ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 86,863 మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో వీరిని స్వస్థలాలకు పంపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం వలస కార్మికులకు ప్రయాణ టికెట్లు, ఆహారంతోపాటు ప్రతి ఒక్కరికీ రూ.500 ఇచ్చి శ్రామిక్ రైళ్లలో వారిని పంపింది. నడిచి వెళుతున్న కార్మికులను ఎక్కడికక్కడ ఆపి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస శిబిరాలకు తరలించారు. మొత్తం 281 పునరావాస శిబిరాలతోపాటు జాతీయ రహదారుల వెంబడి ఆహారం అందించేందుకు 110 క్యాంపులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 75 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను తరలించింది. రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు కార్మికుల తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు.
రెండు మూడు రోజుల్లో..
ప్రస్తుతం ఒక్క పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే కార్మికులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ వరదల కారణంగా ఈ నెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపొద్దని అక్కడి ప్రభుత్వం కోరింది. రెండుమూడ్రోజుల్లో మూడు శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మన రాష్ట్ర పరిధిలో 90 వేల మంది వలస కూలీలను 3 వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో ఆయా జిల్లాలకు పంపారు. గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో వలస కూలీలు ఇతర జిల్లాలకు తరలివెళ్లారు. ఏపీకి చెందిన 4,852 మంది వలస కూలీలు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, బెంగళూరు నుంచి ఆరు రైళ్లలో రాష్ట్రానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లి గుజరాత్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది.
వలస కూలీల పట్ల రైల్వే ఉదారత
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా వెళ్లే వలస కూలీలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహారాన్ని అందించింది. ఎన్జీవోలూ రైల్వే స్టేషన్లలో వలస కూలీలకు ఆహారాన్ని పంపిణీ చేశాయి. దాదాపు 3.5 లక్షల మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, విజయవాడ డివిజన్ మీదుగా ఈ నెల 2 నుంచి 25 వరకు 225 శ్రామిక్ రైళ్లు నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment