సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాకే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇవ్వడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వాటి అనుమతిని పునఃసమీక్షించి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. దీనిపై గోదావరి బోర్డు చైర్మన్ ఎమ్కే సిన్హా స్పందిస్తూ.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తామన్నారు.
ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను నమోదు చేసి సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఎమ్కే సిన్హా అధ్యక్షతన గోదావరి బోర్డు 14వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ తరఫున ఈఎన్‌సీ నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
కడెం–గూడెం ఎత్తిపోతల, మోదులకుంటవాగు ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కడెం–గూడెం ఎత్తిపోతల డీపీఆర్‌లోనే కడెం వాగులో 17 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొందని.. అలాంటప్పుడు గోదావరి నుంచి 11.5 టీఎంసీలను ఎత్తిపోయాల్సిన అవసరం ఏముంటుందని నిలదీసింది. నీటి లభ్యత, వాటా తేల్చే దాకా కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేందుకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది.
తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారు
చనాకా–కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా.. కనీసం తమను సంప్రదించకుండా సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ ఎలా అనుమతి ఇస్తుందని ఏపీ అధికారులు నిలదీశారు. దీనిపై వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ (హైడ్రాలజీ విభాగం) డైరెక్టర్ నిత్యానందరాయ్ స్పందిస్తూ.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఆ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి ఇచ్చామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో 1,430 నుంచి 1,480 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. గత ఐదేళ్లలో సగటున 1,600 టీఎంసీల లభ్యత ఉందని.. వాటి ఆధారంగానే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామన్నారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగని నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశారు. దీనిపై నిత్యానందరాయ్ స్పందిస్తూ.. ఇకపై ఏపీ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
పోలవరం బ్యాక్‌వాటర్‌పై తెలంగాణ పేచీ
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం పరిసర ప్రాంతాలు భారీ ఎత్తున ముంపునకు గురవుతున్నాయని.. దీనిపై మళ్లీ అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని చర్చించడానికి గోదావరి బోర్డు సరైన వేదిక కాదన్న ఏపీ అభిప్రాయంతో ఎమ్కే సిన్హా ఏకీభవించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తిందని గుర్తు చేశారు.
బ్యాక్‌వాటర్ ప్రభావం అంశాన్ని పీపీఏలోనే చర్చించాలని తేల్చిచెప్పడంతో తెలంగాణ కూడా అంగీకరించింది. కాగా ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఆధునికీకరణకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఆయకట్టు ఆధారంగా ఆధునికీకరణకు అయ్యే వ్యయాన్ని దామాషా పద్ధతిలో ఏపీ 85 శాతం, తెలంగాణ 15 శాతం భరించనున్నాయి. అలాగే గోదావరి ప్రాజెక్టులపై 23 చోట్ల టెలీమీటర్లను ఏర్పాటు చేసి నీటి వినియోగాన్ని లెక్కించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు నిర్వహణకు 2023–24లో చెరో రూ.ఐదు కోట్ల చొప్పున విడుదల చేయడానికి కూడా సమ్మతించాయి.
నీటి లభ్యత తేల్చాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి
Published Wed, Jan 4 2023 4:11 AM | Last Updated on Wed, Jan 4 2023 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment