భూపరిహారం చెల్లించలేదని రైలునే జప్తుచేశారు!
దావణగెరె(కర్ణాటక): ఏడేళ్లయినా రైల్వేశాఖ నష్టపరిహారం ఇవ్వకపోడంతో కోర్టు ఆదేశాలతో ఓ రైతు ఏకంగా రైలును జప్తుచేశాడు. దావణగెరె జిల్లా హరిహరలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. హరిహర-కొట్టూరు రైలుమార్గం కోసం హరిహర తాలూకా బొగ్గళ్లికి చెందిన రైతు, లాయర్ శివకుమార్ నుంచి రైల్వే 2009లో భూమి సేకరించింది.
ఇప్పటివరకూ రూ. 37 లక్షల పరిహారం ఇవ్వలేదు. దీంతో రైతు.. హరిహర కోర్టును ఆశ్రయించారు. కేసులో రైలును పూచీకత్తుగా పేర్కొనడంతో రైలును జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. శివకుమార్ సోమవారం కోర్టు సిబ్బందితో కలసి హరిహర స్టేషన్‌లో ధారవాడ-మైసూరు ఇంటర్‌సిటీ రైలును స్వాధీనం చేసుకున్నాడు.ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు పరిహారం ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతు, కోర్టు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.