విశాఖపట్నం, సాక్షి: అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో బాలికను చిత్రవధ చేసి చంపి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది కత్తి దూశాడు. అయితే ఈ ఘటనలోనూ పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్ధూ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కాలేజ్ వద్ద ఆ యువతితో సిద్ధూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్ కావడంతో గాజువాక పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్ట్ చేశాడు.
అయితే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. టపాసులు పేల్చి హ్యాపీ బర్త్‌డే అంటూ నానా హంగామా చేశాడు. ఆపై ఇంట్లోకి దూరి ఫర్నీచర్‌ను పగలకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అయితే అది గమనించి ఆమె పారిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లి సావిత్రి అడ్డురావడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీకూతుళ్లు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో సిద్ధూ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సిద్ధూ కోసం గాలిస్తున్నారు.
పోలీసుల తీరుపై విమర్శలు..
దాడి తరువాత పరారీ అయిన సిద్ధూ ఆచూకీని 24 గంటలు గడిచినా కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే.. ఈ ఫోటో లో వ్యక్తి కనిపిస్తే, సమాచారం ఇవ్వండి అంటూ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. అటు అనకాపల్లి ఘటనలోనూ.. ఇటు ఇప్పుడు పోలీసులు నిందితుల విషయంలో ఇలా ఆలస్యంగా స్పందించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment