
ఉత్తరాది అనుభవం
పాఠక పర్యాటకం
ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాక మా ఇంజనీరింగ్ విద్యార్థులం మొత్తం 120 మందిమి కలిసి ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లాం. రాత్రి రెండు గంటలకు శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. మర్నాడు రాత్రి పన్నెండు గంటలకు అమృత్‌సర్ చేరుకున్నాం.
సజీవ సాక్ష్యం జలియన్‌వాలా బాగ్
హోటల్‌లో తయారై, చుట్టుపక్కల ప్రదేశాలు చూడడానికి బయల్దేరాం. ముందుగా జలియన్‌వాలా బాగ్‌కి చేరుకున్నాం. బ్రిటిష్ వారి దురాగతానికి వేల మంది బలైపోయిన నాటి చారిత్రక సంఘటనలకు గుర్తుగా అక్కడ ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. నాటి విషయాలు తెలుసుకుంటూ మ్యూజియవ్‌ును సందర్శించాం. ఆ తర్వాత అమృత్‌సర్‌లోని ప్రసిద్ధ స్వర్ణదేవాలయానికి చేరుకున్నాం.
వాఘా సరిహద్దులో నినాదాలు
ఇది సిక్కుల దేవాలయం. పసిడి వెలుగుల్లో దేవాలయం అత్యంత సుందరంగా కనువిందు చేసింది. దేవాలయం ముందు సరస్సులో రంగు రంగుల చేపలు. వాటిని ఎంతసేపు చూశామో సమయమే తెలియలేదు. అక్కడ నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న భారత సరిహద్దు ప్రాంతం వాఘా బోర్డర్‌కి చేరుకున్నాం. అక్కడ త్రివిధ దళాల సైనిక విన్యాసాలు ఆసక్తి కలిగించాయి. ‘భారత్‌మాతాకీ జై’ అనే నినాదం మార్మోగిపోయింది. భారతీయతను గుండెల నిండుగా నింపుకొని కులూమనాలీ బయల్దేరాం.
కులూమనాలీలో రివర్ ర్యాఫ్టింగ్
కులూ వద్ద బియాస్ నదిలో రివర్ ర్యాఫ్ట్ చేయడానికి సదుపాయం ఉంది. ఈ నదిలో ఏడు కిలోమీటర్ల దూరానికి 500 రూపాయలు చెల్లించి లైఫ్ జాకెట్, హెల్మెట్ ధరించి గైడ్ సూచనల మేరకు బోటులో ప్రయాణించాం. చల్లటి నీళ్లు పడవలోకి ప్రవేశించి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ మా ఆనందంలో అవి దూదిపింజల్లా కొట్టుకుపోయాయి.
మనాలీ నుంచి కిలోమీటర్ దూరంలో మను దేవాలయం, రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హిడింబ దేవాలయాలు సందర్శించాం. వాటి నిర్మాణశైలి, ఆహ్లాదకరమైన పరిసరాలు అమితంగా ఆకట్టుకున్నాయి. అటు తర్వాత అల్లు అర్జున్ నటించిన తెలుగు చలనచిత్రం ‘దేశముదురు’ షూటింగ్ జరిగిన ప్రాంతానికి వెళ్లి కాసేపు ఉల్లాసంగా గడిపాం. ఆ తర్వాత మనాలీకి 51 కి.మీ. దూరంలో ఉన్న రోహ్‌తాంగ్ పాస్‌కు చేరుకున్నాం. సిమ్లా లోయల్లో విహరించి, చారిత్రక అద్భుతం ఢిల్లీని సందర్శించి, శ్రీకాకుళం తిరుగు ప్రయాణమయ్యాం.
- పైడిశెట్టి హరీష్ కుమార్, నరసన్నపేట, శ్రీకాకుళం