
ఉగ్ర దాడి వల్లే ఆ విమానం కూలింది!
మాస్కో: ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంలో విమానం కూలిపోయిన ఘటనలో ఉగ్రవాద హస్తముందని రష్యా సీనియర్ భద్రతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల చర్య వల్లే ఆ విమానం కూలిపోయిందని రష్యా భద్రతాధిపతి అలెగ్జాండర్ బోట్రోనికోవ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తెలిపారు. 224 మందితో బయలుదేరిన రష్యా విమానం సినాయ్ ద్వీపకల్పంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో ఈ ఘటన గురించి ఎఫ్‌ఎస్‌బీ భద్రతా ఏజెన్సీ చీఫ్ బోట్రోనికోవ్ పుతిన్‌కు వివరించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్య వల్లే జరిగిందనే విషయంలో ఎలాంటి సందిగ్ధానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కిలో బరువున్న పేలుడు పదార్థం టీఎన్‌టీకి సమానమైన బాంబు పేలడంతో గాలిలోనే ఆ విమానం ముక్కలైపోయిందని ఆయన పుతిన్‌కు వివరించారని స్థానిక మీడియా తెలిపింది.
రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో కూడిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.