సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్‌ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది.
మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని..
ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది.
రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది.
మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది.
ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.
1.34 లక్షల ఎకరాల ఆయకట్టు..
ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్‌లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment