
విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ప్రమాదానికి గురైన రైలు బోగీని క్రేన్‌తో తొలగిస్తున్న దృశ్యం
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనుమానాలు
హీరాఖండ్ ప్రమాదానికి కారణమేమిటి? పట్టాలు ఎలా విరిగాయి? దుండగులెవరైనా పట్టాలను ముందుగానే కట్ చేశారా?... క్రాస్‌గా విరగాల్సిన రైలు పట్టాలు షార్ప్‌గా ఎందుకు విరిగాయి... అసలిది ప్రమాదమా లేక విద్రోహుల పనా?... లేక రైల్వే అధికారుల అలసత్వమా? ప్రమాదానికి ముందు ఆ మార్గంలో గూడ్స్ రైలు వెళ్లాక సమీపంలోని క్యాబిన్ మాస్టర్ చెక్ చేయలేదా?.. ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వారు పలు సందర్భాల్లో దాడులకు పాల్పడ్డారు.
తొమ్మిదేళ్ల క్రితం కూనేరు రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. కూనేరు పక్కనున్న గుమ్మడ స్టేషన్‌ను ఏడేళ్ల క్రితం పేల్చేశారు. ఆ తర్వాత అక్కడ కొత్త స్టేషన్ నిర్మించారు. అదే స్టేషన్‌లో ఓ పోలీసును చంపి మరీ నగదు దోచుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో సహజంగానే విద్రోహ చర్య అన్న అనుమానం వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో దాదాపు ఐదేళ్ల నుంచి మావోయిస్టుల కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. రైల్వే అధికారులే తమ అలసత్వం బైటపడకుండా ఇలా విద్రోహచర్య వాదనను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
– కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, విశాఖపట్నం
24 నిమిషాల ముందు సాఫీగా..
రాత్రి 10.40 గంటలకు ఇదే రెండవ ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు సాఫీగా వెళ్లింది. 11.05 గంటలకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై పట్టాలు తప్పింది. 25 నిమిషాల్లో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. పట్టాలు సరిగ్గా లేకపోతే గూ డ్స్ వెళ్లినప్పుడే ప్రమాదం సంభవించి ఉండాలి. కానీ అలా జరగలేదు. పట్టాలు షార్ప్‌గా కట్ అయ్యాయి. ఎడ్జ్ కట్ కావాల్సినవి షార్ప్ కట్ ఎందుకు అయ్యాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు రాకముందే కట్ అ యి ఉన్నట్లు భావిస్తున్నారు. పట్టాలను గమనించడంతోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారని, దాంతో బోగీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయని రైల్వేవర్గాలంటున్నాయి. సాధారణంగా చలికాలంలో పట్టాలు కాస్త సంకోచించి ఉంటాయి. అది కూడా ప్రమాదాలకు కారణమవుతుంటుంది. కానీ ఇక్కడ పట్టాలు ముందే తెగిపడి ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
విద్రోహుల పనేనా...?
సిబ్బందిని బెదిరించి విద్రోహులు పట్టాలు తప్పించి ఉంటారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానంతో రైల్వే ఉన్నతాధికారులు పలువురు స్థానిక సిబ్బందిని విచారిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వచ్చే నెల 3న రైల్వే జీఎం పర్యటన ఉండటంతో ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో కచ్చితంగా చూస్తారు. కానీ ఇక్కడ చూడలేదు. గూడ్స్ వెళ్లిన తర్వాత ట్రాక్ చెక్ చేయలేదు. రైల్వే క్యాబిన్ కూడా పక్కనే ఉంది. అక్కడ క్యాబిన్ మాస్టర్ కూడా ఉంటారు. అయితే ఆయన పట్టాలు కట్ అయిన విషయాన్ని గమనించలేదా? లేక చూసి చూడనట్లు వదిలేశారా అనేది తేలాల్సి ఉంది.
కీమ్యాన్లపై వదిలేయడమే కారణమా?
మరోవైపు ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా కింది స్థాయి కీమ్యాన్లపైనే వదిలేశారన్న ఆరోపణలు రైల్వే వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో రైలు పట్టాలను పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లో ఇంజినీరింగ్ అధికారులుంటారు. రాయగడలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (నార్త్), విజయనగరం జిల్లా పార్వతీపురం కేంద్రంగా సీనియర్ సెక్షన్ ఇంజినీరు (పర్మనెంట్ వే) ఉంటారు. ఆయన కింద గుమ్మడలో జూనియర్ ఇంజినీర్, వీరందరిపై పర్యవేక్షణకు విశాఖలో సీనియర్ డివిజనల్ ఇంజినీరు (నార్త్) విధులు నిర్వహిస్తారు.
సంబంధిత దిగువ స్థాయి ఇంజినీర్లు పుష్ (తోపుడు) ట్రాలీ, మోటారు ట్రాలీలపై తరచూ ట్రాక్‌లను తనిఖీ చేయాలి. పట్టాలపై ఎక్కడైనా లోపాలు కనిపిస్తే తక్షణమే సరి చేయించాలి. కానీ కొన్నాళ్లుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన సెక్షన్‌తో పాటు డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో వీరు ట్రాలీలపై తనిఖీలే సమగ్రంగా చేయడం లేదని తెలుస్తోంది. కాని తనిఖీలకు వెళ్లినట్టు రికార్డుల్లో చూపుతూ టీఏ, డీఏలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. రికా ర్డుల ప్రకారం వీరు ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు లెక్క! కానీ వాస్తవానికి సంబంధిత ప్రాంతాల్లోని కీమ్యాన్లపైనే వీరు ఆధారపడుతున్నారని అంటున్నారు.
గొట్లాం–సింగపూర్ రోడ్డు లైన్ చూసే ఇంజినీరింగ్ అధికారి మూడేళ్ల క్రితం నేరుగా నియమితులై విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. ఆయనకు అంతగా çపట్టు లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. పార్వతీపురం సెక్షన్ ఇంజినీరిం గ్ అధికారి పర్యవేక్షణపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన నాలుగేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ డివిజనల్ ఇంజినీర్(నార్త్) పీ–వే నుంచి కాకుండా సివిల్ ఇంజినీ రింగ్ నుంచి రావడం వల్ల పీ–వేపై అవగాహన లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా ప్రధాన లైన్లలో విధులు నిర్వహి స్తున్న ఇంజినీరింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం, అవగా హనా రాహిత్యం వెరసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమయిందని రైల్వే వర్గాల్లో వినిపిస్తోంది.
విద్రోహ చర్యగా చిత్రీకరణ?
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారాన్ని లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోశారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల కదలికలున్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఈ ఘటనకు కారకులను తేలికగా బయట పడవచ్చన్నది వ్యూహంగా చెబుతున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ముందు ప్రజలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారని, రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణికులను పొట్టనబెట్టుకునే దుశ్చ ర్యకు పాల్పడరని గత అనుభవాలను ఉదహరిస్తు న్నారు. ఈ హీరాఖండ్ ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహచర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్న ప్రచారం జోరుగా సాగుతోంది.