
సాక్షి,ఆనందపురం(భీమిలి): బంధువుల ఇంట శుభాకార్యానికి వెళ్తున్న భార్యాభర్తలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. స్కూటీపై వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. బోయిపాలెం జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగరంలోని వెలంపేటకు సమీపంలోని పెరికివీధికి చెందిన రావి సూర్యారావు(50) స్క్రాప్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య సత్యవతి, కుమార్తెలు రాధిక, యమున, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. కుమార్తెలకు వివాహం కాగా శ్రీనివాస్ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని రావాడలో బంధువుల ఇంట శుభకార్యానికి ఆహ్వానం రాగా.. మంగళవారం ఉదయం సూర్యారావు, సత్యవతి దంపతులు స్కూటీపై బయలుదేరారు. బోయిపాలెం జంక్షన్ వద్దకు రాగానే.. వెనుక నుంచి వస్తున్న లారీ స్కూటీని బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో భార్యాభర్తలు రోడ్డుపై పడిపోగా.. వారి పై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో వారి శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ వై.రవి సిబ్బంది అక్కడకు చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను ఒక దగ్గరకు చేర్చారు. ఆ భాగాలను వ్యాన్‌లో వేసి పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment