దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్న కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
గాజువాకకు చెందిన ఓ ప్రయాణికుడు బైపాస్‌లో వెళ్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి ప్రయాణించి అర్ధరాత్రి 2.30 గంటలకు దువ్వాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన నివసిస్తున్న గాజువాక వెళ్లడానికి ఆ సమయంలో ఒక్క బస్సూ లేదు. ఉన్న ఒక్క ఆటోవాలను అడిగితే రూ.500 డిమాండ్ చేశాడు. బేరమాడి చివరికి రూ.400 సమర్పించుకొని గాజువాక చేరుకున్నాడు...ఇది ఏ ఒక్క ప్రయాణికుడి ఇబ్బందో కాదు.. బైపాస్ రైళ్లతో విశాఖవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.విశాఖ రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం నిండిపోతుంది. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌కు రాకుండానే దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌పారాలు ఖాళీ లేవన్న కారణంతో రైళ్లను బైపాస్ మార్గంలో దువ్వాడ మీదుగా మళ్లించేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లను సైతం విశాఖను వెలివేశామన్నట్లు వ్యవహరిస్తూ దువ్వాడ మీదుగానే నడుపుతున్నారు. రైల్వే అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్‌కే కాదు.. దేశ రైల్వే వ్యవస్థకూ కీలకమైన స్టేషన్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందింది. కానీ.. ఆ గుర్తింపునకు మచ్చతెచ్చేలా వివిధ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైళ్ల రాకపోకల విషయంలో విశాఖకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రధాన నగరాలకు వెళ్తున్న కీలక ట్రైన్లన్నీ విశాఖ మొహం చూడకుండానే జారుకుంటున్నాయి. వాల్తేరు అధికారుల నిర్లక్ష్యం.. రెండు జోన్ల కక్షసాధింపు చర్యలతో విశాఖను వెలివేసినట్లుగా వ్యవహారం మారుతోంది.
ట్రాఫిక్ బూచీ.. రైళ్లు బైపాస్‌కి..
విశాఖ రైల్వే స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫారాలున్నాయి. ప్రతి ప్లాట్‌ఫామ్.. 24 బోగీలకంటే ఎక్కువ సామర్ధ్యమున్న ట్రైన్ అయినా హాల్ట్ చేసుకునేలా రూపొందించారు. విశాఖకు వచ్చే ప్రతి రైలూ తమ ప్రయాణ దిశను మార్చుకొని తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్టేషన్‌లో ట్రైన్లు ఎక్కువ సేపు ఆపుతుంటారు. దీంతో రాబోయే రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా విశాఖ వచ్చే రైళ్లని ఎక్కువగా ఔటర్‌లో నిలబెడతారు. ఇదే సాకుని చూపిస్తూ.. చాలా రైళ్లని విశాఖ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా.. ఏ ట్రైన్ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్ మీదుగా రైళ్లని పంపించేస్తున్నారు.
పదమూడేళ్లుగా వివక్షే...
2006లో తొలిసారిగా బైపాస్ మీదుగా రైళ్ల మళ్లింపు ప్రారంభించారు. రిలే రూట్ ఇంటర్ లాకింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ మళ్లింపులు చేశారు. అప్పట్లోనే 12 ట్రైన్లు బైపాస్ మీదుగా వెళ్లిపోయాయి. అయితే అప్పటి వాల్తేరు డీఆర్‌ఎం ఇంద్రకుమార్ ఘోష్ స్టేషన్ రద్దీ దృష్ట్యా జ్ఞానాపురం వైపు మరో 4 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసేందుకు నివేదిక సిద్ధం చేసి ఈస్ట్‌కోస్ట్ ఉన్నతాధికారులకు పంపించారు. ఆ నివేదికను తుంగలో తొక్కేశారు. దారి మళ్లింపు విషయంలో అప్పటి ఎంపీలు పోరాటం చేయడంతో మళ్లీ విశాఖ నుంచి 7 ట్రైన్లు రాకపోకలు ప్రారంభించాయి. 5 మాత్రం అలాగే ఉన్నాయి.
దసరా పేరుతో మరికొన్ని...
ఆది నుంచి 5 రైళ్లు దువ్వాడ బైపాస్ మీదుగా వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 5 రైళ్లను విశాఖ నుంచి పంపించేస్తున్నారు. దసరా సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించిన అధికారులు.. అందులో కొన్ని ట్రైన్లని విశాఖకు రానివ్వకుండా దువ్వాడ, కొత్తవలస మీదుగా దారి మళ్లించేశారు. పనిలో పనిగా నిత్యం విశాఖ మీదుగా వెళ్లే మరో 5 రెళ్లని కూడా బైపాస్ మీదుగా పంపించేస్తున్నారు.
పండగ సమయంలో ఇలా చేస్తే ఎలా..?
దసరా రద్దీ దృష్ట్యా రైళ్లను బైపాస్ మీదుగా పంపిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ పండగ సమయంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. వారందరికీ ఈ రైళ్లు ఏవీ ఉపయోగపడని పరిస్థితి దాపురించింది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. వాల్తేరు డివిజన్ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు.
రాత్రి పూట ఖాళీ ఉన్నా..పట్టించుకోవట్లేదు..
ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఐదు ట్రైన్లు అర్ధరాత్రి 12 గంటలు నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమంలో విశాఖ స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అసలిది బైపాస్ కాదు.. కానీ...
వాస్తవంగా దువ్వాడ బైపాస్‌ని ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్ బైపాస్ 4 కిమీ దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్ 7 కి.మీ, నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్ 7 కి.మీ, విజయవాడకు రాయనపాడు బైపాస్ 7 కి.మీ దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ.. విశాఖ నుంచి దువ్వాడ బైపాస్‌కు 17 కి.మీ, కొత్తవలస బైపాస్‌కు 20 కిమీ దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం.
కక్షపూరిత వ్యవహారంగా..?
విశాఖపట్నం రాకుండా ట్రైన్లని బైపాస్ మీదుగా పంపిచేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్థానిక ప్రయాణికులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రి, బోర్డు అధికారులకు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఇదంతా విశాఖపట్నం జోన్‌గా ఏర్పడుతుందన్న అక్కసుతో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆడుతున్న మోసపూరిత నాటకమని విమర్శిస్తున్నారు. విశాఖ స్టేషన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టేందుకు ఈ రైళ్లని రానివ్వకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పడితే ఆయా జోన్ల ఆదాయం తగ్గుముఖం పడుతుందనే కారణంతో ఈ విధమైన నిరంకుశ వ్యవహారాలకు తెరతీస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
బైపాస్‌తో ఇబ్బందులు పడుతున్నాం..
బైపాస్ రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి దువ్వాడ స్టేషన్‌లో దిగిన తర్వాత ఇంటికి చేరుకోవాలంటే ఉదయం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఆటోలో వెళ్దామంటే ఆస్తులడుగుతున్నారు. బైపాస్ మార్గమంటూ ప్రయాణికుల్ని అర్ధరాత్రి అడవిపాలు చేస్తున్నారు ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. విశాఖ మీదుగా ప్రతి రైలూ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
– ఎస్.అజిత్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం
విశాఖ అంటే ఎందుకంత చులకన
విశాఖ అంటే రైల్వే అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జోన్ అక్కసుతో చాలా రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా చేస్తున్నారు. ఫలి తంగా.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జోన్ వచ్చేంత వరకూ విశాఖకు ఈ కష్టాలు తప్పవేమోననే ఆందోళన అందరిలోనూ కలుగుతోంది.
– అనిల్‌కుమార్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఎంవీపీకాలనీ
ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తా..
బైపాస్ మార్గంలో ప్రధాన రైళ్లని నడపుతుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా వేసిన రైళ్లు కూడా బైపాస్‌లోనే వేయడంతో విశా>ఖ ప్రజలు ఆ ట్రైన్ల సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాను.
– ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment