వార్ధా: మహారాష్ట్ర పుల్గాన్‌లోని ఆర్మీ డిపోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వార్ధా జిల్లాలోని ఆర్మీకి చెందిన ఆయుధ గోదాములో మంగళవారం ఉదయం కాలం చెల్లిన మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేసే సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఘటన స్థలంలోనే నలుగురు వ్యక్తులు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరో ఇద్దరు మరణించారు. మృతి చెందిన వారిలో ఆయుధ గోదాములో పనిచేసే ఓ ఉద్యోగితోపాటు ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.
పేలుడు వార్తలను నిర్ధారించిన రక్షణశాఖ అధికారులు ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనపై వార్ధా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 10 నుంచి 15 మంది క్రాంటాక్టు కార్మికులు ఉన్నట్టు తెలిపారు. భారత ఆర్మీకి చెందిన ఆయుధ సామాగ్రిని ఇక్కడ భద్రపరుస్తారు. కాగా, 2016లో ఇదే డిపోలో జరిగిన పేలుడు ప్రమాదంలో 16 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment