బైపాసే బలితీసుకుందా..? | Officials Negligence on Duvvada Train Accident Incident | Sakshi
Sakshi News home page

బైపాసే బలితీసుకుందా..?

Published Mon, Nov 11 2019 12:12 PM | Last Updated on Mon, Nov 11 2019 12:12 PM

Officials Negligence on Duvvada Train Accident Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చాన్నాళ్ల తర్వాత ఊరొస్తున్నామన్న ఆ దంపతుల ఆనందాన్ని ఆ రైలు హరించేసింది.. స్టేషన్‌ మిస్‌ అయితే.. బైపాస్‌ రైలు విశాఖ వెళ్లదనే ఆందోళన వారిని అక్కడే దిగేలా తొందరపెట్టింది.. ఇంకేముంది.. ఆ తొందరలో ప్రాణాలు అమాంతం గాలిలో కలిసిపోయాయి.

ఈ దారుణ సంఘటనకు బాధ్యులెవరు..? తొందరపడిన ఆ దంపతులదా..? విశాఖపట్నంపై మీద అక్కసుతో బైపాస్‌ మీదుగా రైళ్లు మళ్లిస్తున్న ఈస్ట్‌కోస్ట్‌ అధికారులదా..?
వాస్తవానికి బైపాస్‌ రైళ్లతో ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. విశాఖపట్నం రావాల్సి వారు కచ్చితంగా దువ్వాడలో దిగాల్సిందే. అక్కడి నుంచి మిగిలిన చోట్లకు ఏ సమయంలోనైనా రవాణా సౌకర్యాలున్నాయా అంటే అదీ శూన్యమే. ఈ నేపథ్యంలో ఇలా బైపాస్‌ రైళ్లు వేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటున్నారు ప్రయాణికులు.

శనివారం అర్ధరాత్రి 01.03 గంటల సమయంలో సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నంబర్‌–02784) దువ్వాడ స్టేషన్‌కు రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. రెండు నిమిషాలు మాత్రమే ఇక్కడ రైలు ఆగుతుంది. బైపాస్‌ రైలు కాబట్టి ఆ తర్వాత విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా ఈ ట్రైన్‌ వెళ్లిపోతుంది. దీంతో మళ్లీ కొత్తవలసలో దిగాల్సి వస్తుందనీ, అక్కడి నుంచి తిరిగి దువ్వాడ వచ్చేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడతామనే ఆందోళనతో ట్రైన్‌ కదిలిపోతుండగా దిగేందుకు ప్రయత్నించారు కె.వి.రమణారావు, నాగమణి దంపతులు. పట్టు తప్పి రైలు కింద పడి మృత్యువాత పడ్డారు.

విశాఖలో ఆగే రైలు అయితే..?
ఈ రైలు బైపాస్‌ మార్గంలో వెళ్లిపోతుంది. విశాఖ రైల్వే స్టేషన్‌కు రాదు. అదే బైపాస్‌లో కాకుండా విశాఖ వచ్చేలా రైలు నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా..? అని ఆత్మావలోకనం చేసుకుంటే కచ్చితంగా జరగదనే వాదనలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. విశాఖ స్టేషన్‌కు వస్తుందన్న ధైర్యం ఆ దంపతులకు ఉంటుంది. దువ్వాడలో రైలు దిగకపోయినా.. ఇక్కడికి వచ్చి ప్రధాన స్టేషన్‌ నుంచి ఆటో లేదా, క్యాబ్‌ బుక్‌ చేసుకొని తిరిగి దువ్వాడ వెళ్లిపోవచ్చు. అదే కొత్తవలసలో దిగాల్సి వస్తే నరకయాతన అనుభవించాల్సిందే. ఇప్పుడు ఆ దంపతుల ప్రమాదానికి ముమ్మాటికీ బైపాసే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎందుకింత వివక్ష..?
విశాఖ రైల్వే స్టేషన్‌ నిత్యం రద్దీగా ఉంటోంది. వివిధ ప్రాంతాల నుంచి ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం కిక్కిరిసి పోతుంటుంది. అంత డిమాండ్‌ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 19 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌ను వెలివేసినట్లుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌ఫారాలు ఖాళీ లేవంటూ రైళ్లను బైపాస్‌ మార్గంలో దువ్వాడ మీదుగా పంపించేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్‌ మీదుగా.. ఏ ట్రైన్‌ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్‌ మీదుగానే రైళ్లను పంపించేస్తున్నారు.

ఇప్పటికైనా బైపాస్‌ వద్దు..
ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్‌ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఆరు ట్రైన్లు అర్ధరాత్రి 12 నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమయంలో విశాఖ స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా దువ్వాడ బైపాస్‌ను ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్‌ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్‌ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ. లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్‌ బైపాస్‌ 4 కి.మీ. దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్‌ 7 కి.మీ., నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్‌ 7 కి.మీ., విజయవాడకు రాయనపాడు బైపాస్‌ 7 కి.మీ. దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్‌ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ విశాఖ నుంచి దువ్వాడ బైపాస్‌కు 17 కి.మీ., కొత్తవలస బైపాస్‌కు 20 కి.మీ. దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోనైనా రైల్వే అధికారులు బైపాస్‌ పదాన్ని ఉపసంహరించి.. అన్ని రైళ్లూ విశాఖ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement