hirakhand express
-
పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?
► మూడు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి ► కాన్పూర్‌లో 150 మంది.. ఇక్కడ 41 మంది మరణించారు ► ఇప్పటివరకు ఇక్కడకు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? ► విద్రోహ చర్యయినా, రైల్వే తప్పిదమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ► చనిపోయిన వారికి రూ. 20లక్షలు పరిహారం చెల్లించాలి ► ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ ► కూనేరు హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనా ప్రాంతం పరిశీలన కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘వరుసగా జరుగుతున్న రైల్వే దుర్ఘటనల్లో ప్రయాణికులు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో... ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలియడం లేదు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది’’ అని ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గడచిన మూడు నెలల్లో మూడు రైల్వే ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు. గత నాలుగైదేళ్లలో తానే మూడుసార్లు ప్రమాద ప్రాంతాలకు వెళ్లి పరామర్శించానని చెప్పారు. కాన్పూర్‌లో జరిగిన దుర్ఘటనలో ఏకంగా 150 మంది చనిపోయినా, తాజాగా ఇక్కడ 41 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వాలకు çపట్టడం లేదని విమర్శించారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద íహీరాఖండ్ ఎక్స్ప్రెస్రైలు దుర్ఘటన ప్రాంతాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది? కారణాలు ఏమిటి? సహాయ పునరావాస చర్యలు ఎంతవరకు వచ్చాయి? మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు అందిస్తున్న సహాయాన్ని రైల్వే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటనాస్థలం వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ముఖ్యమంత్రి ఏమైపోయారు? రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుర్ఘటనల్లో ఇది పెద్ద దుర్ఘటన. దాదాపుగా 41 మందికి పైగా చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో ఏడుగురు మన రాష్ట్రానికి చెందినవాళ్లున్నారు. ఇది విద్రోహ చర్యా? లేదా రైల్వేశాఖ తప్పిదమా? అన్నది విచారణలో తేల్చాల్సి ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక హెలికాప్టర్ వేసుకొని ఈ ప్రాంతానికి రావాలి. చనిపోయిన వారి కుటుంబాలకు తోడుగా ఉన్నానని భరోసానివ్వాలి. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించాలి. మెరుగైన వైద్యం అందేలా చూడాలి. దుర్ఘటనకు కారణం తెలుసుకునే ఆరాటం చూపాలి. కానీ రాష్ట్రంలో ఎన్ని దుర్ఘటనలు జరిగినా, ఎంతమంది చనిపోయినా ముఖ్యమంత్రి కనిపించడు. గతేడాది నెల్లూరులో బాణాసంచా పేలుడు ఘటనలో 20 మంది చనిపోయినా కనిపించలేదు. ఈ రోజు ఇక్కడ ఏకంగా 41మంది చనిపోయినా పరామర్శించలేదు. కనీసం విచారణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా? చనిపోయిన వారి పట్ల ముఖ్యమంత్రి కనీస సానుభూతి కూడా చూపించకపోవడం దారుణం. రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలి మూడు నెలల్లో మూడు రైల్వే భారీ ప్రమాదాలు జరిగాయి. రెళ్లెక్కిన పాపానికి గమ్యం చేరకుండా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తప్పిదం ఎవరిదైనా ప్రయాణికులు మాత్రం మూల్యం చెల్లిస్తున్నారు. ఏదేమైనా ఈ దుర్ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చనిపోయిన వారికి నష్ట పరిహారం కేవలంæ రూ.5లక్షలు ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కనీసం రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చనిపోయిన కుటుంబాలకు మన వంతు తోడ్పాటునివ్వాలి. ఈ మేరకు పరిహారం అందేలా మీడియా కూడా కృషి చేయాలి. దెబ్బలు తగిలిన వారికి రూ.50వేలు, రూ.20వేలు ఇచ్చే ప్యాకేజీ సరిపోవు. ప్రమాదానికి గురైన తర్వాత మంచానపడిన వాళ్లు మళ్లీ మామూలుగా పనులు చేసుకునే పరిస్థితులు రావాలంటే కనీసం రెండుమూడు నెలలు సమయం పడుతుంది. ఆస్పత్రికి వెళ్లి చూస్తే ఆంధ్రరాష్ట్రానికి చెందిన వారందరూ బీదవాళ్లే. రూ. 50వేలు ఇస్తే కనీసం మందులకు కూడా సరిపోదు. కొంతమందికి రూ.20వేలు ఇస్తామంటున్నారు. ప్రతి ఒక్కరికి రూ.2లక్షలు ఇవ్వాలి. రైల్వేశాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలి. విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలి దుర్ఘటనపై విచారణ జరగాలి. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత రిపోర్టును బహిర్గతం చేయాలి. ప్రయాణికుల భద్రత కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలి. రైల్వే శాఖ తప్పిదం వల్ల ఈ ఘటన జరిగి ఉంటే సేఫ్టీ మెకానిజం విషయంలో తీసుకుంటున్న చర్యలపై పునఃసమీక్షించాలి. తక్షణమే సేఫ్టీ మెకానిజమ్ ఇంప్రూవ్ చేయాలి. పాతరైల్వే ట్రాక్స్ మార్చేందుకు చర్యలు చేపట్టాలి. -
41కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి నెట్వర్క్ : విజయనగరం జిల్లా కూనేరు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాయగడ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ సోమవారం ఒకరు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. 31 మృతదేహాలకు రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో, మరో పది మృతదేహాలకు విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. గజపతి, గంజాం, పుల్బాణీ, కలహండీ జిల్లాల వైద్య బృందాలు పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నాయన్నారు. క్షతగాత్రులు 55 మందిలో 14 మందికి తీవ్రంగా, 23 మందికి మోస్తరుగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామన్నారు. -
హీరాఖండ్ ఘటనపై ఎన్ఐఏ విచారణ
విజయనగరం: విజయనగరం జిల్లా కూనేరు స్టేషన్ వద్ద జరిగిన జగదల్ పూర్-భువనేశ్వర్ హీరాఖండ్ రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదంపై అనుమానాలు తలెత్తడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఏపీ సీఐడీ బృందాలు ఆ ప్రదేశాన్ని సోమవారం పరిశీలించాయి. కుట్ర జరిగి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐడీ విభాగం కూడా సోమవారం సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. ఈ బృందంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ద్వారకా తిరుమలరావు, ఐజీ అమిత్ గార్గ్ ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉండొచ్చనే అంశాన్ని అధికారులు కొట్టివేయలేకపోతున్నారు. కాగా, ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఓ బోగీ నుంచి మరో రెండు మృతదేహాలను సోమవారం వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది. -
చీకట్లో చితికిన బతుకులు
-
విద్రోహమా..? అలసత్వమా..?
-
అమ్మకు సాటిలేరెవ్వరూ..
కన్నీరొలుకుతూనే బిడ్డకు పాలు బిస్వనాథ్ కరీనా.. బిహార్‌కు చెందిన వివాహిత. ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కలసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరం బయలుదేరింది. ఇంతలో రైలు ప్రమాదం.. కుటుంబసభ్యులు చెల్లాచెదురయ్యారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఘటనాస్థలి వద్ద వెతుకులాడింది. చివరకు అందరూ కలిసినా.. అన్నా వదిన మాత్రం ప్రాణాలతో లేరు. గుండెలు పిండేసే విషాదం ఆమెను కలచి వేస్తోంది. మరోవైపు నెలరోజుల బిడ్డ ఆకలితో రోదిస్తోంది. దీంతో కరీనా ఘటనాస్థలి వద్ద కూలబడిపోయి కన్నీరొలుకుతూనే.. ఒడిలో బిడ్డకు పాలు పట్టిన విధం చూపరుల కంటతడి పెట్టించింది. -
తల్లి కళ్లెదుటే విగతజీవులుగా మారిన పిల్లలు...
విజయనగరంలోని రంగాల వీధికి చెందిన కె.రేవతి(16), కె.రవి(19) సంక్రాంతికి తల్లి శారదతో కలసి భవానీపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కూనేరు వద్దకు రైలు ప్రమాదానికి గురవ్వడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. రవి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శారద చిన్నపాటి గాయాలతో బయటపడింది. కాగా, శారద భర్త శ్రీనివాస్ ఏడాది క్రితమే మరణించాడు. ఇప్పుడు ప్రమాదంలో పిల్లలిద్దరూ తన కళ్లెదుటే విగతజీవులుగా మారడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగింది. -
చీకట్లో చితికిన బతుకులు
హీరాఖండ్ ప్రమాదంలో 40 మంది మృత్యువాత.. 71 మందికిపైగా గాయాలు మృతుల్లో అత్యధికులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వారే మృతుల్లో అత్యధికులు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారేనని తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. వీరిలో 23 మందిని గుర్తించారు. 17 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఎం. కృష్ణ (35), పి.శ్రీను (25), బి.కమల (50), గాయత్రి సాహు (14), దిలీప్ కేఆర్ రౌత్ (51), టీకే మైంజ్ (45), సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, రాజన్ నాయక్ (18), సుభాష్ సీహెచ్ సాహు (60), ఎస్.రేణుక, పి.పోలి (35), జశోద పండిట్, రాంప్రసాద్ పండిట్, కె.రేవతి (16), మండల్ బలరామ్, సుబా భారతి సాహు, తపన్‌కుమార్ ప్రధాన్ (26), కార్తీక్ సాహు (21), రాధ (8), పూలన్‌దేవి, కె.రవికుమార్ (20) (విజయనగరం), బెడుధర్ బోయి ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఘటనా స్థలం కూనేరు నుంచి ఒక ప్రత్యేక పాసింజరు రైలును 13 బోగీలతో రాయగడ, టిట్లాఘర్, సంబల్పూర్, అంగుల్ల మీదుగా భువనేశ్వర్‌కు నడిపింది. క్షతగాత్రులను బరంపురం, భవానీపాట్నా, తదితర ప్రాంతాలకు పంపడానికి వీలుగా 13 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్, బోగీలను పట్టాలపై నుంచి తొలగించే పని సాయాంత్రానికి పూర్తి అయింది. కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, విశాఖపట్నం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు వదిలారు. దాదాపు 71 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయఘడ రైల్వే ఆస్పత్రి, విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. నాలుగు జనరల్ బోగీలు, రెండు స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు ఏసీ బోగీలు దెబ్బతిన్నాయి. రైల్వే, పోలీస్, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రయాణికులను కార్లు, బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తర్వాత ఒక్కొక్కటిగా 40 మృతదేహాలను వెలికి తీశారు. బోగీల్లో మరికొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. నుజ్జునుజ్జు అయిన బోగీల మధ్య చిక్కుకుపోవడంతో వెలికి తీయడం కష్టంగా మారింది. సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లతో బోగీలను కోసి మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. ప్రమాద తీవ్రత, జరిగిన తీరును బట్టి విద్రోహుల హస్తం ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కమిటీతో అధ్యయనం చేయిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఉమేష్ సింగ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిందిలా.. జగదల్పూర్ నుంచి శనివారం రాత్రి 7.55 గంటలకు రైలు బయలు దేరింది. కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పి.. ఆ పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంటూ దూసుకుపోయింది. ఆ వేగానికి పట్టాలపై నుంచి బోగీలు 20 మీటర్ల దూరం రైల్వే స్థలంలోకి వెళ్లిపడిపోయాయి. బోగీలు ఒకదానికొకటి గుద్దు కోవడంతో నుజ్జునుజ్జయ్యాయి. పట్టాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి బోగీల్లోకి చొచ్చుకొచ్చాయి. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రెండవ ట్రాక్ మీదుగా వెళుతోంది. ఈ ట్రాక్‌లో విద్యుత్ లైన్లు ఇటీవలే ఏర్పాటు చేశారు. ఇంకా సరఫరా ఇవ్వలేదు. దీంతో ఈ లైన్లో డీజిల్ ఇంజిన్లతోనే రైళ్లు నడుపుతున్నారు. విజయనగరం వచ్చేంత వరకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ డీజిల్ ఇంజన్‌తోనే నడుస్తుంది. విజయనగరంలో ఎలక్ట్రికల్ ఇంజిన్‌ను జత చేస్తారు. ఇదే కొంత వరకు ప్రాణనష్టాన్ని తగ్గించింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ లైన్లకు సరఫరా ఉండి ఉంటే మరికొందరు ప్రయాణికులు హై టెన్షన్ విద్యుత్ షాక్‌కు గురయ్యి ప్రాణాలు వదిలేవారు. కాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. బాధితులకు సహకరిస్తాం: నవీన్ భువనేశ్వర్: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రకటించారు. ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. కాగా, హీరాఖండ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఒడిశాకు చెందిన ప్రయాణికులకే ఈ పరిహారం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం రైల్వే జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే(భువనేశ్వర్) జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం అందిస్తామన్నారు. ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కూనేరు వద్ద పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. పోలీసుల అదుపులో గార్డు, డ్రైవర్ సాలూరు: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై విచారణలో భాగంగా రైలు డ్రైవర్ డి. ఎన్.రాజు, గార్డు ఎల్.లక్ష్మణ్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రైలు డ్రైవర్ నిరాకరించాడు. -
విద్రోహమా? అలసత్వమా?
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై అనుమానాలు హీరాఖండ్ ప్రమాదానికి కారణమేమిటి? పట్టాలు ఎలా విరిగాయి? దుండగులెవరైనా పట్టాలను ముందుగానే కట్ చేశారా?... క్రాస్‌గా విరగాల్సిన రైలు పట్టాలు షార్ప్‌గా ఎందుకు విరిగాయి... అసలిది ప్రమాదమా లేక విద్రోహుల పనా?... లేక రైల్వే అధికారుల అలసత్వమా? ప్రమాదానికి ముందు ఆ మార్గంలో గూడ్స్ రైలు వెళ్లాక సమీపంలోని క్యాబిన్ మాస్టర్ చెక్ చేయలేదా?.. ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వారు పలు సందర్భాల్లో దాడులకు పాల్పడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం కూనేరు రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. కూనేరు పక్కనున్న గుమ్మడ స్టేషన్‌ను ఏడేళ్ల క్రితం పేల్చేశారు. ఆ తర్వాత అక్కడ కొత్త స్టేషన్ నిర్మించారు. అదే స్టేషన్లో ఓ పోలీసును చంపి మరీ నగదు దోచుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో సహజంగానే విద్రోహ చర్య అన్న అనుమానం వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో దాదాపు ఐదేళ్ల నుంచి మావోయిస్టుల కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. రైల్వే అధికారులే తమ అలసత్వం బైటపడకుండా ఇలా విద్రోహచర్య వాదనను తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. – కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, విశాఖపట్నం 24 నిమిషాల ముందు సాఫీగా.. రాత్రి 10.40 గంటలకు ఇదే రెండవ ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు సాఫీగా వెళ్లింది. 11.05 గంటలకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై పట్టాలు తప్పింది. 25 నిమిషాల్లో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. పట్టాలు సరిగ్గా లేకపోతే గూ డ్స్ వెళ్లినప్పుడే ప్రమాదం సంభవించి ఉండాలి. కానీ అలా జరగలేదు. పట్టాలు షార్ప్‌గా కట్ అయ్యాయి. ఎడ్జ్ కట్ కావాల్సినవి షార్ప్ కట్ ఎందుకు అయ్యాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు రాకముందే కట్ అ యి ఉన్నట్లు భావిస్తున్నారు. పట్టాలను గమనించడంతోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారని, దాంతో బోగీలు ఒకదానికొకటి గుద్దుకున్నాయని రైల్వేవర్గాలంటున్నాయి. సాధారణంగా చలికాలంలో పట్టాలు కాస్త సంకోచించి ఉంటాయి. అది కూడా ప్రమాదాలకు కారణమవుతుంటుంది. కానీ ఇక్కడ పట్టాలు ముందే తెగిపడి ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. విద్రోహుల పనేనా...? సిబ్బందిని బెదిరించి విద్రోహులు పట్టాలు తప్పించి ఉంటారేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానంతో రైల్వే ఉన్నతాధికారులు పలువురు స్థానిక సిబ్బందిని విచారిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే వచ్చే నెల 3న రైల్వే జీఎం పర్యటన ఉండటంతో ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టాలు సరిగ్గా ఉన్నాయో లేదో కచ్చితంగా చూస్తారు. కానీ ఇక్కడ చూడలేదు. గూడ్స్ వెళ్లిన తర్వాత ట్రాక్ చెక్ చేయలేదు. రైల్వే క్యాబిన్ కూడా పక్కనే ఉంది. అక్కడ క్యాబిన్ మాస్టర్ కూడా ఉంటారు. అయితే ఆయన పట్టాలు కట్ అయిన విషయాన్ని గమనించలేదా? లేక చూసి చూడనట్లు వదిలేశారా అనేది తేలాల్సి ఉంది. కీమ్యాన్లపై వదిలేయడమే కారణమా? మరోవైపు ఈ దుర్ఘటనకు రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా కింది స్థాయి కీమ్యాన్లపైనే వదిలేశారన్న ఆరోపణలు రైల్వే వర్గాల నుంచే వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో రైలు పట్టాలను పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లో ఇంజినీరింగ్ అధికారులుంటారు. రాయగడలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (నార్త్), విజయనగరం జిల్లా పార్వతీపురం కేంద్రంగా సీనియర్ సెక్షన్ ఇంజినీరు (పర్మనెంట్ వే) ఉంటారు. ఆయన కింద గుమ్మడలో జూనియర్ ఇంజినీర్, వీరందరిపై పర్యవేక్షణకు విశాఖలో సీనియర్ డివిజనల్ ఇంజినీరు (నార్త్) విధులు నిర్వహిస్తారు. సంబంధిత దిగువ స్థాయి ఇంజినీర్లు పుష్ (తోపుడు) ట్రాలీ, మోటారు ట్రాలీలపై తరచూ ట్రాక్‌లను తనిఖీ చేయాలి. పట్టాలపై ఎక్కడైనా లోపాలు కనిపిస్తే తక్షణమే సరి చేయించాలి. కానీ కొన్నాళ్లుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన సెక్షన్‌తో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో వీరు ట్రాలీలపై తనిఖీలే సమగ్రంగా చేయడం లేదని తెలుస్తోంది. కాని తనిఖీలకు వెళ్లినట్టు రికార్డుల్లో చూపుతూ టీఏ, డీఏలు డ్రా చేస్తున్నట్టు సమాచారం. రికా ర్డుల ప్రకారం వీరు ట్రాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు లెక్క! కానీ వాస్తవానికి సంబంధిత ప్రాంతాల్లోని కీమ్యాన్లపైనే వీరు ఆధారపడుతున్నారని అంటున్నారు. గొట్లాం–సింగపూర్ రోడ్డు లైన్ చూసే ఇంజినీరింగ్ అధికారి మూడేళ్ల క్రితం నేరుగా నియమితులై విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. ఆయనకు అంతగా çపట్టు లేకపోవడం వల్ల దిగువ స్థాయి సిబ్బంది చెప్పిన దానిపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. పార్వతీపురం సెక్షన్ ఇంజినీరిం గ్ అధికారి పర్యవేక్షణపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన నాలుగేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ డివిజనల్ ఇంజినీర్(నార్త్) పీ–వే నుంచి కాకుండా సివిల్ ఇంజినీ రింగ్ నుంచి రావడం వల్ల పీ–వేపై అవగాహన లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా ప్రధాన లైన్లలో విధులు నిర్వహి స్తున్న ఇంజినీరింగ్ విభాగ అధికారుల నిర్లక్ష్యం, అవగా హనా రాహిత్యం వెరసి హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి కారణమయిందని రైల్వే వర్గాల్లో వినిపిస్తోంది. విద్రోహ చర్యగా చిత్రీకరణ? హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారాన్ని లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోశారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల కదలికలున్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ఈ ఘటనకు కారకులను తేలికగా బయట పడవచ్చన్నది వ్యూహంగా చెబుతున్నారు. మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ముందు ప్రజలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారని, రైళ్లను పట్టాలు తప్పించి ప్రయాణికులను పొట్టనబెట్టుకునే దుశ్చ ర్యకు పాల్పడరని గత అనుభవాలను ఉదహరిస్తు న్నారు. ఈ హీరాఖండ్ ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహచర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
రైలు ప్రమాదంలో ఉగ్రకోణం?
విశాఖపట్నం: దాదాపు అర్ధరాత్రి సమయం.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పడం బోగీలు చెల్లాచెదురవడం.. పెద్ద మొత్తంలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం.. అంతకంటే ముందు వెళ్లిన రైలుకు ఏం నష్టం జరగకపోవడం ఇదంతా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాద నేపథ్యం. కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పి ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి కారణాన్ని ఇప్పటి వరకు ప్రకటించని అధికారులు తాజాగా ఉగ్రకోణం తీసిపారేయలేమని స్పష్టం చేశారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విధ్వంసకకర కుట్రం దాగి ఉందని గట్టిగా అనుమానిస్తున్నారు. రైలు పట్టాలు రెండు చోట్ల విరిగి ఉండటం, అర్థరాత్రి ప్రమాదం జరగడం కూడా వారి అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల కాన్పుర్ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద చర్య ఉందని పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిరాఖండ్ ప్రమాదం వెనుక కూడా ఉగ్రవాదులు ఉన్నారనే కోణంలోనే విచారణ ప్రారంభించారు. అయితే, అన్నికోణాల్లో విచారణ జరుపుతామని వారు చెబుతున్నారు. త్వరలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
రైలు ప్రమాదంలో ఉగ్రవాదుల హస్తం?
-
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
విశాఖపట్నం: విజయనగరంలో జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల సమయాల్లో, వెళ్లే మార్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రైళ్లు మొత్తానికే రద్దుకాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ధన్‌బాద్ అలెప్పీ ఎక్స్‌ప్రెస్, హతియ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను టిట్టాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్ మీదుగా దారిమళ్లించగా.. నాందేడ్-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను కుర్టా రోడ్డు-అంగుల్ మీదుగా దారి మళ్లించారు. ఇక రాయ్‌గఢ్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్, సంబల్పూర్-నాందేడ్ రైళ్లు రద్దు చేశారు. మరోపక్క, కోరాపుట్-విశాఖ రైలును రాయగఢ్ వరకే పరిమితం చేశారు. అయితే, ట్రాక్ పనులపై డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ వివరణ ఇచ్చారు. సాయంత్రానికి ట్రాక్ పనులు పునరుద్ధరిస్తామని చెప్పారు. రైలు ప్రమాదంపై సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన రైలు ప్రమాదం విచారణ కమిటీ వేసినట్లు వివరించారు. ప్రమాదంపై ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. -
'యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు'
-
ఘోర రైలు ప్రమాదం.. 35 మంది మృతి
-
'యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు'
న్యూఢిల్లీ : విజయనగరం జిల్లా రైలు ప్రమాదఘటనలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు రైల్వే పీఆర్ఓ అనిల్ సక్సేనా తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. రైలులోని మిగతా బోగీలను మరో ఇంజన్‌తో నడిపించేందుకు చర్యలు చేపట్టమన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం నుంచి సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సేవలందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్ నంబర్ల వివరాలు విశాఖపట్నం కంట్రోల్ రూమ్ : 1072, 0891-2748641 విశాఖపట్నం రైల్వే స్టేషన్ : 83003,83005,83006, 0891-2746344, 0891-2746330 విజయనగరం : 83331,83332,83333,83334, 08922-221202 రాయ్‌గఢ్ : 85744,85755,85777,85788, 06856-223400, 223500 సెల్ : 09439741181, 09439741071, 07681878777, 07326812986. -
పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్
► పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ► 41 మంది మృతి.. 25 మృతదేహాలు వెలికితీత ► విజయనగరం జిల్లా కొమరాడ వద్ద అర్ధరాత్రి ప్రమాదం ► 100 మందికి పైగా తీవ్రగాయాలు ► 8 బోగీలు బోల్తా.. ఒక ఏసీ బోగీ సహా ఐదు బోగీలు పూర్తిగా నుజ్జునుజ్జు సాక్షి, విజయనగరం/విశాఖపట్నం: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 41 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయానికి 25 మృతదేహాలను వెలికితీశారు. పలు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్.6, ఎస్.7 స్లీపర్ బోగీలతో పాటు ఒక ఏసీ బోగీ, నాలుగు జనరల్ సహా 8 బోగీలు బోల్తాపడ్డాయి. సమాచారం అందిన వెంటనే విజయనగరం, విశాఖపట్నం నుంచి సహాయ బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. బోగీలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం దని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ విశాఖ నుంచి రిలీఫ్, మెడికల్ రిలీఫ్ ట్రైన్లతో హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ప్రమాద స్థలిలో నాలుగు అంబులెన్సులు వైద్య సేవల్లో నిమగ్నమయ్యాయి. స్థానికులు సైతం ఘటనా స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. సుమారు 70 మంది క్షతగాత్రులను పార్వతీపురం, రాయ్‌గఢ్ ఆస్పత్రులకు తరలించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం అర్ధరాత్రి.. అటవీ ప్రాంతం.. ఒక్క సారిగా పెద్ద శబ్ధం.. ఏం జరిగిందో అర్థం కాలేదు. నిద్ర నుంచి మేల్కొన్న ప్రయాణికుల అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఎలాగైనా బయట పడాలని ఆరాటంలో బోగీల్లో ఒకరిపై ఒకరు పడిపోయారు.. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకోవడంతో కొందరు, బోగీలు పడిపోయిన తాకిడికి గాయాలై మరికొందరు విగతజీవులయ్యారు. పదుల సంఖ్యలో గాయపడిన వారి హాహాకారాలతో ఘటనా స్థలి దద్దరిల్లింది. తాము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైందని తెలుసుకుని బోగీల్లో చిక్కుకుపోయిన వారు వణికిపోయారు. ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అధికారులు హెల్ప్‌లైన్ (8106053006 (ఎయిర్టెల్), 8500358712 (బీఎస్ఎన్ఎల్) ఏర్పాటు చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరిన్ని సంబంధిత వార్తలు : రైలు ప్రమాద మృతుల వివరాలు రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా -
ఉత్తరాది అనుభవం
పాఠక పర్యాటకం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాక మా ఇంజనీరింగ్ విద్యార్థులం మొత్తం 120 మందిమి కలిసి ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లాం. రాత్రి రెండు గంటలకు శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. మర్నాడు రాత్రి పన్నెండు గంటలకు అమృత్సర్ చేరుకున్నాం. సజీవ సాక్ష్యం జలియన్‌వాలా బాగ్ హోటల్లో తయారై, చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి బయల్దేరాం. ముందుగా జలియన్‌వాలా బాగ్‌కి చేరుకున్నాం. బ్రిటిష్ వారి దురాగతానికి వేల మంది బలైపోయిన నాటి చారిత్రక సంఘటనలకు గుర్తుగా అక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. నాటి విషయాలు తెలుసుకుంటూ మ్యూజియవ్ును సందర్శించాం. ఆ తర్వాత అమృత్‌సర్‌లోని ప్రసిద్ధ స్వర్ణదేవాలయానికి చేరుకున్నాం. వాఘా సరిహద్దులో నినాదాలు ఇది సిక్కుల దేవాలయం. పసిడి వెలుగుల్లో దేవాలయం అత్యంత సుందరంగా కనువిందు చేసింది. దేవాలయం ముందు సరస్సులో రంగు రంగుల చేపలు. వాటిని ఎంతసేపు చూశామో సమయమే తెలియలేదు. అక్కడ నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న భారత సరిహద్దు ప్రాంతం వాఘా బోర్డర్‌కి చేరుకున్నాం. అక్కడ త్రివిధ దళాల సైనిక విన్యాసాలు ఆసక్తి కలిగించాయి. ‘భారత్‌మాతాకీ జై’ అనే నినాదం మార్మోగిపోయింది. భారతీయతను గుండెల నిండుగా నింపుకొని కులూమనాలీ బయల్దేరాం. కులూమనాలీలో రివర్ ర్యాఫ్టింగ్ కులూ వద్ద బియాస్ నదిలో రివర్ ర్యాఫ్ట్ చేయడానికి సదుపాయం ఉంది. ఈ నదిలో ఏడు కిలోమీటర్ల దూరానికి 500 రూపాయలు చెల్లించి లైఫ్ జాకెట్, హెల్మెట్ ధరించి గైడ్ సూచనల మేరకు బోటులో ప్రయాణించాం. చల్లటి నీళ్లు పడవలోకి ప్రవేశించి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ మా ఆనందంలో అవి దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. మనాలీ నుంచి కిలోమీటర్ దూరంలో మను దేవాలయం, రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హిడింబ దేవాలయాలు సందర్శించాం. వాటి నిర్మాణశైలి, ఆహ్లాదకరమైన పరిసరాలు అమితంగా ఆకట్టుకున్నాయి. అటు తర్వాత అల్లు అర్జున్ నటించిన తెలుగు చలనచిత్రం ‘దేశముదురు’ షూటింగ్ జరిగిన ప్రాంతానికి వెళ్లి కాసేపు ఉల్లాసంగా గడిపాం. ఆ తర్వాత మనాలీకి 51 కి.మీ. దూరంలో ఉన్న రోహ్తాంగ్ పాస్‌కు చేరుకున్నాం. సిమ్లా లోయల్లో విహరించి, చారిత్రక అద్భుతం ఢిల్లీని సందర్శించి, శ్రీకాకుళం తిరుగు ప్రయాణమయ్యాం. - పైడిశెట్టి హరీష్ కుమార్, నరసన్నపేట, శ్రీకాకుళం -
'పై-లీన్'తో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
పై-లీన్ తుఫాన్‌తో ఒడిశా, ఉత్తరాంధ్రలోని జిల్లాలు చిగురుటాకులా వణికాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్- యశ్వంత్‌పూర్, పూరి- చెన్నై,భువనేశ్వర్- తిరుపతి, భవనేశ్వర్- సికింద్రాబాద్, భువనేశ్వర్ - విశాఖ (ఇంటర్ సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్ (హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్), అహ్మదాబాద్ - పూరి, ముంబై - భువనేశ్వర్, పూరి- తిరుపతి, గౌహతి- చెన్నై (ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్) తదిరత ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే విశాఖ - మచిలీపట్నం, విశాఖ - రాజమండ్రి, పలాస - విశాఖ, పూరి - గుణుపూర్, పలాస - గుణుపూర్, విజయనగరం - విశాఖ, విజయవాడ - రాయఘడ్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.