ప్రయాణికులకు బోగిభాగ్యం | American ARH couplers have been established as part of the railway update | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు బోగిభాగ్యం

Published Thu, May 23 2019 2:58 AM | Last Updated on Thu, May 23 2019 2:58 AM

American ARH couplers have been established as part of the railway update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేగంగా వెళ్లే రైలులో ఒక్క బోగీ పట్టాలు తప్పినా దాని వెనక ఉండే ఇతర బోగీలు పరస్పరం గుద్దుకుని ఒకదానిపై ఒకటి ఎక్కటం సహజం. ప్రతి రైలు ప్రమాదాల్లో ఈ తరహా దృశ్యాలే కనిపిస్తాయి. భారీ ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణం కూడా ఇలా బోగీలు ఒకదానిపైకి ఒకటి దూసుకుపోవటమే. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా రైల్వే శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకిఒకటి దూసుకుపోవటానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత పద్ధతి కప్లింగ్సే అనే విషయాన్నీ ఆ శాఖ గుర్తించింది. దీంతో వాటిని సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. గతంలోనే దీన్ని గుర్తించి కొత్త తరహా కప్లింగ్స్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అయితే వాటిల్లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవడంతో నిలిపివేసింది. తాజాగా అమెరికాలో వినియోగంలో ఉన్న కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ తరహా కప్లర్స్‌ ఏర్పాటు చేస్తే బోగీలు పరస్పరం ఢీకొనటం అనేది జరగదు. అలాగే ప్రయాణంలో కుదుపులు లేకుండా సౌకర్యంగా ఉండనుంది. రైల్వే ఆధునికీకరణలో భాగంగా రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. 

ఏఏఆర్‌ హెచ్‌ కప్లర్స్‌.. 
అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రైల్‌ రోడ్‌ ఫర్‌ హైస్పీడ్‌.. ఇదో విదేశీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా బోగీలను అనుసంధానించే కప్లింగ్‌ వ్యవస్థతో ఉత్పన్నమవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక పరికరాల్ని రూపొందించింది. ప్రస్తుతమున్న సీబీసీకి దీన్ని అనుసంధానించాలని మన రైల్వే నిర్ణయించింది. ఆ పరికరం ఏర్పాటుతో వేగంగా వెళ్తున్న రైలు బ్రేకు వేసినా, నెమ్మదిగా వెళ్లే రైలు ఒక్కసారిగా వేగాన్ని పెంచినా ఏర్పడే భారీ కుదుపులను ఇది నిరోధించనుంది.  ఈ పరికరం ఏర్పాటుతో రైళ్లలో కుదుపుల సమస్యకు విరుగుడు కలగనుంది. 

అవసరం ఏంటి..? 
ఇప్పటివరకు మన రైళ్లలో ఐఆర్‌ఎస్‌ స్క్రూ టైప్‌ సంప్రదాయ కప్లింగ్‌ వ్యవస్థే వాడకంలో ఉంది. ఇది తొలితరం కప్లర్‌. రెండు బోగీలను చివరలో కొండీలు ఉండే గొలుసు లాంటి దానితో బంధించి మధ్యలో భారీ స్క్రూను ఏర్పాటు చేస్తారు. ఇంజన్‌ మొదలు, బోగీల వరకు ఒకదానికొకటి అనుసంధానించే వ్యవస్థ ఇదే. బోగీలు పట్టాలు తప్పినప్పుడు ఈ లింక్‌ విడిపోయి బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి ఎక్కి భారీ ప్రాణనష్టానికి కారణమవుతోంది. దీంతో ఈ సంప్రదాయ కప్లర్స్‌ను తొలగించి వాటి స్థానంలో సెంటర్‌ బఫర్‌ కప్లర్స్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. కానీ కొన్ని బోగీలకే వాటిని ఏర్పాటు చేయగలిగారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికీ 3,378 కోచ్‌లకు సంప్రదాయ కప్లర్స్‌ ఉండగా, కేవలం 1,238 కోచ్‌లకు మాత్రమే సీబీసీ ఏర్పాటు చేశారు. ఇక వేగంగా మిగతా వాటికి కూడా సీబీసీలను ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా తయారయ్యే బోగీలన్నింటికీ వాటినే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ.. ఈ సీబీసీతో కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఇప్పుడు వాటిని అధిగమించేందుకే అమెరికా తరహా ఏఏఆర్‌ హెచ్‌ కప్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  

అవి మామూలు కుదుపులు కాదు..
హైదరాబాద్‌కు చెందిన నలుగురు మిత్రులు రైలులో ఢిల్లీ బయలుదేరారు. కాసేపటికి వారి బోగీలకు టీవాలా రావటంతో వీరు కొనుక్కుని తాగుతూ మాట ల్లో పడిపోయారు. ఇంతలో రైలు బ్రేకు వేయటంతో పెద్ద కుదుపు.. చేతిలోని టీ వారి మీద ఒలికిపోయింది. ఇక రాత్రి పడుకున్నాక ఇలాగే కుదుపులు ఏర్పడి సైడ్‌ బెర్త్‌పై పడుకున్న వారి తలలు రైలు గోడకు కొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతటి భారీ కుదుపులతో ప్రయాణికులు బెంబేలెత్తారు. అలాంటి కుదుపులతో రైలు పట్టాలు తప్పిందేమోనని భయపడి హడలి పోయారు.

సీబీసీ కప్లర్స్‌ ఏర్పా టు చేసిన రైల్లోనే ఈ కుదుపులు ఏర్పడుతున్నాయి. దీంతో రైల్వే శాఖ మంత్రి వరకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన ఆరా తీయగా, కుదుపులకు సీబీసీ కప్లింగ్‌ వ్యవస్థనే కారణమని తెలిసింది. పట్టాలు తప్పినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా చేసి ప్రాణనష్టాన్ని  తగ్గించేందుకు ఇవి ఉపయోగపడుతున్నా.. ఈ కుదుపులు మాత్రం భరించలేనివిగా ఉన్నాయి. దీం తో అధికారులు ఏఏఆర్‌ హెచ్‌ పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీబీసీ కప్లర్స్‌ ఉన్న అన్ని కోచ్‌లకు వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. వీటివల్ల కుదుపుల్లేని ప్రయాణమే కాకుండా, శబ్దం తక్కువగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కప్లింగ్‌ ఏర్పాటు చేసేప్పుడు తక్కువ సిబ్బంది అవసరం పడుతుందని, మార్చే క్రమంలో సిబ్బం ది ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement