ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): ప్రియుడి చేతిలో మోసపోయిన కోల్‌కతాకు చెందిన ఓ వివాహిత ఎంవీపీ పోలీసుల సంరక్షణలో ఉంది. పోలీసులు అడిగిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో.. ఆమెను కేజీహెచ్‌లోని ‘సఖి వన్‌స్టాప్’ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. కోల్‌కతాకు చెందిన వివాహిత నీలిమా ఖతూన్ ఎంవీపీకాలనీ డబుల్ రోడ్డులో ఏడుస్తూ అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు. వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకుడు ఉమ్మిడి కల్యాణ్‌కు వారు సమాచారం ఇచ్చారు. ఆయన.. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఏ వివరాలు చెప్పలేకపోవడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. అనంతరం ఆ యువతి పోలీసుల విచారణలో తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. ‘నాది కోల్‌కతా. గతంలో భర్త, తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశాను.
ఆ సమయంలో పరశురాం అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆయన నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. నన్ను కోల్‌కతా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పరశురాంతో ఫోన్‌లో మాట్లాడేదాన్ని. ఈ క్రమంలో పరశురాం వారం రోజుల కిందట నన్ను విశాఖ తీసుకొచ్చాడు. పిల్లలను చూడాలని అతనికి చెప్పగా.. అతనితో గొడవ జరిగింది. రెండు రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పరశురాం ఎంవీపీ డబుల్‌రోడ్డులో నన్ను వదిలేసి వెళ్లిపోయాడు’ అని పోలీసులు విచారణలో నీలిమా తెలిపింది.
తన తల్లిదండ్రుల చిరునామా, పరశురాం ఏం చేస్తుంటాడు, ఎక్కడుంటాడు.. అనే వివరాలను ఆమె వెల్లడించలేకపోతోంది. దీంతో ఎంవీపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం కేజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఆమె చిరునామా తెలిసిన అనంతరం భర్త, తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. వారి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపడతామని ఎంవీపీ సీఐ రమణయ్య వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment