terror act
-
షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!
దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్‌కు కర్ణాటకలోని భత్కల్ వాసి సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ కీలకంగా వ్యవహరించారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ పేలుళ్లు సహా దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాన్ని ఇతడే సరఫరా చేశాడు. పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎమ్ చీఫ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు అతడి సోదరుడు యాసీన్ భత్కల్‌తో కలిసి పనిచేసిన డాక్టర్ సాబ్తో పాటు అతడి ముఠాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అరెస్టు చేసింది. 2024, డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. రియాజ్–అఫాఖీ మధ్య సంప్రదింపులు జరిగిన విధానంతో పాటు వాళ్లు వినియోగించిన కోడ్ వర్డ్స్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో 2007లో జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ 2008లో పాకిస్తాన్‌కు పారిపోయాడు. కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుని డాక్టర్ సాబ్‌ను ఉగ్రవాద బాటపట్టించాడు. భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లతో ముఠాను ఏర్పాటు చేయించాడు. హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్‌గా చేసుకోవాలని రియాజ్ భత్కల్ 2012లో నిర్ణయించుకున్నాడు. దీనిపై తన సోదరుడు యాసీన్ భత్కల్‌తో పాటు ఆజామ్ఘడ్కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, అతడితో ఉంటున్న పాకిస్తానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లతో సంప్రదింపులు జరిపాడు. యాసీన్ మినహా మిగిలిన ఇద్దరినీ మంగుళూరుకు పంపాడు. ఈ సంప్రదింపులు, సమాచారమార్పిడి కోసం ఫోన్లపై ఆధారపడితే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదం ఉంటుందని భావించిన రియాజ్ వాటికి పూర్తి దూరంగా ఉండటంతో పాటు అనుచరుల్నీ అలానే ఉంచాడు. కేవలం ఈ–మెయిల్‌తో పాటు నింబస్, పాల్‌టాక్ వంటి సోషల్ మీడియాలను వినియోగించాలని సూచించాడు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి అవసరమైన ఐడీలను సృష్టించడంలోనూ అతగాడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటికే వాంటెడ్ లిస్టులో ఉన్న తమ పేర్లను వినియోగించి వీటిని సృష్టించుకుంటే వాటిపై నిఘా వర్గాల కన్ను పడే ప్రమాదం ఉందని భావించాడు. అలాగని ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఐడీలు ఏర్పాటు చేసుకుంటే అవి మిగతా వారికి తెలిసే అవకాశం లేక సమాచార మార్పిడికి అవాంతరాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో రియాజ్ భత్కల్ ఓ కొత్త ఆలోచన చేశాడు. పాకిస్తాన్లో ఉన్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో తాను వినియోగిస్తున్న మెయిల్ ఐడీ నుంచి మిగిలిన వారికి ఓ మెయిల్ పంపాడు. అందులో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉన్న ‘స్టఫ్ మై స్టాకింగ్’ అనే పుస్తకాన్ని జతచేసి, అందులోని ప్రతి పది పేజీలను ఒక్కో సభ్యుడికి కేటాయిస్తున్నట్లు సమాచారమిచ్చాడు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన వాటిలో మొదటి పేజీలోని మొదటి పదం వినియోగించి ఐడీని సృష్టించుకునేలా చేశాడు. అవసరమనుకుంటే ఆ పదం పక్కన పేజీ నంబర్ లేదా ఏదైనా సంఖ్యను వాడుకోవచ్చని సూచించాడు. ప్రతి నెల రోజులకు కచ్చితంగా ఐడీని మార్చేస్తూ వారికి కేటాయించిన పేజీల్లో రెండో పేజీలో ఉన్న మొదటి పదంతో మరో ఐడీ సృష్టించుకోవాలని స్పష్టం చేశాడు. ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందరి దగ్గరా ఉండటంతో ఎవరి ఐడీ ఏంటనేది మిగతా వారికి తేలిగ్గా తెలిసేది. ఈ రకంగా నిఘా వర్గాలకు ఏ మాత్రం అనుమానం రాకుండా కమ్యూనికేషన్ సాగించారు. రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటివారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తిచేయాలని నిర్దేశించాడు. ఈ విధ్వంసానికి పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉన్న డాక్టర్ సాబ్‌కు అప్పగించాడు. అతడినీ ఈ–మెయిల్ ద్వారానే సంప్రదించిన రియాజ్.. ‘హైదరాబాద్ మే షాదీ హై.. బారాత్ హోనా’ (హైదరాబాద్‌లో పెళ్లి ఉంది. దాని కోసం ఊరేగింపు కావాలి) అంటూ సందేశం ఇచ్చాడు. మరోపక్క మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న కీలక ఆదేశాలు వచ్చాయి.మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి పేలుడు పదార్థాలు అందిస్తాడని చెప్పడంతో హడ్డీ అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం అఫాఖీ 25 కేజీల పేలుడు పదార్థం (అమోనియం నైట్రేట్), 30 డిటొనేటర్లు సమీకరించి, వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన అనుచరుడు సద్దాం హుస్సేన్ ద్వారా యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు పంపాడు. అక్కడకు వెళ్లిన హడ్డీ అవి తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలు పంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ–1 మిర్చి సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీలకు (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు).. ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), డాక్టర్ సాబ్ (పేలుడు పదార్థాలు సరఫరా) వివరాలు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీరిలో ఎవరు చిక్కినా మిగిలిన వారి విషయం బయటపడకుండా ఇలా కుట్ర పన్నాడు. డాక్టర్ సాబ్ మాడ్యుల్‌కు బెంగళూరు ఎన్ఐఏ కోర్టు త్వరలో శిక్ష ఖరారు చేయనుంది. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల ఐఈడీ స్వాధీనం
శ్రీనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్ ప్రాంతంలో సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్డీఎక్స్, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలతో పాటు కోడ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముకేశ్ సింగ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కరోనా ఫోర్త్ వేవ్ భయాలు.. అక్కడ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు! -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి.. రద్దీ ప్రాంతంలో కాల్పులు
స్ట్రాస్‌బర్గ్: క్రిస్మస్ పండుగ వేళ ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో రద్దీగా ఉండే ఓ వీధిలో బుధవారం ముష్కరుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్ పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్న సమయంలో అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 12మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ఫ్రాన్స్ పోలీసులు ధ్రువీకరించారు. స్ట్రాస్‌బర్గ్‌లోని రద్దీగా ఉన్న ఓ వీధిలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడని, కాల్పులు జరిపే సమయంలో అతడు ‘అల్లాహో అక్బర్’ అని నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని ఇప్పటివరకు షెరీఫ్ సీ గా గుర్తించారు. అతడికి నేరచరిత్ర, రాడికల్ భావజాలం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. -
అమృత్సర్ దాడి ఉగ్రచర్యే
అమృత్సర్: అమృత్‌సర్‌లోని నిరంకారీ భవన్లో భక్తులపై దాడి ఉగ్రచర్యేనని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఆదివారం దాడికి గురయిన ఆద్లివాల్లోని నిరంకారీ భవన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ ఘటనలో లభ్యమైన ఆధారాల సాయంతో బాధ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వారిపై సమాచారం అందించిన వారికి రూ.50లక్షల పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. ‘నిరంకారీ భవన్‌పై దాడి వెనుక పాకిస్తాన్ ప్రోద్బలం ఉంది. ఈ దాడిలో వాడిన గ్రెనేడ్ పాక్ ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన గ్రెనేడ్ మాదిరిగానే ఉంది’ అని అమరీందర్ అన్నారు. ‘ఇలాంటి హెచ్‌జీ–84 రకం గ్రెనేడ్ ఒక దానిని గత నెలలో ఉగ్ర స్థావరాలపై దాడిలో రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్నిబట్టి ఈ ఘటన ఐఎస్ఐ ప్రోద్బలంతో ఖలిస్తాన్ లేదా వేర్పాటువాదుల పనేనని భావిస్తున్నాం.’ అని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
విద్రోహమా..? అలసత్వమా..?
-
విద్రోహమా? అలసత్వమా?
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనుమానాలు హీరాఖండ్ ప్రమాదానికి కారణమేమిటి? పట్టాలు ఎలా విరిగాయి? దుండగులెవరైనా పట్టాలను ముందుగానే కట్ చేశారా?... క్రాస్‌గా విరగాల్సిన రైలు పట్టాలు షార్ప్‌గా ఎందుకు విరిగాయి... అసలిది ప్రమాదమా లేక విద్రోహుల పనా?... లేక రైల్వే అధికారుల అలసత్వమా? ప్రమాదానికి ముందు ఆ మార్గంలో గూడ్స్ రైలు వెళ్లాక సమీపంలోని క్యాబిన్ మాస్టర్ చెక్ చేయలేదా?.. ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వారు పలు సందర్భాల్లో దాడులకు పాల్పడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం కూనేరు రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. కూనేరు పక్కనున్న గుమ్మడ స్టేషన్‌ను ఏడేళ్ల క్రితం పేల్చేశారు. ఆ తర్వాత అక్కడ కొత్త స్టేషన్ నిర్మించారు. అదే స్టేషన్లో ఓ పోలీసును చంపి మరీ నగదు దోచుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో సహజంగానే విద్రోహ చర్య అన్న అనుమానం వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో దాదాపు ఐదేళ్ల నుంచి మావోయిస్టుల కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. రైల్వే అధికారులే తమ అలసత్వం బైటపడకుండా ఇలా విద్రోహచర్య వాదనను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. – కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, విశాఖపట్నం 24 నిమిషాల ముందు సాఫీగా.. రాత్రి 10.40 గంటలకు ఇదే రెండవ ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు సాఫీగా వెళ్లింది. 11.05 గంటలకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై పట్టాలు తప్పింది. 25 నిమిషాల్లో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. పట్టాలు సరిగ్గా లేకపోతే గూ డ్స్ వెళ్లినప్పుడే ప్రమాదం సంభవించి ఉండాలి. కానీ అలా జరగలేదు. పట్టాలు షార్ప్‌గా కట్ అయ్యాయి. ఎడ్జ్ కట్ కావాల్సినవి షార్ప్ కట్ ఎందుకు అయ్యాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు రాకముందే కట్ అ యి ఉన్నట్లు భావిస్తున్నారు. పట్టాలను గమనించడంతోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారని, దాంతో బోగీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయని రైల్వేవర్గాలంటున్నాయి. సాధారణంగా చలికాలంలో పట్టాలు కాస్త సంకోచించి ఉంటాయి. అది కూడా ప్రమాదాలకు కారణమవుతుంటుంది. కానీ ఇక్కడ పట్టాలు ముందే తెగిపడి ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. విద్రోహుల పనేనా...? సిబ్బందిని బెదిరించి విద్రోహులు పట్టాలు తప్పించి ఉంటారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానంతో రైల్వే ఉన్నతాధికారులు పలువురు స్థానిక సిబ్బందిని విచారిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వచ్చే నెల 3న రైల్వే జీఎం పర్యటన ఉండటంతో ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో కచ్చితంగా చూస్తారు. కానీ ఇక్కడ చూడలేదు. గూడ్స్ వెళ్లిన తర్వాత ట్రాక్ చెక్ చేయలేదు. రైల్వే క్యాబిన్ కూడా పక్కనే ఉంది. అక్కడ క్యాబిన్ మాస్టర్ కూడా ఉంటారు. అయితే ఆయన పట్టాలు కట్ అయిన విషయాన్ని గమనించలేదా? లేక చూసి చూడనట్లు వదిలేశారా అనేది తేలాల్సి ఉంది. కీమ్యాన్లపై వదిలేయడమే కారణమా? మరోవైపు ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా కింది స్థాయి కీమ్యాన్లపైనే వదిలేశారన్న ఆరోపణలు రైల్వే వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో రైలు పట్టాలను పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లో ఇంజినీరింగ్ అధికారులుంటారు. రాయగడలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (నార్త్), విజయనగరం జిల్లా పార్వతీపురం కేంద్రంగా సీనియర్ సెక్షన్ ఇంజినీరు (పర్మనెంట్ వే) ఉంటారు. ఆయన కింద గుమ్మడలో జూనియర్ ఇంజినీర్, వీరందరిపై పర్యవేక్షణకు విశాఖలో సీనియర్ డివిజనల్ ఇంజినీరు (నార్త్) విధులు నిర్వహిస్తారు. సంబంధిత దిగువ స్థాయి ఇంజినీర్లు పుష్ (తోపుడు) ట్రాలీ, మోటారు ట్రాలీలపై తరచూ ట్రాక్‌లను తనిఖీ చేయాలి. పట్టాలపై ఎక్కడైనా లోపాలు కనిపిస్తే తక్షణమే సరి చేయించాలి. కానీ కొన్నాళ్లుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన సెక్షన్‌తో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో వీరు ట్రాలీలపై తనిఖీలే సమగ్రంగా చేయడం లేదని తెలుస్తోంది. కాని తనిఖీలకు వెళ్లినట్టు రికార్డుల్లో చూపుతూ టీఏ, డీఏలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. రికా ర్డుల ప్రకారం వీరు ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు లెక్క! కానీ వాస్తవానికి సంబంధిత ప్రాంతాల్లోని కీమ్యాన్లపైనే వీరు ఆధారపడుతున్నారని అంటున్నారు. గొట్లాం–సింగపూర్ రోడ్డు లైన్ చూసే ఇంజినీరింగ్ అధికారి మూడేళ్ల క్రితం నేరుగా నియమితులై విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. ఆయనకు అంతగా çపట్టు లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. పార్వతీపురం సెక్షన్ ఇంజినీరిం గ్ అధికారి పర్యవేక్షణపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన నాలుగేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ డివిజనల్ ఇంజినీర్(నార్త్) పీ–వే నుంచి కాకుండా సివిల్ ఇంజినీ రింగ్ నుంచి రావడం వల్ల పీ–వేపై అవగాహన లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా ప్రధాన లైన్లలో విధులు నిర్వహి స్తున్న ఇంజినీరింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం, అవగా హనా రాహిత్యం వెరసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమయిందని రైల్వే వర్గాల్లో వినిపిస్తోంది. విద్రోహ చర్యగా చిత్రీకరణ? హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారాన్ని లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోశారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల కదలికలున్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఈ ఘటనకు కారకులను తేలికగా బయట పడవచ్చన్నది వ్యూహంగా చెబుతున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ముందు ప్రజలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారని, రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణికులను పొట్టనబెట్టుకునే దుశ్చ ర్యకు పాల్పడరని గత అనుభవాలను ఉదహరిస్తు న్నారు. ఈ హీరాఖండ్ ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహచర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
రైలు ప్రమాదంలో ఉగ్రకోణం?
విశాఖపట్నం: దాదాపు అర్ధరాత్రి సమయం.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడం బోగీలు చెల్లాచెదురవడం.. పెద్ద మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం.. అంతకంటే ముందు వెళ్లిన రైలుకు ఏం నష్టం జరగకపోవడం ఇదంతా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాద నేపథ్యం. కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పి ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి కారణాన్ని ఇప్పటి వరకు ప్రకటించని అధికారులు తాజాగా ఉగ్రకోణం తీసిపారేయలేమని స్పష్టం చేశారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విధ్వంసకకర కుట్రం దాగి ఉందని గట్టిగా అనుమానిస్తున్నారు. రైలు పట్టాలు రెండు చోట్ల విరిగి ఉండటం, అర్థరాత్రి ప్రమాదం జరగడం కూడా వారి అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల కాన్పుర్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద చర్య ఉందని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిరాఖండ్ ప్రమాదం వెనుక కూడా ఉగ్రవాదులు ఉన్నారనే కోణంలోనే విచారణ ప్రారంభించారు. అయితే, అన్నికోణాల్లో విచారణ జరుపుతామని వారు చెబుతున్నారు. త్వరలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
రైలు ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తం?
-
చిన్నారిని ఇంట్లో వదిలేసి.. తుపాకులతో పార్టీకి వెళ్లి..!
సమయం బుధవారం ఉదయం. అమెరికా జాతీయుడు, కాలిఫోర్నియా హెల్త్ ఇన్స్పెక్టర్ అయిన సయెద్ రిజ్వాన్ ఫరుక్ (28), సౌదీకి చెందిన అతని భార్య తష్ఫీన్ మాలిక్ తొందరగా తయారయ్యారు. తమ ఆరు నెలల చిన్నారిని ఫరుక్ తల్లి దగ్గర వదిలేసి.. తాము డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం వెళుతున్నట్టు ఆమెకు చెప్పారు. అయితే మధ్యాహ్నం సమయానికల్లా వారు దాడి చేసేందుకు వీలుగా దుస్తులు ధరించారు. చేతిలో తుపాకులు పట్టుకొని.. ఫరుక్ సహ ఉద్యోగులు నిర్వహిస్తున్న క్రిస్మస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాల్పుల హోరుతో 14మందిని హతమార్చారు. 17మందిని గాయపర్చారు. వాళ్లు అక్కడి నుంచి తప్పించుకునేలోపే పోలీసులు రంగంలోకి దిగి.. ఎదురుకాల్పుల్లో దంపతులిద్దరిని మట్టుబెట్టారు. ఇది అమెరికా కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన కాల్పుల ఉదంతం తీరు. ఈ దంపతులు ఎందుకు కాల్పులకు దిగారన్నది ఇప్పటికే పోలీసులు నిర్ధారించలేదు. ఈ కాల్పుల ఘటన క్రిస్మస్ పండుగ రానున్న వేళ సాన్ బెర్నార్డినో పట్టణ వాసుల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ కాల్పుల వెనుక ప్రేరణ ఏమిటన్నది తెలియకపోయినా.. ఇది ఉగ్రవాద ఘటన అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయడం లేదని పోలీసులు చెప్తున్నారు. సాన్ బెర్నార్డినో కౌంటీ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఫరుక్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడంటే అతని సహ ఉద్యోగులే నమ్మలేకపోతున్నారు. ఫరుక్ ముస్లిం భక్తుడు అయినప్పటికీ తన మతం గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదని అతని మాజీ సహ ఉద్యోగి గ్రిసెల్దా రీసింగర్ తెలిపారు. 'అతను ఎప్పుడూ నాకు మత ఛాందసుడిగా కనిపించలేదు. అతనిపై నాకు అనుమానం కలుగలేదు' అని గిసెల్దా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికాలో నివసించాలన్న స్వప్నంతో ఆ దంపతులు తమ దేశాలను వదిలి ఇక్కడికి వచ్చినట్టు కనిపించేదని మరో సహోద్యోగి చెప్పారు. ఫరుక్ కుటుంబం దక్షిణాసియా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. కాగా అతని భార్య తష్ఫీన్ పాకిస్థాన్ దేశీయురాలని, ఆమె మొదట సౌదీ అరేబియాలో జీవించి ఆ తర్వాత అమెరికాకు వచ్చినట్టు భావిస్తున్నారు. -
అది ఉగ్రవాద దాడే కావొచ్చు!
సాన్ బెర్నార్డినో (కాలిఫోర్నియా): అమెరికాలో భారీ ఆయుధాలతో ఓ వ్యక్తి, ఓ మహిళ సృష్టించిన కాల్పుల బీభత్సంలో 14 మంది చనిపోయారు. 17 మంది గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులను మట్టుబెట్టారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ హలీడే విందు వద్ద జరిగిన ఈ ఘటన అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పులకు తెగబడిన ఇద్దరు నిందితులను సయెద్ రిజ్వాన్ ఫరూక్ (28), తష్ఫీన్ మాలిక్ (27)గా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితుల మధ్య అనుబంధం ఉందని, బహుశా వీళ్లు పెళ్లి చేసుకొని ఉండవచ్చు లేదా నిశ్చితార్థం జరిగి ఉండవచ్చు అని సాన్ బెర్నార్డినో పోలీసు చీఫ్ జరాడ్ బర్గ్వాన్ తెలిపారు. కాల్పులు జరిపింది ఈ ఇద్దరేనని తాము నమ్ముతున్నామని, మరొక నిందితుడు కూడా ఉన్నట్టు వచ్చిన అనుమానాలు నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. ఈ కాల్పుల దాడి వెనుక ప్రేరేపణలు ఏమిటో ఇంకా స్పష్టం కాకపోయినా ఇది ఉగ్రవాద దాడి అయి ఉండవచ్చునన్న అంశాన్ని కొట్టిపారేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫరూక్ అమెరికాలో జన్మించిన వాడేనని, అయితే మాలిక్ జాతీయత గురించి తెలియదని చెప్పారు. ప్రజారోగ్య ఉద్యోగిగా పనిచేస్తున్న ఫరూక్ తన సహా ఉద్యోగుల నిర్వహిస్తున్న హాలీడే పార్టీలోనే కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడని పోలీసు చీఫ్ వివరించారు. -
ఆ ఉగ్రవాదుల అంతు చూస్తా: పుతిన్ ప్రతిన
మాస్కో: గత నెల ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన బూనారు. విమానాన్ని కూల్చేసి.. 224 మంది మృతిచెందడానికి కారణమైన వారిని పట్టుకొని చట్టం ద్వారా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. విమానం కూల్చివేతకు కారణమైన వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు (రూ. 330 కోట్లు) బహుమానం ఇస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది. అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం రష్యా భద్రతా చీఫ్ అలెగ్జాండర్ బోట్ర్‌నికోవ్ భేటీ అయి.. ఈజిప్టులో కూలిన విమానం ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని వెల్లడించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ' కారకులు ఎక్కడ దాగివున్నా.. వారి వెతికి మరీ పట్టుకుంటాం. ప్రపంచంలోని ఏ మూల దాగున్నా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారిని శిక్షించి తీరుతాం' అని బొట్ర్‌నికోవ్‌తో చెప్పారని క్రెమ్లిన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో ప్రయాణించిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉగ్ర దాడి వల్లే ఆ విమానం కూలింది!
మాస్కో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో విమానం కూలిపోయిన ఘటనలో ఉగ్రవాద హస్తముందని రష్యా సీనియర్ భద్రతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల చర్య వల్లే ఆ విమానం కూలిపోయిందని రష్యా భద్రతాధిపతి అలెగ్జాండర్ బోట్రోనికోవ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలిపారు. 224 మందితో బయలుదేరిన రష్యా విమానం సినాయ్ ద్వీపకల్పంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఘటన గురించి ఎఫ్ఎస్బీ భద్రతా ఏజెన్సీ చీఫ్ బోట్రోనికోవ్ పుతిన్‌కు వివరించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్య వల్లే జరిగిందనే విషయంలో ఎలాంటి సందిగ్ధానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కిలో బరువున్న పేలుడు పదార్థం టీఎన్టీకి సమానమైన బాంబు పేలడంతో గాలిలోనే ఆ విమానం ముక్కలైపోయిందని ఆయన పుతిన్‌కు వివరించారని స్థానిక మీడియా తెలిపింది. రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో కూడిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రైల్లో పేలుడు ఉగ్రవాద చర్యే
గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు ఉగ్రవాద చర్యేనని పోలీసులు నిర్ధరించారు. వాస్తవానికి ఆ బాంబు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రాంతంలో పేలాల్సిందని, అయితే రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో చెన్నై సెంట్రల్ స్టేషన్లో ఉండగా పేలిందని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. నెల్లూరులో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఒక హెచ్చరిక పంపేందుకే ఈ పేలుడుకు కుట్రపన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటం.. కేవలం దాని పైభాగంలో ఉన్న సీటు మాత్రమే దెబ్బతినడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కొన్ని పేలుడు పదార్థాలతో రైల్లో దాక్కున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యేనని తమిళనాడు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల నుంచి తనకు సమాచారం అందుతోందని, పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తమిళనాడు పోలీసులకు సహకరించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రెండు బృందాలను పంపింది. వాటిలో ఒకటి హైదరాబాద్ నుంచి, మరొకటి ఢిల్లీ నుంచి వెళ్లాయి. బాంబు పేలుడు కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకదాన్ని ఏర్పాటుచేసినట్లు తమిళనాడు సీఎం జయలలిత తెలిపారు. మృతురాలి కుటుంబానికి లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి 25వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దోషులు త్వరలోనే కటకటాల వెనక్కి వెళ్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.