
41కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి నెట్‌వర్క్ : విజయనగరం జిల్లా కూనేరు వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాయగడ ఆస్పత్రిలో చికిత్స పొందూతూ సోమవారం ఒకరు చనిపోయినట్టు అధికారులు తెలిపారు. 31 మృతదేహాలకు రాయగడ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో, మరో పది మృతదేహాలకు విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
గజపతి, గంజాం, పుల్‌బాణీ, కలహండీ జిల్లాల వైద్య బృందాలు పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్నాయన్నారు. క్షతగాత్రులు 55 మందిలో 14 మందికి తీవ్రంగా, 23 మందికి మోస్తరుగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామన్నారు.