wardha
-
వార్ధా ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్‌ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని.. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది. మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్‌లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది. -
సర్వోదయ పాదయాత్ర మొదలు
సాక్షి, హైదరాబాద్/భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలో సోమవారం నుంచి ‘సర్వోదయ పాదయాత్ర’ మొదలు కాబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని వార్దా వరకు 600 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించ నున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం వెల్లడించారు. శనివారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆదివారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ పాల్గొంటారని చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం, 75 ఏళ్ల భూదా నోద్యమ స్ఫూర్తిని ప్రజలకు మరోసారి చాటిచెప్పడమే యాత్ర ఉద్దేశమ న్నారు. పాదయాత్రలో వివిధ రాష్ట్రాల సర్వోదయ మండలికి చెందిన 25 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. యాత్ర కన్వీనర్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అసమాన తలు పోగొట్టడానికి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి పేదవారికి భూమి ఇచ్చామన్నారు. కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికిచ్చిన భూమిని లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. కాగా, రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ చైర్మన్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో పాదయాత్ర జరగనుంది. రాష్ట్రంలో 26 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో యాత్ర కొనసాగు తున్న సమ యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓ రోజు పాల్గొననున్నారు. -
‘ఎవరినీ ప్రేమించం.. ప్రేమ పెళ్లి చేసుకోం’
ముంబై: వాలెంటైన్స్‌డేను పురస్కరించుకుని ప్రేమికులంతా సంబరాల్లో మునిగిపోయిన వేళ ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థినుల చేత ‘ప్రేమ’కు వ్యతిరేకంగా ప్రమాణాలు చేయించింది. తాము ఎప్పుడూ ప్రేమలో పడబోమని.. ప్రేమ వివాహం చేసుకోబోమని ప్రతిజ్ఞ చేయించింది. ఈ మేరకు.. ‘‘ఎవరినీ ప్రేమించం. ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లం. ప్రేమ వివాహం చేసుకోం. అంతేకాదు కట్నం అడిగేవారిని సైతం మేం పెళ్లి చేసుకోం. మా అమ్మానాన్నలకు మేం విధేయులుగా ఉంటాం’’ అని మరాఠా భాషలో విద్యార్థినుల చేత చెప్పించారు. మహారాష్ట్రలోని అమరావతిలో గల మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ మాట్లాడుతూ... ఎవరి మాయలో పడబోమని విద్యార్థులు కచ్చితంగా ఇలాంటి ప్రమాణం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వార్ధా ఘటన లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కాలేజీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇక కాలేజీ యాజమాన్యం చర్యను సమర్థిస్తూ ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘ అసలు ప్రేమ వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలి. వాళ్లు మనకోసం మంచి వ్యక్తినే ఎంపిక చేస్తారు కదా. కాబట్టి ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది’’ అని పేర్కొంది. కాగా మహారాష్ట్రలోని వార్దాకు చెందిన పాతికేళ్ల మహిళా లెక్చరర్‌ను ప్రేమ పేరుతో వేధించిన.. విక్కీ నగ్రాలే అనే వివాహితుడు ఆమెపై పెట్రోల్‌పోసి నిప్పంటింటిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆస్పత్రిలో చికత్స పొందుతూ మృతి చెందింది.(ఆ లెక్చరర్ చనిపోయింది..!) -
ఆ లెక్చరర్ చనిపోయింది..!
ముంబై: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మహారాష్ట్రలోని వార్దాకు చెందిన ఓ యువతి(25) లెక్చరర్‌గా పనిచేస్తోంది. కాగా విక్కీ నగ్రాలే అనే వివాహితుడు గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గత సోమవారం సదరు యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. చదవండి : పెళ్లికి నిరాకరణ.. దుళ్లలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది కాగా వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక విక్కీకి గతంలోనే పెళ్లయిందని, అతడికి ఏడు నెలల వయస్సు గల కొడుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బల్లార్షాలో పనిచేసేవాడని.. బాధితురాలికి నిప్పు అంటించిన తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఇక మహిళా లెక్చరర్‌పై అఘాయిత్యానికి నిరసనగా స్థానికులు నిరసన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేసి.. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం బాధితురాలి తరఫున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికాంను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదం: ఇద్దరు పిల్లలను హతమార్చి.. ఆపై -
లెక్చరర్‌కు నిప్పంటించాడు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్ఘాట్లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్ వద్ద అడ్డగించిన వికేశ్.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్ ప్రకటించారు. బాధితురాలు, నిందితుడు వికేశ్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని ఇన్స్పెక్టర్ సత్యవీర్ తెలిపారు. వికేశ్కు 9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్ తెలిపారు. -
ఆర్మీ అయుధ గోదాములో భారీ పేలుడు
-
ఆర్మీ డిపోలో పేలుడు.. ఆరుగురు మృతి
వార్ధా: మహారాష్ట్ర పుల్గాన్‌లోని ఆర్మీ డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వార్ధా జిల్లాలోని ఆర్మీకి చెందిన ఆయుధ గోదాములో మంగళవారం ఉదయం కాలం చెల్లిన మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేసే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఘటన స్థలంలోనే నలుగురు వ్యక్తులు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరో ఇద్దరు మరణించారు. మృతి చెందిన వారిలో ఆయుధ గోదాములో పనిచేసే ఓ ఉద్యోగితోపాటు ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పేలుడు వార్తలను నిర్ధారించిన రక్షణశాఖ అధికారులు ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనపై వార్ధా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 10 నుంచి 15 మంది క్రాంటాక్టు కార్మికులు ఉన్నట్టు తెలిపారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సామాగ్రిని ఇక్కడ భద్రపరుస్తారు. కాగా, 2016లో ఇదే డిపోలో జరిగిన పేలుడు ప్రమాదంలో 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
వర్దా’ ఎఫెక్ట్
దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన ఆకాశం మేఘావృతం కావటంతో రైతుల్లో ఆందోళన తీరంలో పెరిగిన అలల ఉధృతి చేపల వేటకు విరామం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సకాలంలో సాగునీరు అందలేదు. పాలకులు పట్టించుకోలేదు. వరుణుడు కరుణించడంతో నారుపోశారు. ఆ తర్వాత కూడా కాలువలకు నీరు విడుదల చేయలేదు. నారు ముదిరిపోతుండడంతో పుడమితల్లిని నమ్ముకుని నాట్లు వేశారు. నానా పాట్లు పడి ఇంజిన్ల ద్వారా నీరు పెట్టారు. పంట చేతికొచ్చింది. ఆనందంగా కోతలకు సిద్ధమవుతున్న వేళ అన్నదాతల గుండెల్లో ‘తుఫాన్’ మొదలైంది. మచిలీపట్నం/కోడూరు : ఆకాశంలో కమ్ముకొస్తున్న కారుమేఘాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రంలో ఉధృతంగా ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంతావాసులను వణికిస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన చల్లగాలులకు జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ‘వర్దా’ పెను తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వర్షం కురుస్తుందేమోనని రైతులు అల్లాడిపోయారు. వర్షం కురిస్తే చేతికందే దశలో ఉన్న వరిపంట నీట మునుగుతుందనే భయంతో రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఇప్పటికే వరికోత కోసి ఉన్న పైరును కుప్పలు వేయటం, నూర్పిడి చేసే పనులను హడావుడిగా చేపట్టారు. కుప్పల నూర్పిడి అనంతరం ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. వరికోతలను వాయిదా వేశారు. మరికొందరు భారీ వర్షం కురిస్తే పంట దెబ్బతింటుందనే భయంతో యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేస్తున్నారు. జిల్లాపై సోమవారం తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తుఫాన్ ప్రభావంతో పాలకాయతిప్ప వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు సముద్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి పూర్తిగా మారిపోయింది. అలలు ఉధృతి పెరగడంతోపాటు సముద్రం కొంతమేర ముందుకు చొచ్చుకువచ్చింది. తుఫాన్ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు విరామం ప్రకటించారు. ఫైబర్ బోట్లు, వలలను భద్రపరుచుకున్నారు. రేపటి వరకు ప్రభావం ‘వర్దా’ పెను తుఫాన్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రకటించిన వాతావరణ శాఖ... ఈ నెల 13 వరకు తుపాను ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని 7 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే తుఫాన్ గమనం చెన్నై వైపు ఉన్నప్పటికీ జిల్లాలో కొద్దిపాటి వర్షం కురిసినా వరి దెబ్బతినే ప్రమాదం ఉంది.