Duvvada
-
దువ్వాడ పీఎస్‌లో ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం!
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ఇవాళ దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని పీఎస్‌కు తరలించారు. స్టేట్మెంట్ రికార్డు పేరుతో ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.రవికిరణ్‌ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని ఆయన భార్య మీడియా ఎదుట వాపోయారు. ‘‘పదే పదే పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు’’ అని అన్నారామె.దువ్వాడ పోలీసులు రవికిరణ్, ఆయన భార్యతో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీలు చేయాలని చెబుతూ.. ఆమె కారు తాళాలు లాక్కున్నారు. తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఇద్దరినీ భోజనం కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. తన భర్తకు కనీసం మాత్రలు ఇవ్వాలని ఆమె కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇబ్బంది పెడతానంటూ సీఐ మల్లేశ్వరరావు బహిరంగంగానే ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేయించారు. అంతేకాదు.. విచారణ పేరుతో పిలిపించుకుని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. -
పెరిగిన సామర్థ్యం.. విజయవాడ–విశాఖపట్నం మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు
సాక్షి, అమరావతి: విజయవాడ–విశాఖపట్నం మధ్య ఇక గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి విశాఖపట్నం శివారులోని దువ్వాడ వరకు రైల్వేట్రాక్‌ను ఆధునికీకరించి సామర్థ్యాన్ని పెంచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణి విభాగాల పరిధిలో ట్రాక్ సామర్థ్యాన్ని 130 కిలోమీటర్ల వేగానికి పెంచే ప్రక్రియ పూర్తయింది. స్వర్ణ వికర్ణి విభాగం పరిధిలోని బల్హార్ష–కాజీపేట–గూడూరు మధ్య రైల్వేట్రాక్ సామర్థ్యాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో పెంచారు. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి పరిధిలోని విజయవాడ–దువ్వాడ ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. దీన్లో భాగంగా తగినంత బరువైన పట్టాలు వేయడంతోపాటు 260 మీటర్ల పొడవుగల వెల్టెడ్ రైలు ప్యానళ్లు ఏర్పాటు చేశారు. ట్రాక్ మార్గంలో వంపులు, ఎత్తుపల్లాలను సరిచేశారు. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్షన్ పంపిణీ పరికరాలను మెరుగుపరిచారు. గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రైళ్ల లోకోమోటివ్, కోచ్‌లను అందుబాటులోకి తెచ్చారు. చదవండి: Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా.. -
Duvvada Railway Station: శశికళ.. గుండె విలవిల
సాక్షి, తూర్పుగోదావరి: లేకలేక కలిగిన సంతానం ఆ అమ్మాయి. అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. విధి చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయి ప్రాణాలను హరించింది. అనకాపల్లి జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం గుంటూరు – రాయగడ∙ఎక్స్‌ప్రెస్ దిగుతూ జారి పడి, ప్లాట్‌ఫాం – రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయి.. గంటన్నర పాటు అంతులేని బాధ పడిన మెరపల శశికళ (22) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. శరీరం నలిగిపోయి అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె మృతి సమాచారం తెలియడంతో అన్నవరం వెలంపేటలో విషాద ఛాయలు అలముకొ న్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి కుమార్తె శశికళ చిన్నప్పటి నుంచీ చదువులో దిట్ట. బొమ్మలేయడంలో కూడా మంచి ప్రతిభ ప్రదర్శించేది. తుని ఆదిత్యలో బీసీఏ చదివింది. గత నెలలో దువ్వాడ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంసీఏ కోర్సులో చేరింది. రోజూ అన్నవరం నుంచి దువ్వాడ వరకూ రైలులో వెళ్లి వచ్చేది. ఇలా తిరగడం ఇబ్బందిగా ఉందని, హాస్టల్లో ఉంటానని ఇంట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం బయలుదేరి వెళ్లిన శశికళ దువ్వాడలో ట్రైన్ నుంచి జారి పడిపోయింది. కిందకు దిగే ప్రయత్నంలో రైలు కుదుపునకు బోగీ తలుపు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో శశికళ అదుపు తప్పి పడిపోయిందని సమాచారం. ఆమె మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బంధువులు విశాఖ బయలుదేరారు. తల్లితండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం శశికళ మృతదేహాన్ని గురువారం రాత్రి అన్నవరం తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి, పుట్టెడు దుఃఖంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున విలపించారు. శశికళ మృతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి) -
దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. దువ్వాడ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన మెరపల శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లడానికి బుధవారం ఉదయం ఆమె గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. దువ్వాడ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోవడంతో ఆమె దిగే ప్రయత్నంలో కాలుజారి ప్లాట్‌ఫామ్, రైలు బోగీ మధ్యలో ఇరుక్కుపోయింది. రైలు నిలిపేసి ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయచినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆపరేటింగ్ సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల రెక్టార్ వి.మధుసూదనరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.మధుసూదనరావు అక్కడికి చేరుకుని గంటన్నరపాటు శ్రమించి ప్లాట్‌ఫామ్‌ను తవ్వించి ఆమెను బయటకు తీశారు. అంబులెన్స్‌లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిన్నటి నుంచి ఐసీయూలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న శశికళ ఇవాళ తుదిశ్వాస విడిచింది. చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు) -
దువ్వాడ: రైలు-పుట్‌పాత్ మధ్య ఇరుక్కున్న విద్యార్థి.. నొప్పి భరించలేక..
సాక్షి, విశాఖపట్నం: రైలు ఎక్కుతున్నప్పుడు లేదా దిగి క్రమంలో జాగ్రత్తలు వహించాలని రైల్వే అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ, వారి హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు అజాగ్రత్తతో ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వీడియోలు ఇప్పటికి చాలానే చూశాము. తాజాగా ఇలాంటి ఘటనే గాజువాకలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. గుంటూరు-రాయగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడకు వచ్చింది. ఈ సందర్భంగా ప్లాట్‌ఫామ్ మీద నుంచి రైలు ఎక్కుతున్న క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థిని శశికళ కిందపడిపోయింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్, రైలులో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో, బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. కాగా, విద్యార్ధిని రైలు మధ్యలో పడిపోవడంతో ఆమెను బయటకు తీసెందుకు రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. -
దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలు క్రింద ఇరుక్కుపోయిన ఇంజినీరింగ్ విద్యార్థిని
-
దువ్వాడలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ పొలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల దందా గుట్టురట్టయ్యింది. వివరాల్లోకెళ్తే.. కూర్మన్నపాలేం ప్రాంతంలో పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలుచేసి, తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ హడావిడి చేసారు. షాపులో నిషేదిత గుట్కాలను పట్టుకుని కేసు నమోదు చేస్తాం. మీకు అపరాద రుసుంతో పాటు ఆరునెలలు జైలు శిక్ష కూడా పడుతుందని భయపెట్టారు. దీంతో వ్యాపారస్ధులు భయబ్రాంతులకు గురయ్యారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు, అసిస్టెంట్, కారు డ్త్రెవర్, వాళ్ళు వచ్చిన కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉండడంతో వ్యాపారస్తులు భయపడ్డారు. (మహిళ కానిస్టేబుల్ మృతి, పలు అనుమానాలు) వరుసగా షాపులు తనిఖీలు చెయ్యడం.. కేసులు పెడతామని భయపెట్టి అందినంత దోచేయడంతో వ్యాపారస్తులకు అనుమానం వచ్చి వారిని నిలదీయడంతో ఆసలు విషయం భయటపడింది. దీంతో అక్కడ నుంచి పారిపోవాలని చూడగా అందరూ చుట్టు ముట్టి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దువ్వాడ పోలీసుల విచారణలో సదరు వ్యక్తులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ఫుడ్ ఇన్స్పెక్టరుగా వజ్జల శ్రీనివాసురావు, అతని అసిస్టెంట్‌గా సురేష్ లాల్, కారు డ్ర్తెవర్ను జీవన్ కుమార్లగా గుర్తించారు. నిందితులు గతంలో నగరంలోని పలు ప్రాంతాలలో వసూళ్ళకు పాల్పడ్డారు. అదే విధంగా విజయవాడ, రాజమండ్రి, భవానిపురం తదితర ప్రాంతాలలో వ్యాపారస్తులను బెదిరించి దందాలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైపాసే బలితీసుకుందా..?
సాక్షి, విశాఖపట్నం: చాన్నాళ్ల తర్వాత ఊరొస్తున్నామన్న ఆ దంపతుల ఆనందాన్ని ఆ రైలు హరించేసింది.. స్టేషన్ మిస్ అయితే.. బైపాస్ రైలు విశాఖ వెళ్లదనే ఆందోళన వారిని అక్కడే దిగేలా తొందరపెట్టింది.. ఇంకేముంది.. ఆ తొందరలో ప్రాణాలు అమాంతం గాలిలో కలిసిపోయాయి. ఈ దారుణ సంఘటనకు బాధ్యులెవరు..? తొందరపడిన ఆ దంపతులదా..? విశాఖపట్నంపై మీద అక్కసుతో బైపాస్ మీదుగా రైళ్లు మళ్లిస్తున్న ఈస్ట్‌కోస్ట్ అధికారులదా..? వాస్తవానికి బైపాస్ రైళ్లతో ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. విశాఖపట్నం రావాల్సి వారు కచ్చితంగా దువ్వాడలో దిగాల్సిందే. అక్కడి నుంచి మిగిలిన చోట్లకు ఏ సమయంలోనైనా రవాణా సౌకర్యాలున్నాయా అంటే అదీ శూన్యమే. ఈ నేపథ్యంలో ఇలా బైపాస్ రైళ్లు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటున్నారు ప్రయాణికులు. శనివారం అర్ధరాత్రి 01.03 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్–02784) దువ్వాడ స్టేషన్‌కు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. రెండు నిమిషాలు మాత్రమే ఇక్కడ రైలు ఆగుతుంది. బైపాస్ రైలు కాబట్టి ఆ తర్వాత విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా ఈ ట్రైన్ వెళ్లిపోతుంది. దీంతో మళ్లీ కొత్తవలసలో దిగాల్సి వస్తుందనీ, అక్కడి నుంచి తిరిగి దువ్వాడ వచ్చేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడతామనే ఆందోళనతో ట్రైన్ కదిలిపోతుండగా దిగేందుకు ప్రయత్నించారు కె.వి.రమణారావు, నాగమణి దంపతులు. పట్టు తప్పి రైలు కింద పడి మృత్యువాత పడ్డారు. విశాఖలో ఆగే రైలు అయితే..? ఈ రైలు బైపాస్ మార్గంలో వెళ్లిపోతుంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు రాదు. అదే బైపాస్‌లో కాకుండా విశాఖ వచ్చేలా రైలు నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా..? అని ఆత్మావలోకనం చేసుకుంటే కచ్చితంగా జరగదనే వాదనలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. విశాఖ స్టేషన్‌కు వస్తుందన్న ధైర్యం ఆ దంపతులకు ఉంటుంది. దువ్వాడలో రైలు దిగకపోయినా.. ఇక్కడికి వచ్చి ప్రధాన స్టేషన్ నుంచి ఆటో లేదా, క్యాబ్ బుక్ చేసుకొని తిరిగి దువ్వాడ వెళ్లిపోవచ్చు. అదే కొత్తవలసలో దిగాల్సి వస్తే నరకయాతన అనుభవించాల్సిందే. ఇప్పుడు ఆ దంపతుల ప్రమాదానికి ముమ్మాటికీ బైపాసే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకింత వివక్ష..? విశాఖ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటోంది. వివిధ ప్రాంతాల నుంచి ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం కిక్కిరిసి పోతుంటుంది. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 19 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌ను వెలివేసినట్లుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌ఫారాలు ఖాళీ లేవంటూ రైళ్లను బైపాస్ మార్గంలో దువ్వాడ మీదుగా పంపించేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా.. ఏ ట్రైన్ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్ మీదుగానే రైళ్లను పంపించేస్తున్నారు. ఇప్పటికైనా బైపాస్ వద్దు.. ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఆరు ట్రైన్లు అర్ధరాత్రి 12 నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమయంలో విశాఖ స్టేషన్లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా దువ్వాడ బైపాస్‌ను ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ. లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్ బైపాస్ 4 కి.మీ. దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్ 7 కి.మీ., నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్ 7 కి.మీ., విజయవాడకు రాయనపాడు బైపాస్ 7 కి.మీ. దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ విశాఖ నుంచి దువ్వాడ బైపాస్కు 17 కి.మీ., కొత్తవలస బైపాస్కు 20 కి.మీ. దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోనైనా రైల్వే అధికారులు బైపాస్ పదాన్ని ఉపసంహరించి.. అన్ని రైళ్లూ విశాఖ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
రైలు దిగే తొందరలో ప్రమాదానికి గురైన దంపతులు
సాక్షి, విశాఖపట్నం: రైలు దిగుతుండగా ప్రమాదానికి గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వేస్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకట రమణారావు, మణి దంపతులు కార్తీకపౌర్ణమి పురస్కరించుకుని విశాఖకు బయలుదేరారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి దంపతులు ప్రత్యేక రైలులో గత అర్ధరాత్రి దువ్వాడకు చేరుకున్నారు. అయితే రైలు దువ్వాడకు చేరుకున్న విషయాన్ని వెంకట రమణారావు దంపతులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో రైలు దిగే తొందరలో ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయారు. వీరిపై నుంచి రైలు వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దంపతులు విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. -
విశాఖను వెలివేశారా!
గాజువాకకు చెందిన ఓ ప్రయాణికుడు బైపాస్‌లో వెళ్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి ప్రయాణించి అర్ధరాత్రి 2.30 గంటలకు దువ్వాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన నివసిస్తున్న గాజువాక వెళ్లడానికి ఆ సమయంలో ఒక్క బస్సూ లేదు. ఉన్న ఒక్క ఆటోవాలను అడిగితే రూ.500 డిమాండ్ చేశాడు. బేరమాడి చివరికి రూ.400 సమర్పించుకొని గాజువాక చేరుకున్నాడు...ఇది ఏ ఒక్క ప్రయాణికుడి ఇబ్బందో కాదు.. బైపాస్ రైళ్లతో విశాఖవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.విశాఖ రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం నిండిపోతుంది. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌కు రాకుండానే దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌పారాలు ఖాళీ లేవన్న కారణంతో రైళ్లను బైపాస్ మార్గంలో దువ్వాడ మీదుగా మళ్లించేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లను సైతం విశాఖను వెలివేశామన్నట్లు వ్యవహరిస్తూ దువ్వాడ మీదుగానే నడుపుతున్నారు. రైల్వే అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్‌కే కాదు.. దేశ రైల్వే వ్యవస్థకూ కీలకమైన స్టేషన్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందింది. కానీ.. ఆ గుర్తింపునకు మచ్చతెచ్చేలా వివిధ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైళ్ల రాకపోకల విషయంలో విశాఖకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రధాన నగరాలకు వెళ్తున్న కీలక ట్రైన్లన్నీ విశాఖ మొహం చూడకుండానే జారుకుంటున్నాయి. వాల్తేరు అధికారుల నిర్లక్ష్యం.. రెండు జోన్ల కక్షసాధింపు చర్యలతో విశాఖను వెలివేసినట్లుగా వ్యవహారం మారుతోంది. ట్రాఫిక్ బూచీ.. రైళ్లు బైపాస్‌కి.. విశాఖ రైల్వే స్టేషన్లో 8 ప్లాట్‌ఫారాలున్నాయి. ప్రతి ప్లాట్‌ఫామ్.. 24 బోగీలకంటే ఎక్కువ సామర్ధ్యమున్న ట్రైన్ అయినా హాల్ట్ చేసుకునేలా రూపొందించారు. విశాఖకు వచ్చే ప్రతి రైలూ తమ ప్రయాణ దిశను మార్చుకొని తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్టేషన్లో ట్రైన్లు ఎక్కువ సేపు ఆపుతుంటారు. దీంతో రాబోయే రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా విశాఖ వచ్చే రైళ్లని ఎక్కువగా ఔటర్లో నిలబెడతారు. ఇదే సాకుని చూపిస్తూ.. చాలా రైళ్లని విశాఖ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా.. ఏ ట్రైన్ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్ మీదుగా రైళ్లని పంపించేస్తున్నారు. పదమూడేళ్లుగా వివక్షే... 2006లో తొలిసారిగా బైపాస్ మీదుగా రైళ్ల మళ్లింపు ప్రారంభించారు. రిలే రూట్ ఇంటర్ లాకింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ మళ్లింపులు చేశారు. అప్పట్లోనే 12 ట్రైన్లు బైపాస్ మీదుగా వెళ్లిపోయాయి. అయితే అప్పటి వాల్తేరు డీఆర్ఎం ఇంద్రకుమార్ ఘోష్ స్టేషన్ రద్దీ దృష్ట్యా జ్ఞానాపురం వైపు మరో 4 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసేందుకు నివేదిక సిద్ధం చేసి ఈస్ట్‌కోస్ట్ ఉన్నతాధికారులకు పంపించారు. ఆ నివేదికను తుంగలో తొక్కేశారు. దారి మళ్లింపు విషయంలో అప్పటి ఎంపీలు పోరాటం చేయడంతో మళ్లీ విశాఖ నుంచి 7 ట్రైన్లు రాకపోకలు ప్రారంభించాయి. 5 మాత్రం అలాగే ఉన్నాయి. దసరా పేరుతో మరికొన్ని... ఆది నుంచి 5 రైళ్లు దువ్వాడ బైపాస్ మీదుగా వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 5 రైళ్లను విశాఖ నుంచి పంపించేస్తున్నారు. దసరా సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించిన అధికారులు.. అందులో కొన్ని ట్రైన్లని విశాఖకు రానివ్వకుండా దువ్వాడ, కొత్తవలస మీదుగా దారి మళ్లించేశారు. పనిలో పనిగా నిత్యం విశాఖ మీదుగా వెళ్లే మరో 5 రెళ్లని కూడా బైపాస్ మీదుగా పంపించేస్తున్నారు. పండగ సమయంలో ఇలా చేస్తే ఎలా..? దసరా రద్దీ దృష్ట్యా రైళ్లను బైపాస్ మీదుగా పంపిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ పండగ సమయంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. వారందరికీ ఈ రైళ్లు ఏవీ ఉపయోగపడని పరిస్థితి దాపురించింది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. వాల్తేరు డివిజన్ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. రాత్రి పూట ఖాళీ ఉన్నా..పట్టించుకోవట్లేదు.. ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఐదు ట్రైన్లు అర్ధరాత్రి 12 గంటలు నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమంలో విశాఖ స్టేషన్లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలిది బైపాస్ కాదు.. కానీ... వాస్తవంగా దువ్వాడ బైపాస్ని ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్ బైపాస్ 4 కిమీ దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్ 7 కి.మీ, నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్ 7 కి.మీ, విజయవాడకు రాయనపాడు బైపాస్ 7 కి.మీ దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ.. విశాఖ నుంచి దువ్వాడ బైపాస్కు 17 కి.మీ, కొత్తవలస బైపాస్కు 20 కిమీ దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. కక్షపూరిత వ్యవహారంగా..? విశాఖపట్నం రాకుండా ట్రైన్లని బైపాస్ మీదుగా పంపిచేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్థానిక ప్రయాణికులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రి, బోర్డు అధికారులకు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఇదంతా విశాఖపట్నం జోన్‌గా ఏర్పడుతుందన్న అక్కసుతో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆడుతున్న మోసపూరిత నాటకమని విమర్శిస్తున్నారు. విశాఖ స్టేషన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టేందుకు ఈ రైళ్లని రానివ్వకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పడితే ఆయా జోన్ల ఆదాయం తగ్గుముఖం పడుతుందనే కారణంతో ఈ విధమైన నిరంకుశ వ్యవహారాలకు తెరతీస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బైపాస్‌తో ఇబ్బందులు పడుతున్నాం.. బైపాస్ రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి దువ్వాడ స్టేషన్లో దిగిన తర్వాత ఇంటికి చేరుకోవాలంటే ఉదయం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఆటోలో వెళ్దామంటే ఆస్తులడుగుతున్నారు. బైపాస్ మార్గమంటూ ప్రయాణికుల్ని అర్ధరాత్రి అడవిపాలు చేస్తున్నారు ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. విశాఖ మీదుగా ప్రతి రైలూ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – ఎస్.అజిత్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం విశాఖ అంటే ఎందుకంత చులకన విశాఖ అంటే రైల్వే అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జోన్ అక్కసుతో చాలా రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా చేస్తున్నారు. ఫలి తంగా.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జోన్ వచ్చేంత వరకూ విశాఖకు ఈ కష్టాలు తప్పవేమోననే ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. – అనిల్‌కుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎంవీపీకాలనీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తా.. బైపాస్ మార్గంలో ప్రధాన రైళ్లని నడపుతుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా వేసిన రైళ్లు కూడా బైపాస్‌లోనే వేయడంతో విశా>ఖ ప్రజలు ఆ ట్రైన్ల సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ -
దువ్వాడ మీదుగా ప్రత్యేకరైళ్లు
తాటిచెట్లపాలెం: పుదుచ్చేరి వయా దువ్వాడ మీదుగా సంత్రగచ్చికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈ.కో. రైల్వే వాల్తేరు డివిజన్ తెలిపింది. రైళ్లవివరాలివే.. పుదుచ్చేరి– సంత్రగచ్చి– పుదుచ్చేరి వీక్లీ స్పెషల్ రైలు (06010/06009): పుదుచ్చేరి నుంచి సంత్రగచ్చి వెళ్లే 06010 నెంబరు గల రైలు ఆగస్టు 6,27 సెప్టెంబర్ 3,10 అక్టోబర్ 8,15,22,29 నవంబర్ 5,12 తేదీల్లో సాయంత్రం 07.15 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు 01.43 గంటలకు దువ్వాడ చేరుకుని, సోమవారాల్లో తెల్లవారుజామున 04.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 06009 నెంబరుతో సంత్రగచ్చి నుంచి ఆగస్టు 8,29 సెప్టెంబర్ 5,12 అక్టోబర్ 10,17,24,31 నవంబర్ 7,14 తేదీల్లో మధ్యాహ్నం 02.10 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు తెల్లవారు జామున 03.55 గంటలకు దువ్వాడ చేరుకుని అదే రోజు సాయంత్రం 08.20 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. ఓ సెకండ్ ఎ.సి, మరో థర్డ్ ఎ.సి, ఏడు స్లీపర్‌క్లాస్‌లు, 6 జనరల్ సెకంyŠ lక్లాస్, రెండు సెకండ్ క్లాస్ కం లగేజ్ కోచ్‌ల కంపోజిషన్ ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్గారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. -
గుట్కా స్వాధీనం
సీతమ్మధార: దువ్వాడ పోలీస్‌సేష్టన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు రూ.2లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు ను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిఆలోని యాదవ జగ్గారావు పేట వద్ద ఇద్దరు వ్యక్తులు గుట్కాప్యాకెట్లు ఆటోలో తరలిస్తున్నరని స్థానికుల సమాచారంతో ఆదివారం టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆటోతో పాటు సుమారు రెండులక్షల రూపాయలు విలువ గల గుట్కాప్యాకెట్లు స్వాధీనపరుచుకుని దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు గణేష్, సతీష్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
బోగీలను వదిలేసిన 'జన్మభూమి'
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడ సమీపంలో రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించి ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు. ఇంజిన్‌ను వెంటనే బోగీల వద్దకు మరలించి.... రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఇంజిన్ బోగీల మధ్య ఉన్న లింక్‌లను రైల్వే సిబ్బంది సరి చేశారు. దాంతో కొద్ది ఆలస్యంగా జన్మభూమి రైలు ముందుకు కదిలింది. రైలు బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు.