
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. దువ్వాడ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన మెరపల శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లడానికి బుధవారం ఉదయం ఆమె గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. దువ్వాడ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోవడంతో ఆమె దిగే ప్రయత్నంలో కాలుజారి ప్లాట్‌ఫామ్, రైలు బోగీ మధ్యలో ఇరుక్కుపోయింది.
రైలు నిలిపేసి ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయచినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, ఆపరేటింగ్ సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల రెక్టార్ వి.మధుసూదనరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.మధుసూదనరావు అక్కడికి చేరుకుని గంటన్నరపాటు శ్రమించి ప్లాట్‌ఫామ్‌ను తవ్వించి ఆమెను బయటకు తీశారు. అంబులెన్స్‌లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిన్నటి నుంచి ఐసీయూలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న శశికళ ఇవాళ తుదిశ్వాస విడిచింది.
చదవండి: (కట్టుకథలు..విషపురాతలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనాలు)