
చీకట్లో చితికిన బతుకులు
- హీరాఖండ్ ప్రమాదంలో 40 మంది మృత్యువాత.. 71 మందికిపైగా గాయాలు
- మృతుల్లో అత్యధికులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వారే
మృతుల్లో అత్యధికులు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారేనని తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. వీరిలో 23 మందిని గుర్తించారు. 17 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఎం. కృష్ణ (35), పి.శ్రీను (25), బి.కమల (50), గాయత్రి సాహు (14), దిలీప్ కేఆర్ రౌత్ (51), టీకే మైంజ్ (45), సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, రాజన్ నాయక్ (18), సుభాష్ సీహెచ్ సాహు (60), ఎస్.రేణుక, పి.పోలి (35), జశోద పండిట్, రాంప్రసాద్ పండిట్, కె.రేవతి (16), మండల్ బలరామ్, సుబా భారతి సాహు, తపన్‌కుమార్ ప్రధాన్ (26), కార్తీక్ సాహు (21), రాధ (8), పూలన్‌దేవి, కె.రవికుమార్ (20) (విజయనగరం), బెడుధర్ బోయి ఉన్నారు.
ప్రమాదం నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఘటనా స్థలం కూనేరు నుంచి ఒక ప్రత్యేక పాసింజరు రైలును 13 బోగీలతో రాయగడ, టిట్లాఘర్, సంబల్‌పూర్, అంగుల్‌ల మీదుగా భువనేశ్వర్‌కు నడిపింది. క్షతగాత్రులను బరంపురం, భవానీపాట్నా, తదితర ప్రాంతాలకు పంపడానికి వీలుగా 13 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్, బోగీలను పట్టాలపై నుంచి తొలగించే పని సాయాంత్రానికి పూర్తి అయింది.
కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, విశాఖపట్నం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు వదిలారు. దాదాపు 71 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయఘడ రైల్వే ఆస్పత్రి, విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. నాలుగు జనరల్ బోగీలు, రెండు స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు ఏసీ బోగీలు దెబ్బతిన్నాయి. రైల్వే, పోలీస్, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రయాణికులను కార్లు, బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
తర్వాత ఒక్కొక్కటిగా 40 మృతదేహాలను వెలికి తీశారు. బోగీల్లో మరికొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. నుజ్జునుజ్జు అయిన బోగీల మధ్య చిక్కుకుపోవడంతో వెలికి తీయడం కష్టంగా మారింది. సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లతో బోగీలను కోసి మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. ప్రమాద తీవ్రత, జరిగిన తీరును బట్టి విద్రోహుల హస్తం ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కమిటీతో అధ్యయనం చేయిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఉమేష్ సింగ్ వెల్లడించారు.
ప్రమాదం జరిగిందిలా..
జగదల్‌పూర్ నుంచి శనివారం రాత్రి 7.55 గంటలకు రైలు బయలు దేరింది. కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పి.. ఆ పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంటూ దూసుకుపోయింది. ఆ వేగానికి పట్టాలపై నుంచి బోగీలు 20 మీటర్ల దూరం రైల్వే స్థలంలోకి వెళ్లిపడిపోయాయి. బోగీలు ఒకదానికొకటి గుద్దు కోవడంతో నుజ్జునుజ్జయ్యాయి. పట్టాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి బోగీల్లోకి చొచ్చుకొచ్చాయి. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రెండవ ట్రాక్ మీదుగా వెళుతోంది. ఈ ట్రాక్‌లో విద్యుత్ లైన్లు ఇటీవలే ఏర్పాటు చేశారు. ఇంకా సరఫరా ఇవ్వలేదు. దీంతో ఈ లైన్లో డీజిల్ ఇంజిన్లతోనే రైళ్లు నడుపుతున్నారు.
విజయనగరం వచ్చేంత వరకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ డీజిల్ ఇంజన్‌తోనే నడుస్తుంది. విజయనగరంలో ఎలక్ట్రికల్ ఇంజిన్‌ను జత చేస్తారు. ఇదే కొంత వరకు ప్రాణనష్టాన్ని తగ్గించింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ లైన్లకు సరఫరా ఉండి ఉంటే మరికొందరు ప్రయాణికులు హై టెన్షన్ విద్యుత్ షాక్‌కు గురయ్యి ప్రాణాలు వదిలేవారు. కాగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు.
బాధితులకు సహకరిస్తాం: నవీన్
భువనేశ్వర్: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రకటించారు. ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. కాగా, హీరాఖండ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఒడిశాకు చెందిన ప్రయాణికులకే ఈ పరిహారం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి తెలిపారు.
రూ.2 లక్షల చొప్పున పరిహారం
రైల్వే జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటన
హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే(భువనేశ్వర్) జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం అందిస్తామన్నారు. ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా
జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కూనేరు వద్ద పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు.
పోలీసుల అదుపులో గార్డు, డ్రైవర్
సాలూరు: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై విచారణలో భాగంగా రైలు డ్రైవర్ డి. ఎన్.రాజు, గార్డు ఎల్.లక్ష్మణ్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రైలు డ్రైవర్ నిరాకరించాడు.