సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతపై అంచనా వేసి, నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా ట్రిబ్యునల్ పంపిణీ చేసేవరకు తెలంగాణ సర్కార్ సమర్పించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని కేంద్రం, గోదావరి బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గోదావరి జలాల విషయంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లకు గురువారం రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు లేఖ రాశారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చినప్పుడు నీటిలభ్యతను అధికంగా చూపించారని, దానిపై తమ అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల వల్ల పోలవరం, గోదావరి డెల్టాకు నీటిలభ్యత తగ్గుతుందని, ఆ ప్రాజెక్టును ఆమోదిస్తే దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందని స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిన గోదావరి బోర్డు.. అక్టోబర్ 6లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై అభిప్రాయాలను చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖలో కొన్ని ప్రధానాంశాలు..
► ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావరిలో 991.19 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో వ్యాప్కోస్ లెక్కగట్టింది. పోలవరం వద్ద 460.36 టీఎంసీల మిగులు ఉంటుందని తేల్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం వద్ద 315.54 టీఎంసీలే మిగులు ఉంటుంది.
► పోలవరం వద్దకు సగటున 561 టీఎంసీల ప్రవాహం వస్తుందని లెక్కకట్టిన సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు 2006 సెప్టెంబర్ 12న హైడ్రాలాజి క్లియరెన్స్ ఇచ్చింది. కానీ పోలవరం వద్ద నీటిలభ్యత 460.36 టీఎంసీలే ఉంటుందని సీతారామ ఎత్తిపోతల డీపీఆర్‌లో ఉండటంపై 2018లోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. 2018లో 32 టీఎంసీల సామర్థ్యంతో డీపీఆర్ ఇచ్చిన తెలంగాణ ఇప్పుడు సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో పోలవరం, గోదావరి డెల్టాలకు తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది.
► పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా అవసరాలు 554.81 టీఎంఎసీలు. పోలవరం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిన సమయంలో పోలవరం ప్రాజెక్టులో 34.92 టీఎంసీల ఆవిరి నష్టాలు ఉంటాయని తేల్చింది. పోలవరం కుడి, ఎడమ కాలువల అదనపు అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, ముసురుమిల్లి, వెంకటనగరం, భూపతిపాలెం, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, మాచ్‌ఖండ్ తదితర ప్రాజెక్టుల అవసరాలు లెక్కిస్తే.. గోదావరిలో 75 శాతం నీటిలభ్యత కింద రాష్ట్ర వాటా 775 టీఎంసీలు.
► ఈ నేపథ్యంలో 2018 ఫిబ్రవరి 15న కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణమే గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అంచనా వేయించాలి. ఎగువ రాష్ట్రాలు పూర్తిచేసిన, నిర్మాణంలో ఉన్న, చేపట్టనున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీటి కేటాయింపులు చేయాలి. ఆ తర్వాతే డీపీఆర్‌లను ఆమోదించాలి.
‘సీతారామ’ డీపీఆర్‌ను ఆమోదించొద్దు
Published Fri, Oct 1 2021 4:29 AM | Last Updated on Fri, Oct 1 2021 4:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment