వచ్చే ఏడాది భారత జట్టు పర్యటన
జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్
లండన్: భారత క్రికెట్ జట్టు 2025లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ప్రస్తుత వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముగిసిన వెంటనే 2025–2027 డబ్ల్యూటీసీ మొదలవుతుంది.
ఇందులో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. దీనికి సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) 10 నెలల ముందుగానే షెడ్యూల్‌ను విడుదల చేయడం విశేషం. ఐదు టెస్టులు జరిగే వేదికలతో పాటు తేదీలను కూడా ఈసీబీ ప్రకటించింది.జూన్ 20–24 మధ్య లీడ్స్‌లో తొలి టెస్టు, జూలై 2–6 మధ్య బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరుగుతాయి.
జూలై 10–14 మధ్య జరిగే మూడో టెస్టుకు లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదిక కానుండగా... మాంచెస్టర్‌లో నాలుగో టెస్టు (జూలై 23–27), లండన్‌లోని ఓవల్‌లో ఐదో టెస్టు (జూలై 31–ఆగస్టు 4) నిర్వహిస్తారు. ఇరు జట్ల మధ్య 2021–22 సీజన్‌లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచి 17 ఏళ్లయింది.
2026లో లార్డ్స్‌లో మహిళల టెస్టు...
భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలో భారత్, ఇంగ్లండ్ మహిళా జట్లు కూడా అక్కడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య వచ్చే ఏడాది 5 టి20లు, 3 వన్డేలు జరుగుతాయి. జూన్ 28, జూలై 1, 4, 9, 12 తేదీల్లో నాటింగ్‌హామ్, బ్రిస్టల్, ఓవల్, మాంచెస్టర్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఐదు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
అనంతరం సౌతాంప్టన్, లార్డ్స్, డర్హమ్‌లలో జూలై 16, 19, 22 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో భారత మహిళల జట్టు పర్యటన ముగుస్తుంది. అయితే 2026లో మన టీమ్ మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లి ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఈ టెస్టు జరుగుతుందని ఈసీబీ ప్రకటించింది. లార్డ్స్‌లో మహిళల టెస్టు మ్యాచ్ జరగనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment