దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్‌కు కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ కీలకంగా వ్యవహరించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ పేలుళ్లు సహా దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాన్ని ఇతడే సరఫరా చేశాడు.
పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఐఎమ్ చీఫ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు అతడి సోదరుడు యాసీన్ భత్కల్‌తో కలిసి పనిచేసిన డాక్టర్ సాబ్‌తో పాటు అతడి ముఠాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2015 జనవరి 8న అరెస్టు చేసింది. 2024, డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. రియాజ్–అఫాఖీ మధ్య సంప్రదింపులు జరిగిన విధానంతో పాటు వాళ్లు వినియోగించిన కోడ్ వర్డ్స్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి.
హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో 2007లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ 2008లో పాకిస్తాన్‌కు పారిపోయాడు. కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుని డాక్టర్ సాబ్‌ను ఉగ్రవాద బాటపట్టించాడు. భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్‌లతో ముఠాను ఏర్పాటు చేయించాడు.
హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్‌గా చేసుకోవాలని రియాజ్ భత్కల్ 2012లో నిర్ణయించుకున్నాడు. దీనిపై తన సోదరుడు యాసీన్ భత్కల్‌తో పాటు ఆజామ్‌ఘడ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, అతడితో ఉంటున్న పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లతో సంప్రదింపులు జరిపాడు. యాసీన్ మినహా మిగిలిన ఇద్దరినీ మంగుళూరుకు పంపాడు.
ఈ సంప్రదింపులు, సమాచారమార్పిడి కోసం ఫోన్లపై ఆధారపడితే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదం ఉంటుందని భావించిన రియాజ్ వాటికి పూర్తి దూరంగా ఉండటంతో పాటు అనుచరుల్నీ అలానే ఉంచాడు. కేవలం ఈ–మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ అతగాడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు.
అప్పటికే వాంటెడ్ లిస్టులో ఉన్న తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే ప్రమాదం ఉందని భావించాడు. అలాగని ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఐడీలు ఏర్పాటు చేసుకుంటే అవి మిగతా వారికి తెలిసే అవకాశం లేక సమాచార మార్పిడికి అవాంతరాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో రియాజ్ భత్కల్ ఓ కొత్త ఆలోచన చేశాడు.
పాకిస్తాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తాను వినియోగిస్తున్న మెయిల్ ఐడీ నుంచి మిగిలిన వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ‘స్టఫ్ మై స్టాకింగ్’ అనే పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తున్నట్లు సమాచారమిచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకునేలా చేశాడు. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు.
ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలని స్పష్టం చేశాడు. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉండటంతో ఎవరి ఐడీ ఏంటనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటివారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తిచేయాలని నిర్దేశించాడు.
ఈ విధ్వంసానికి పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉన్న డాక్టర్ సాబ్‌కు అప్పగించాడు. అతడినీ ఈ–మెయిల్ ద్వారానే సంప్రదించిన రియాజ్.. ‘హైదరాబాద్ మే షాదీ హై.. బారాత్ హోనా’ (హైదరాబాద్‌లో పెళ్లి ఉంది. దాని కోసం ఊరేగింపు కావాలి) అంటూ సందేశం ఇచ్చాడు. మరోపక్క మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న కీలక ఆదేశాలు వచ్చాయి.
మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి పేలుడు పదార్థాలు అందిస్తాడని చెప్పడంతో హడ్డీ అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం అఫాఖీ 25 కేజీల పేలుడు పదార్థం (అమోనియం నైట్రేట్), 30 డిటొనేటర్లు సమీకరించి, వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన అనుచరుడు సద్దాం హుస్సేన్ ద్వారా యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు పంపాడు. అక్కడకు వెళ్లిన హడ్డీ అవి తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో పాలు పంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ–1 మిర్చి సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీలకు (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు).. ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), డాక్టర్ సాబ్ (పేలుడు పదార్థాలు సరఫరా) వివరాలు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీరిలో ఎవరు చిక్కినా మిగిలిన వారి విషయం బయటపడకుండా ఇలా కుట్ర పన్నాడు. డాక్టర్ సాబ్ మాడ్యుల్‌కు బెంగళూరు ఎన్‌ఐఏ కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనుంది.
(చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!)
Comments
Please login to add a commentAdd a comment