సాక్షి, విశాఖపట్నం: రైలు దిగుతుండగా ప్రమాదానికి గురై భార్యాభర్తలు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకట రమణారావు, మణి దంపతులు కార్తీకపౌర్ణమి పురస్కరించుకుని విశాఖకు బయలుదేరారు. ఈ మేరకు సికింద్రాబాద్ నుంచి దంపతులు ప్రత్యేక రైలులో గత అర్ధరాత్రి దువ్వాడకు చేరుకున్నారు. అయితే రైలు దువ్వాడకు చేరుకున్న విషయాన్ని వెంకట రమణారావు దంపతులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో రైలు దిగే తొందరలో ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయారు. వీరిపై నుంచి రైలు వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దంపతులు విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment