Railway authorities
-
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ నాటికి వీటి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి త్వరలో ట్రయల్ రన్ పూర్తి చేసుకుని పట్టాలెక్కే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. వీటితోపాటుగా, తక్కువ దూరంలో ఉండే నగరాల మధ్య ప్రయాణాల కోసం వందే మెట్రో లేదా వందే భారత్ మెట్రోగా పిలిచే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే మొదలవనుందని చెబుతున్నారు. -
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. పూర్తిగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), విజయవాడ–విశాఖపట్నం (22702/22701), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07576/07500), విజయవాడ–గూడూరు (12744/12743) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం టౌన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 25 వరకు యర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 23 నుంచి 30 వరకు భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019), ఈ నెల 18 నుంచి 31 వరకు ధన్‌బాద్–అలెప్పి (13351), ఈ నెల 23, 30 తేదీల్లో హతియా–బెంగళూరు (18637), ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో హతియా–బెంగళూరు (12835), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా–బెంగళూరు (12889), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 18, 25 తేదీల్లో హతియా–యర్నాకులం (22837) రైళ్లు రెండు మార్గాల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
ఎక్కడి రైళ్లు అక్కడే
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య ఆదివారం రాత్రి విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నంబర్ల 0891–2746330/0891–2744619ను ఏర్పాటు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 120 టన్నుల, 140 టన్నుల సామర్థ్యం గల క్రేన్లతో జీఆర్పీ, రైల్వే అధికారులు, సిబ్బందితో మరో రెండు ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చెన్నై సెంట్రల్–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్‌పూర్–పూరీ (22842) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించే వరకు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. రద్దయిన రైళ్లు సోమవారం రాయ్‌పూర్–విశాఖపట్నం–రాయ్‌పూర్ (08527/08528) పాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయింది. దారి మళ్లించిన రైళ్లు ఈ దిగువ రైళ్లను ఆదివారం రెగ్యులర్ మార్గం విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్–రాయ్‌పూర్–నాగ్‌పూర్–బల్హార్షా–విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 28వ తేదీన బారునిలో బయల్దేరిన బారుని–కోయంబత్తూర్ (03357) స్పెషల్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన టాటాలో బయల్దేరిన టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 29వ తేదీన భువనేశ్వర్‌లో బయల్దేరిన భువనేశ్వర్–ముంబయ్ (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. గమ్యం కుదించిన రైళ్లు ఇవీ ► 29న సంబల్పూర్లో బయల్దేరిన సంబల్పూర్–నాందేడ్(20809)ఎక్స్‌ప్రెస్ విజయనగరం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి సంబల్పూర్ చేరుకుంది. ► నెల 29న పూరీలో బయల్దేరిన పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్ బలుగాం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి పూరీ చేరుకుంది. ► 29న విశాఖపట్నంలో బయల్దేరిన విశాఖపట్నం–విజయనగరం (07468) పెందుర్తి నుండి విశాఖకు చేరుకుంది. ► 28వ తేదీన ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి భువనేశ్వర్–ముంబై (11020) రైలుగా ముంబై బయల్దేరుతుంది. ఆర్టీసీ అప్రమత్తం రైళ్ల ప్రమాద ఘటనతో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి విజయనగరం నుంచి 10, సింహాచలం నుంచి 5, గాజువాక నుంచి 3, ఎస్.కోట నుంచి 2 బస్సులను పంపించారు. క్షతగాత్రులను ఈ బస్సుల్లో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరో 5 బస్సులను విజయనగరంలో సిద్ధం చేశారు. పార్వతీపురం, పలాస వైపు వెళ్లే ప్రయాణికులకు, ప్రమాదం వల్ల వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో సరిపడినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లో కూడా బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను నియమించామని, ఘటనా స్థలానికి మరికొందరు అధికారులను పంపించామని తెలిపారు. -
9, 11న పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఖరగ్‌పూర్ డివిజన్లోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద జరుగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హౌరా–మైసూర్ (22817), షాలీమార్–హైదరాబాద్(18045/18046), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (22807), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), ఆగర్తలా–సికింద్రాబాద్ (07029), సిల్ఘాట్ టౌన్–తంబరం (15630), చెన్నై సెంట్రల్–షాలీమార్ (12842), పురులియా–విల్లుపురం (22605) రైళ్లను ఈ నెల 9న రద్దు చేశారు. మైసూర్–హౌరా (22818) రైలును ఈ నెల 11న రద్దు చేశారు. -
ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే.. విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్ 1 నుంచి 10 వరకు కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్ 2 నుంచి 11 వరకు భువనేశ్వర్–పుణే (02882) జూన్ 1 నుంచి 8 వరకు పుణే–భువనేశ్వర్ (02881) జూన్ 3 నుంచి 10 వరకు కడప–విశాఖపట్నం (07488) జూన్ 1 నుంచి 10 వరకు విశాఖపట్నం–కడప (07487) జూన్ 2 నుంచి 11 వరకు విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్ 1 నుంచి 10 వరకు లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్ 2 నుంచి 11 వరకు -
ఏపీ నుంచి సొంత రాష్ట్రాలకు 86,863 మంది వలస కార్మికులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 86,863 మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో వీరిని స్వస్థలాలకు పంపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వలస కార్మికులకు ప్రయాణ టికెట్లు, ఆహారంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ.500 ఇచ్చి శ్రామిక్ రైళ్లలో వారిని పంపింది. నడిచి వెళుతున్న కార్మికులను ఎక్కడికక్కడ ఆపి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస శిబిరాలకు తరలించారు. మొత్తం 281 పునరావాస శిబిరాలతోపాటు జాతీయ రహదారుల వెంబడి ఆహారం అందించేందుకు 110 క్యాంపులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 75 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను తరలించింది. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు కార్మికుల తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో.. ప్రస్తుతం ఒక్క పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే కార్మికులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ వరదల కారణంగా ఈ నెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపొద్దని అక్కడి ప్రభుత్వం కోరింది. రెండుమూడ్రోజుల్లో మూడు శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మన రాష్ట్ర పరిధిలో 90 వేల మంది వలస కూలీలను 3 వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో ఆయా జిల్లాలకు పంపారు. గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వలస కూలీలు ఇతర జిల్లాలకు తరలివెళ్లారు. ఏపీకి చెందిన 4,852 మంది వలస కూలీలు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, బెంగళూరు నుంచి ఆరు రైళ్లలో రాష్ట్రానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లి గుజరాత్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. వలస కూలీల పట్ల రైల్వే ఉదారత ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా వెళ్లే వలస కూలీలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహారాన్ని అందించింది. ఎన్జీవోలూ రైల్వే స్టేషన్లలో వలస కూలీలకు ఆహారాన్ని పంపిణీ చేశాయి. దాదాపు 3.5 లక్షల మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా ఈ నెల 2 నుంచి 25 వరకు 225 శ్రామిక్ రైళ్లు నడిచాయి. -
మొరాయించిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి కొత్త ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మార్గమధ్యలో పలు ప్రాంతాల్లో మొరాయించింది. బుధవారం ఉదయం బయలు దేరిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బ్రేక్ బోల్డు స్టార్ రిలీజింగ్ పైపు విరగగా అక్కడ 20 నిమిషాల పాటు ఆపి తాత్కాలిక మరమ్మతు చేసి, కాజీపేట పంపించారు. కాజీపేటలో మెకానిక్ సిబ్బంది కూడా 10 నిమిషాల పాటు శ్రమించి మరమ్మతు పూర్తి చేశారు. ఇక రామగుండం వెళ్లే సరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో కాజీపేట నుంచి మెకానిక్ సిబ్బంది కొత్త బోల్డు స్టార్ పైప్ తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందితో కలసి గంట పాటు శ్రమించి బోల్డు స్టార్‌ను తొలగించి కొత్తది అమర్చారు. ఇలా సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యంగా వెళ్లినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. -
విశాఖను వెలివేశారా!
గాజువాకకు చెందిన ఓ ప్రయాణికుడు బైపాస్‌లో వెళ్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి ప్రయాణించి అర్ధరాత్రి 2.30 గంటలకు దువ్వాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన నివసిస్తున్న గాజువాక వెళ్లడానికి ఆ సమయంలో ఒక్క బస్సూ లేదు. ఉన్న ఒక్క ఆటోవాలను అడిగితే రూ.500 డిమాండ్ చేశాడు. బేరమాడి చివరికి రూ.400 సమర్పించుకొని గాజువాక చేరుకున్నాడు...ఇది ఏ ఒక్క ప్రయాణికుడి ఇబ్బందో కాదు.. బైపాస్ రైళ్లతో విశాఖవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.విశాఖ రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం నిండిపోతుంది. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌కు రాకుండానే దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌పారాలు ఖాళీ లేవన్న కారణంతో రైళ్లను బైపాస్ మార్గంలో దువ్వాడ మీదుగా మళ్లించేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లను సైతం విశాఖను వెలివేశామన్నట్లు వ్యవహరిస్తూ దువ్వాడ మీదుగానే నడుపుతున్నారు. రైల్వే అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్‌కే కాదు.. దేశ రైల్వే వ్యవస్థకూ కీలకమైన స్టేషన్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందింది. కానీ.. ఆ గుర్తింపునకు మచ్చతెచ్చేలా వివిధ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైళ్ల రాకపోకల విషయంలో విశాఖకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రధాన నగరాలకు వెళ్తున్న కీలక ట్రైన్లన్నీ విశాఖ మొహం చూడకుండానే జారుకుంటున్నాయి. వాల్తేరు అధికారుల నిర్లక్ష్యం.. రెండు జోన్ల కక్షసాధింపు చర్యలతో విశాఖను వెలివేసినట్లుగా వ్యవహారం మారుతోంది. ట్రాఫిక్ బూచీ.. రైళ్లు బైపాస్‌కి.. విశాఖ రైల్వే స్టేషన్లో 8 ప్లాట్‌ఫారాలున్నాయి. ప్రతి ప్లాట్‌ఫామ్.. 24 బోగీలకంటే ఎక్కువ సామర్ధ్యమున్న ట్రైన్ అయినా హాల్ట్ చేసుకునేలా రూపొందించారు. విశాఖకు వచ్చే ప్రతి రైలూ తమ ప్రయాణ దిశను మార్చుకొని తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్టేషన్లో ట్రైన్లు ఎక్కువ సేపు ఆపుతుంటారు. దీంతో రాబోయే రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా విశాఖ వచ్చే రైళ్లని ఎక్కువగా ఔటర్లో నిలబెడతారు. ఇదే సాకుని చూపిస్తూ.. చాలా రైళ్లని విశాఖ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా.. ఏ ట్రైన్ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్ మీదుగా రైళ్లని పంపించేస్తున్నారు. పదమూడేళ్లుగా వివక్షే... 2006లో తొలిసారిగా బైపాస్ మీదుగా రైళ్ల మళ్లింపు ప్రారంభించారు. రిలే రూట్ ఇంటర్ లాకింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ మళ్లింపులు చేశారు. అప్పట్లోనే 12 ట్రైన్లు బైపాస్ మీదుగా వెళ్లిపోయాయి. అయితే అప్పటి వాల్తేరు డీఆర్ఎం ఇంద్రకుమార్ ఘోష్ స్టేషన్ రద్దీ దృష్ట్యా జ్ఞానాపురం వైపు మరో 4 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసేందుకు నివేదిక సిద్ధం చేసి ఈస్ట్‌కోస్ట్ ఉన్నతాధికారులకు పంపించారు. ఆ నివేదికను తుంగలో తొక్కేశారు. దారి మళ్లింపు విషయంలో అప్పటి ఎంపీలు పోరాటం చేయడంతో మళ్లీ విశాఖ నుంచి 7 ట్రైన్లు రాకపోకలు ప్రారంభించాయి. 5 మాత్రం అలాగే ఉన్నాయి. దసరా పేరుతో మరికొన్ని... ఆది నుంచి 5 రైళ్లు దువ్వాడ బైపాస్ మీదుగా వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 5 రైళ్లను విశాఖ నుంచి పంపించేస్తున్నారు. దసరా సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించిన అధికారులు.. అందులో కొన్ని ట్రైన్లని విశాఖకు రానివ్వకుండా దువ్వాడ, కొత్తవలస మీదుగా దారి మళ్లించేశారు. పనిలో పనిగా నిత్యం విశాఖ మీదుగా వెళ్లే మరో 5 రెళ్లని కూడా బైపాస్ మీదుగా పంపించేస్తున్నారు. పండగ సమయంలో ఇలా చేస్తే ఎలా..? దసరా రద్దీ దృష్ట్యా రైళ్లను బైపాస్ మీదుగా పంపిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ పండగ సమయంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. వారందరికీ ఈ రైళ్లు ఏవీ ఉపయోగపడని పరిస్థితి దాపురించింది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. వాల్తేరు డివిజన్ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. రాత్రి పూట ఖాళీ ఉన్నా..పట్టించుకోవట్లేదు.. ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఐదు ట్రైన్లు అర్ధరాత్రి 12 గంటలు నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమంలో విశాఖ స్టేషన్లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలిది బైపాస్ కాదు.. కానీ... వాస్తవంగా దువ్వాడ బైపాస్ని ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్ బైపాస్ 4 కిమీ దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్ 7 కి.మీ, నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్ 7 కి.మీ, విజయవాడకు రాయనపాడు బైపాస్ 7 కి.మీ దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ.. విశాఖ నుంచి దువ్వాడ బైపాస్కు 17 కి.మీ, కొత్తవలస బైపాస్కు 20 కిమీ దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. కక్షపూరిత వ్యవహారంగా..? విశాఖపట్నం రాకుండా ట్రైన్లని బైపాస్ మీదుగా పంపిచేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్థానిక ప్రయాణికులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రి, బోర్డు అధికారులకు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఇదంతా విశాఖపట్నం జోన్‌గా ఏర్పడుతుందన్న అక్కసుతో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆడుతున్న మోసపూరిత నాటకమని విమర్శిస్తున్నారు. విశాఖ స్టేషన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టేందుకు ఈ రైళ్లని రానివ్వకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పడితే ఆయా జోన్ల ఆదాయం తగ్గుముఖం పడుతుందనే కారణంతో ఈ విధమైన నిరంకుశ వ్యవహారాలకు తెరతీస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బైపాస్‌తో ఇబ్బందులు పడుతున్నాం.. బైపాస్ రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి దువ్వాడ స్టేషన్లో దిగిన తర్వాత ఇంటికి చేరుకోవాలంటే ఉదయం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఆటోలో వెళ్దామంటే ఆస్తులడుగుతున్నారు. బైపాస్ మార్గమంటూ ప్రయాణికుల్ని అర్ధరాత్రి అడవిపాలు చేస్తున్నారు ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. విశాఖ మీదుగా ప్రతి రైలూ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – ఎస్.అజిత్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం విశాఖ అంటే ఎందుకంత చులకన విశాఖ అంటే రైల్వే అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జోన్ అక్కసుతో చాలా రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా చేస్తున్నారు. ఫలి తంగా.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జోన్ వచ్చేంత వరకూ విశాఖకు ఈ కష్టాలు తప్పవేమోననే ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. – అనిల్‌కుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎంవీపీకాలనీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తా.. బైపాస్ మార్గంలో ప్రధాన రైళ్లని నడపుతుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా వేసిన రైళ్లు కూడా బైపాస్‌లోనే వేయడంతో విశా>ఖ ప్రజలు ఆ ట్రైన్ల సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ -
ప్రయాణికులకు బోగిభాగ్యం
సాక్షి, హైదరాబాద్: వేగంగా వెళ్లే రైలులో ఒక్క బోగీ పట్టాలు తప్పినా దాని వెనక ఉండే ఇతర బోగీలు పరస్పరం గుద్దుకుని ఒకదానిపై ఒకటి ఎక్కటం సహజం. ప్రతి రైలు ప్రమాదాల్లో ఈ తరహా దృశ్యాలే కనిపిస్తాయి. భారీ ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణం కూడా ఇలా బోగీలు ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవటమే. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకిఒకటి దూసుకుపోవటానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత పద్ధతి కప్లింగ్సే అనే విషయాన్నీ ఆ శాఖ గుర్తించింది. దీంతో వాటిని సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. గతంలోనే దీన్ని గుర్తించి కొత్త తరహా కప్లింగ్స్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అయితే వాటిల్లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవడంతో నిలిపివేసింది. తాజాగా అమెరికాలో వినియోగంలో ఉన్న కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ తరహా కప్లర్స్ ఏర్పాటు చేస్తే బోగీలు పరస్పరం ఢీకొనటం అనేది జరగదు. అలాగే ప్రయాణంలో కుదుపులు లేకుండా సౌకర్యంగా ఉండనుంది. రైల్వే ఆధునికీకరణలో భాగంగా రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఏఏఆర్ హెచ్ కప్లర్స్.. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రైల్ రోడ్ ఫర్ హైస్పీడ్.. ఇదో విదేశీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా బోగీలను అనుసంధానించే కప్లింగ్ వ్యవస్థతో ఉత్పన్నమవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరికరాల్ని రూపొందించింది. ప్రస్తుతమున్న సీబీసీకి దీన్ని అనుసంధానించాలని మన రైల్వే నిర్ణయించింది. ఆ పరికరం ఏర్పాటుతో వేగంగా వెళ్తున్న రైలు బ్రేకు వేసినా, నెమ్మదిగా వెళ్లే రైలు ఒక్కసారిగా వేగాన్ని పెంచినా ఏర్పడే భారీ కుదుపులను ఇది నిరోధించనుంది. ఈ పరికరం ఏర్పాటుతో రైళ్లలో కుదుపుల సమస్యకు విరుగుడు కలగనుంది. అవసరం ఏంటి..? ఇప్పటివరకు మన రైళ్లలో ఐఆర్ఎస్ స్క్రూ టైప్ సంప్రదాయ కప్లింగ్ వ్యవస్థే వాడకంలో ఉంది. ఇది తొలితరం కప్లర్. రెండు బోగీలను చివరలో కొండీలు ఉండే గొలుసు లాంటి దానితో బంధించి మధ్యలో భారీ స్క్రూను ఏర్పాటు చేస్తారు. ఇంజన్ మొదలు, బోగీల వరకు ఒకదానికొకటి అనుసంధానించే వ్యవస్థ ఇదే. బోగీలు పట్టాలు తప్పినప్పుడు ఈ లింక్ విడిపోయి బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి ఎక్కి భారీ ప్రాణనష్టానికి కారణమవుతోంది. దీంతో ఈ సంప్రదాయ కప్లర్స్‌ను తొలగించి వాటి స్థానంలో సెంటర్ బఫర్ కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ కొన్ని బోగీలకే వాటిని ఏర్పాటు చేయగలిగారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికీ 3,378 కోచ్‌లకు సంప్రదాయ కప్లర్స్ ఉండగా, కేవలం 1,238 కోచ్‌లకు మాత్రమే సీబీసీ ఏర్పాటు చేశారు. ఇక వేగంగా మిగతా వాటికి కూడా సీబీసీలను ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా తయారయ్యే బోగీలన్నింటికీ వాటినే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ.. ఈ సీబీసీతో కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకే అమెరికా తరహా ఏఏఆర్ హెచ్ కప్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి మామూలు కుదుపులు కాదు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మిత్రులు రైలులో ఢిల్లీ బయలుదేరారు. కాసేపటికి వారి బోగీలకు టీవాలా రావటంతో వీరు కొనుక్కుని తాగుతూ మాట ల్లో పడిపోయారు. ఇంతలో రైలు బ్రేకు వేయటంతో పెద్ద కుదుపు.. చేతిలోని టీ వారి మీద ఒలికిపోయింది. ఇక రాత్రి పడుకున్నాక ఇలాగే కుదుపులు ఏర్పడి సైడ్ బెర్త్‌పై పడుకున్న వారి తలలు రైలు గోడకు కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతటి భారీ కుదుపులతో ప్రయాణికులు బెంబేలెత్తారు. అలాంటి కుదుపులతో రైలు పట్టాలు తప్పిందేమోనని భయపడి హడలి పోయారు. సీబీసీ కప్లర్స్ ఏర్పా టు చేసిన రైల్లోనే ఈ కుదుపులు ఏర్పడుతున్నాయి. దీంతో రైల్వే శాఖ మంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన ఆరా తీయగా, కుదుపులకు సీబీసీ కప్లింగ్ వ్యవస్థనే కారణమని తెలిసింది. పట్టాలు తప్పినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా చేసి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతున్నా.. ఈ కుదుపులు మాత్రం భరించలేనివిగా ఉన్నాయి. దీం తో అధికారులు ఏఏఆర్ హెచ్ పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీసీ కప్లర్స్ ఉన్న అన్ని కోచ్‌లకు వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటివల్ల కుదుపుల్లేని ప్రయాణమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కప్లింగ్ ఏర్పాటు చేసేప్పుడు తక్కువ సిబ్బంది అవసరం పడుతుందని, మార్చే క్రమంలో సిబ్బం ది ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. -
ఢిల్లీ.. కూల్‌కూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లో అతి చల్లని వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా బుధవారం నమోదైంది.ఈ సీజన్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతకంటే ఒక పాయింట్ అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతంలో మంచు కారణంగా మొత్తం 18 రైళ్లను రద్దు చేయగా 6 రైళ్ల రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం 8.30 గంటలకు వాతావరణంలో తేమ 95 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ సీజన్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 పాయింట్లు అధికం. -
చీకట్లో చితికిన బతుకులు
-
చీకట్లో చితికిన బతుకులు
హీరాఖండ్ ప్రమాదంలో 40 మంది మృత్యువాత.. 71 మందికిపైగా గాయాలు మృతుల్లో అత్యధికులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వారే మృతుల్లో అత్యధికులు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారేనని తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. వీరిలో 23 మందిని గుర్తించారు. 17 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఎం. కృష్ణ (35), పి.శ్రీను (25), బి.కమల (50), గాయత్రి సాహు (14), దిలీప్ కేఆర్ రౌత్ (51), టీకే మైంజ్ (45), సోము అన్నమ్మ, విష్ణుప్రసాద్ సాహు, రాజన్ నాయక్ (18), సుభాష్ సీహెచ్ సాహు (60), ఎస్.రేణుక, పి.పోలి (35), జశోద పండిట్, రాంప్రసాద్ పండిట్, కె.రేవతి (16), మండల్ బలరామ్, సుబా భారతి సాహు, తపన్‌కుమార్ ప్రధాన్ (26), కార్తీక్ సాహు (21), రాధ (8), పూలన్‌దేవి, కె.రవికుమార్ (20) (విజయనగరం), బెడుధర్ బోయి ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఘటనా స్థలం కూనేరు నుంచి ఒక ప్రత్యేక పాసింజరు రైలును 13 బోగీలతో రాయగడ, టిట్లాఘర్, సంబల్పూర్, అంగుల్ల మీదుగా భువనేశ్వర్‌కు నడిపింది. క్షతగాత్రులను బరంపురం, భవానీపాట్నా, తదితర ప్రాంతాలకు పంపడానికి వీలుగా 13 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్, బోగీలను పట్టాలపై నుంచి తొలగించే పని సాయాంత్రానికి పూర్తి అయింది. కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, విశాఖపట్నం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 40 మంది ప్రాణాలు వదిలారు. దాదాపు 71 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయఘడ రైల్వే ఆస్పత్రి, విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా, విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. నాలుగు జనరల్ బోగీలు, రెండు స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో రెండు ఏసీ బోగీలు దెబ్బతిన్నాయి. రైల్వే, పోలీస్, అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రయాణికులను కార్లు, బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తర్వాత ఒక్కొక్కటిగా 40 మృతదేహాలను వెలికి తీశారు. బోగీల్లో మరికొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. నుజ్జునుజ్జు అయిన బోగీల మధ్య చిక్కుకుపోవడంతో వెలికి తీయడం కష్టంగా మారింది. సహాయక బృందాలు గ్యాస్ కట్టర్లతో బోగీలను కోసి మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. ప్రమాద తీవ్రత, జరిగిన తీరును బట్టి విద్రోహుల హస్తం ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కమిటీతో అధ్యయనం చేయిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఉమేష్ సింగ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిందిలా.. జగదల్పూర్ నుంచి శనివారం రాత్రి 7.55 గంటలకు రైలు బయలు దేరింది. కొమరాడ మండలం కూనేరు వద్ద పట్టాలు తప్పి.. ఆ పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంటూ దూసుకుపోయింది. ఆ వేగానికి పట్టాలపై నుంచి బోగీలు 20 మీటర్ల దూరం రైల్వే స్థలంలోకి వెళ్లిపడిపోయాయి. బోగీలు ఒకదానికొకటి గుద్దు కోవడంతో నుజ్జునుజ్జయ్యాయి. పట్టాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి బోగీల్లోకి చొచ్చుకొచ్చాయి. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రెండవ ట్రాక్ మీదుగా వెళుతోంది. ఈ ట్రాక్‌లో విద్యుత్ లైన్లు ఇటీవలే ఏర్పాటు చేశారు. ఇంకా సరఫరా ఇవ్వలేదు. దీంతో ఈ లైన్లో డీజిల్ ఇంజిన్లతోనే రైళ్లు నడుపుతున్నారు. విజయనగరం వచ్చేంత వరకు హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ డీజిల్ ఇంజన్‌తోనే నడుస్తుంది. విజయనగరంలో ఎలక్ట్రికల్ ఇంజిన్‌ను జత చేస్తారు. ఇదే కొంత వరకు ప్రాణనష్టాన్ని తగ్గించింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ లైన్లకు సరఫరా ఉండి ఉంటే మరికొందరు ప్రయాణికులు హై టెన్షన్ విద్యుత్ షాక్‌కు గురయ్యి ప్రాణాలు వదిలేవారు. కాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. బాధితులకు సహకరిస్తాం: నవీన్ భువనేశ్వర్: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం ప్రకటించారు. ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడినట్లు నవీన్ పట్నాయక్ తెలిపారు. కాగా, హీరాఖండ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ఒడిశా ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఒడిశాకు చెందిన ప్రయాణికులకే ఈ పరిహారం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం రైల్వే జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే(భువనేశ్వర్) జీఎం ఉమేశ్‌సింగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం అందిస్తామన్నారు. ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని పూర్తిగా.. మరికొన్ని పాక్షికంగా జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్లున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కూనేరు వద్ద పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. పోలీసుల అదుపులో గార్డు, డ్రైవర్ సాలూరు: హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై విచారణలో భాగంగా రైలు డ్రైవర్ డి. ఎన్.రాజు, గార్డు ఎల్.లక్ష్మణ్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు రైలు డ్రైవర్ నిరాకరించాడు. -
వెల్కమ్ టు ఇండియన్ రైల్వే
న్యూఢిల్లీ: త్వరలో ఈ పిలుపును దేశ రైళ్లలో వినబోతున్నారు. బోగిలోకి ఎక్కగానే వీనులవిందైన సంగీతం.. నవ్వుతూ చూడచక్కని భామలు.. చేతిలో గులాబీ పువ్వుతో స్వాగతం చెప్పనున్నారు. విమానాల్లో మాదిరిగానే త్వరలో రైళ్లలోనూ హోస్టెస్‌లు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రైన్ హోస్టెస్లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా ఢిల్లీ-ఆగ్రా-గాటిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో హోస్టెస్లను నియమించనున్నారు. గాటిమాన్ ఎక్స్‌ప్రెస్.. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు. వచ్చే నెలలో ప్రారంభించనున్న ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విమానాల్లో మాదిరిగానే హోస్టెస్లను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు. ఇలాంటి తరహా 9 రైళ్లను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని రైలే ్వ చూస్తోంది.