదనపు వ్యయాన్ని చూపింది. ఎందుకింత ఖర్చయిందన్నది అంతుచిక్కకుండా ఉంది. నిబంధనల ప్రకారం రెండు వేల మెగావాట్ల సామర్థ్యాన్ని మించిన ప్లాంట్లను కేంద్రం మెగా పవర్ ప్లాంట్లుగా గుర్తిస్తుంది. వీటి నిర్మాణానికి ప్రత్యేక రాయితీలు ఇస్తుంది. మూడు యూనిట్లుగల కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం 2,400 మెగావాట్లు. దీంతో దీనికి కేంద్రం నుంచి రాయితీలను ఏపీ అందుకుంది. కేంద్ర ఇంధన శాఖ నిబంధనల ప్రకారం మెగా పవర్ ప్లాంట్లలో 10 శాతం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణపట్నం నుంచి కేరళకు పదిశాతం కరెంట్ ఇచ్చే ప్రతిపాదనలున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 53.89 శాతం వాటా ఉండటం, కేరళకు 10శాతం వాటా ఇవ్వనుండటంతో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 79(2) ప్రకారం కృష్ణపట్నం కేంద్రం అంతర్రాష్ట్ర ప్లాంటుగా సీఈఆర్సీ పరిధిలో ఉంటుంది. ఈ లెక్కన కృష్ణపట్నం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు.. చార్జీలు నిర్ణయించే అధికారం సీఈఆర్సీ పరిధిలోనే ఉంటుంది. కానీ దీన్ని ఏపీఈఆర్సీ పరిధిలోనే ఉంచాలని, తద్వారా చేసిన తప్పులన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత ఏడాది ఏపీఈఆర్సీకి ఏపీజెన్కో సమర్పించిన పీపీఏల కవరింగ్ లెటర్‌లోనే ఈ ప్లాంటు సీఈఆర్సీ పరిధికి చెందినదని నివేదించింది. అదే విషయాన్ని వేలెత్తి చూపిన ఏపీఈఆర్సీ ఈ ప్లాంటు పీపీఏలు తమ పరిధిలోకి రావంటూ ఆగస్టులోనే తిప్పిపంపాయి. ఆరు నెలలు గడచినా ఈ ఫైలును సీఈఆర్సీకి పంపించకుండా ఏపీజెన్కో తొక్కిపెట్టింది. ఈలోగా అంచనా వ్యయం రూ. 5,250 కోట్లకుపైగా పెంచడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయనేది అనుమానాస్పదంగా మారింది. వినియోగదారులపై చార్జీల భారం పెంచే హైడ్రామాలో భాగంగానే పెట్టుబడులను పెంచారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. కృష్ణపట్నం ప్లాంటుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందాలు, చార్జీల నిర్ణయాన్ని సీఈఆర్సీకి అప్పగించకపోతే పెట్టుబడుల భారంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.