రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స | AP Minister Botsa Comments On Vizianagaram Train Accident | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద బాధితుల బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి బొత్స

Published Mon, Oct 30 2023 1:09 PM | Last Updated on Mon, Oct 30 2023 2:01 PM

AP Minister Botsa Comments On Vizianagaram Train Accident - Sakshi

సాక్షి, విజయనగరం: రైలు ప్రమాదంలో బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాగాన్ని అభినందించారు. 

‘‘ఘటన దురదృష్టకరం. బాధితుల ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడేంత వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రమాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వాళ్లకు రూ.50 వేల సాయం  అందిస్తాము’’ అని మంత్రి బొత్స తెలిపారు.

ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిందని, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొందని అభినందించారు. ఏపీ అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారని తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల పునరుద్ధరణ పనులను కూడా రైల్వే అధికారులు ప్రారంభించారని.. సాయంత్రంలోపే పూర్తవుతాయని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. 

ఆదివారం రాత్రి కంటాకపల్లి వద్ద పలాస-విశాఖ ప్యాసింజర్‌ రైలును రాయగడ-విశాఖ ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇప్పటిదాకా 13 మంది మృతి చెందగా, 50 మందిదాకా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్‌.. ఘటనాస్థలానికి వెళ్లాలని, సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఆదేశించారు. దీంతో రాత్రి నుంచి ఆయన అక్కడే పరిస్థితిని సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement