సాక్షి, అమరావతి: విజయవాడ–విశాఖపట్నం మధ్య ఇక గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ నుంచి విశాఖపట్నం శివారులోని దువ్వాడ వరకు రైల్వేట్రాక్‌ను ఆధునికీకరించి సామర్థ్యాన్ని పెంచింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణి విభాగాల పరిధిలో ట్రాక్ సామర్థ్యాన్ని 130 కిలోమీటర్ల వేగానికి పెంచే ప్రక్రియ పూర్తయింది.
స్వర్ణ వికర్ణి విభాగం పరిధిలోని బల్హార్ష–కాజీపేట–గూడూరు మధ్య రైల్వేట్రాక్ సామర్థ్యాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో పెంచారు. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి పరిధిలోని విజయవాడ–దువ్వాడ ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. దీన్లో భాగంగా తగినంత బరువైన పట్టాలు వేయడంతోపాటు 260 మీటర్ల పొడవుగల వెల్టెడ్ రైలు ప్యానళ్లు ఏర్పాటు చేశారు. ట్రాక్ మార్గంలో వంపులు, ఎత్తుపల్లాలను సరిచేశారు.
ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్షన్ పంపిణీ పరికరాలను మెరుగుపరిచారు. గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రైళ్ల లోకోమోటివ్, కోచ్‌లను అందుబాటులోకి తెచ్చారు.
చదవండి: Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment