భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వ్యయం... రూ.13,057 కోట్ల నుంచి రూ.19,800 కోట్లకు సవరణ ప్రతిపాదనలు
పాలనా అనుమతులు కోరిన సీఈ
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది.
తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు.
సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం.
16 ప్యాకేజీలుగా కాల్వల పనులు
3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది.
ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు.
గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది.
దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment