పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా? | ys jagan on Hirakhand Express tragedy | Sakshi
Sakshi News home page

పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?

Published Tue, Jan 24 2017 3:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

విజయనగరం జిల్లా కూనేరులో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

విజయనగరం జిల్లా కూనేరులో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మూడు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి
కాన్పూర్‌లో 150 మంది.. ఇక్కడ 41 మంది మరణించారు
ఇప్పటివరకు ఇక్కడకు ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు?
విద్రోహ చర్యయినా, రైల్వే తప్పిదమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి
చనిపోయిన వారికి రూ. 20లక్షలు పరిహారం చెల్లించాలి
ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌
కూనేరు హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనా ప్రాంతం పరిశీలన


కూనేరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘వరుసగా జరుగుతున్న రైల్వే దుర్ఘటనల్లో ప్రయాణికులు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందో... ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలియడం లేదు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది’’ అని ఏపీ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గడచిన మూడు నెలల్లో మూడు రైల్వే ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు. గత నాలుగైదేళ్లలో తానే మూడుసార్లు ప్రమాద ప్రాంతాలకు వెళ్లి పరామర్శించానని చెప్పారు. కాన్పూర్‌లో జరిగిన దుర్ఘటనలో ఏకంగా 150 మంది చనిపోయినా, తాజాగా ఇక్కడ 41 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వాలకు çపట్టడం లేదని విమర్శించారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద íహీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌రైలు దుర్ఘటన ప్రాంతాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది? కారణాలు ఏమిటి? సహాయ పునరావాస చర్యలు ఎంతవరకు వచ్చాయి? మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు అందిస్తున్న సహాయాన్ని రైల్వే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటనాస్థలం వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ముఖ్యమంత్రి ఏమైపోయారు?
రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుర్ఘటనల్లో ఇది పెద్ద దుర్ఘటన. దాదాపుగా 41 మందికి పైగా చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో ఏడుగురు మన రాష్ట్రానికి చెందినవాళ్లున్నారు.  ఇది విద్రోహ చర్యా? లేదా రైల్వేశాఖ తప్పిదమా? అన్నది విచారణలో తేల్చాల్సి ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక హెలికాప్టర్‌ వేసుకొని ఈ ప్రాంతానికి రావాలి. చనిపోయిన వారి కుటుంబాలకు తోడుగా ఉన్నానని భరోసానివ్వాలి. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించాలి. మెరుగైన వైద్యం అందేలా చూడాలి. దుర్ఘటనకు కారణం తెలుసుకునే ఆరాటం చూపాలి. కానీ రాష్ట్రంలో ఎన్ని దుర్ఘటనలు జరిగినా, ఎంతమంది చనిపోయినా ముఖ్యమంత్రి కనిపించడు. గతేడాది నెల్లూరులో బాణాసంచా పేలుడు ఘటనలో 20 మంది చనిపోయినా కనిపించలేదు. ఈ రోజు ఇక్కడ ఏకంగా 41మంది చనిపోయినా పరామర్శించలేదు. కనీసం విచారణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా? చనిపోయిన వారి పట్ల ముఖ్యమంత్రి కనీస సానుభూతి కూడా చూపించకపోవడం దారుణం.

రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలి
మూడు నెలల్లో మూడు రైల్వే భారీ ప్రమాదాలు జరిగాయి. రెళ్లెక్కిన పాపానికి గమ్యం చేరకుండా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తప్పిదం ఎవరిదైనా ప్రయాణికులు మాత్రం మూల్యం చెల్లిస్తున్నారు. ఏదేమైనా ఈ దుర్ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చనిపోయిన వారికి నష్ట పరిహారం కేవలంæ రూ.5లక్షలు ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కనీసం రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చనిపోయిన కుటుంబాలకు మన వంతు తోడ్పాటునివ్వాలి. ఈ మేరకు పరిహారం అందేలా మీడియా కూడా కృషి చేయాలి. దెబ్బలు తగిలిన వారికి రూ.50వేలు, రూ.20వేలు ఇచ్చే ప్యాకేజీ సరిపోవు. ప్రమాదానికి గురైన తర్వాత మంచానపడిన వాళ్లు మళ్లీ మామూలుగా పనులు చేసుకునే పరిస్థితులు రావాలంటే కనీసం రెండుమూడు నెలలు సమయం పడుతుంది. ఆస్పత్రికి వెళ్లి చూస్తే ఆంధ్రరాష్ట్రానికి చెందిన వారందరూ బీదవాళ్లే. రూ. 50వేలు ఇస్తే కనీసం మందులకు కూడా సరిపోదు. కొంతమందికి రూ.20వేలు ఇస్తామంటున్నారు. ప్రతి ఒక్కరికి రూ.2లక్షలు ఇవ్వాలి. రైల్వేశాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలి.

విచారణ రిపోర్టును బహిర్గతం చేయాలి
దుర్ఘటనపై విచారణ జరగాలి. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత రిపోర్టును బహిర్గతం చేయాలి. ప్రయాణికుల భద్రత కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలి. రైల్వే శాఖ తప్పిదం వల్ల ఈ ఘటన జరిగి ఉంటే సేఫ్టీ మెకానిజం విషయంలో తీసుకుంటున్న చర్యలపై పునఃసమీక్షించాలి. తక్షణమే సేఫ్టీ మెకానిజమ్‌ ఇంప్రూవ్‌ చేయాలి. పాతరైల్వే ట్రాక్స్‌ మార్చేందుకు చర్యలు చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement