చెన్నై: ప్రయాణీకులు తమ నిర్లక్ష్య వైఖరితో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. గత ఐదు నెలల్లో నిబంధనలు ఉల్లంఘించి పట్టాలు దాటుతూ 550 మంది మృత్యువాత పడడమే ఇందుకు నిదర్శనం. వీరిలో 20 శాతం మంది సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటడం, రైళ్లు ఎక్కడం, దిగడంతో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాల కారణంగా ఏడాది సరాసరిగా 27 వేల మందికి పైగా మృతిచెందుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో పేర్కొంది.
రైలు ప్రమాదాలలో మృతిచెందుతున్న వారి సంఖ్య కంటే నిబంధనలు ఉల్లంఘించి రైలు పట్టాలు దాటడం, రైళ్లు ఎక్కడం, దిగడం వంటి కారణాలతో ఏర్పడే మరణాలే అధికంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా భద్రతా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలలో రైలు గేట్లు, మార్గాలు దాటడం, సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ నడిచివెళ్లడం, విద్యుత్ రైళ్లలో జనరద్ధీలో జారిపడడం వంటి కారణాలతో ప్రాణనష్టం అధికమవుతోంది. దక్షిణ రైల్వే చెన్నై పోలీసు జోన్‌లో చెన్నై సెంట్రల్, ఎగ్మూరు, తాంబరం, చెంగల్పట్టు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ధర్మపురి, హోసూరు, ఈరోడ్, కోయంబత్తూరు, తిరుపూర్ సహా 23 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చెన్నై జోన్ ప్రాంతంలో గత జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలల్లో మాత్రం రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తూ 550 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై రైల్వే పోలీసు ఉన్నతాధికారులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెన్నై జోనల్ రైల్వే పోలీసు, రైల్వే భద్రతా దళం పోలీసులతో కలిసి రైలు పట్టాలపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రతి శుక్రవారం చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాకుండా అనేక రైల్వే స్టేషన్లలో అవగాహన ప్రచారాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రయాణీకులు నిబంధనలు ఉల్లంఘించి పట్టాలు దాటుతున్నట్లు తెలిపారు. దీని గురించి సెంట్రల్ రైలు పోలీసు ఇన్‌స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతూ మొత్తం రైలు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యలో 20 శాతం మంది సెల్‌ఫోన్లు ఉపయోగించే వారిగా తెలిసిందన్నారు. సెల్‌ఫోన్ కారణంగా మృతిచెందిన ప్రాంతాలకు తాము వెళ్లి చూడగా సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి వెళుతున్నారని, దీంతో మృతుని చిరునామా, గుర్తింపులో సమస్యలు ఏర్పడుతున్నట్లు తెలిపారు. అందుచేత ప్రయాణీకులు రైలులో ఎక్కేటపుడు, దిగేటపుడు సెల్‌ఫోన్లు ఉపయోగించకుంటే మంచిదన్నారు.
చెన్నైలో చాలా మంది ఎలా చనిపోతున్నారో తెలుసా..
Published Tue, Aug 1 2017 6:59 PM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
Advertisement
Advertisement