
రైలు ప్రమాదంలో ఉగ్రకోణం?
విశాఖపట్నం: దాదాపు అర్ధరాత్రి సమయం.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడం బోగీలు చెల్లాచెదురవడం.. పెద్ద మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం.. అంతకంటే ముందు వెళ్లిన రైలుకు ఏం నష్టం జరగకపోవడం ఇదంతా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాద నేపథ్యం. కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పి ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి కారణాన్ని ఇప్పటి వరకు ప్రకటించని అధికారులు తాజాగా ఉగ్రకోణం తీసిపారేయలేమని స్పష్టం చేశారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విధ్వంసకకర కుట్రం దాగి ఉందని గట్టిగా అనుమానిస్తున్నారు. రైలు పట్టాలు రెండు చోట్ల విరిగి ఉండటం, అర్థరాత్రి ప్రమాదం జరగడం కూడా వారి అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.
ఇటీవల కాన్పుర్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద చర్య ఉందని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిరాఖండ్ ప్రమాదం వెనుక కూడా ఉగ్రవాదులు ఉన్నారనే కోణంలోనే విచారణ ప్రారంభించారు. అయితే, అన్నికోణాల్లో విచారణ జరుపుతామని వారు చెబుతున్నారు. త్వరలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.