నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు
ఒత్తిడిలో టీమిండియా
ఆత్మవిశ్వాసంతో ఆసీస్
ఉదయం గం. 7:50 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో, డిస్నీ–హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్ ప్రారంభం కానుంది. గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారీ గెలిస్తే అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తుంది.
136 ఏళ్ల తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై ఆస్ట్రేలియాను వరుసగా మూడు సిరీస్‌లలో ఓడించిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. 1888లో ఇంగ్లండ్ జట్టు మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను వారి దేశంలోనే ఓడించింది. ఆ తర్వాత ఇన్నేళ్లకు భారత జట్టుకు ఈ అవకాశం లభిస్తోంది. అయితే ఈసారి భారత జట్టుకు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం... తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం... గాయంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ వైదొలగడం... పుజారా, రహానే వంటి టెస్టు స్పెషలిస్టులు లేకపోవడం... కోహ్లి, కేఎల్ రాహుల్ ఆటలో నిలకడలేమి... వెరసి భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అంచనా వేసే పరిస్థితి లేదు.
గత రెండు పర్యాయాల్లో భారత జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన ఆ్రస్టేలియా ఈసారి మాత్రం అదరగొట్టే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. భారత్‌పై తొలి టెస్టు నుంచే ఒత్తిడి పెంచి ఈ సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేయాలనే లక్ష్యంతో కమిన్స్ బృందం ఉంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండుసార్లు ఫైనల్ చేరిన టీమిండియా ... ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను 4–0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రత్యర్థి కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో చిక్కి కివీస్ చేతిలో వైట్‌వాష్ కు గురైన భారత జట్టు... పేస్‌కు సహకరించే ఆ్రస్టేలియా గడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి!
పెర్త్: పోరాటతత్వానికి పెట్టింది పేరైన ఆ్రస్టేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సమరానికి భారత జట్టు సిద్ధమైంది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి సిరీస్‌లో ఐదు టెస్టులు నిర్వహించనుండగా... శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు అత్యవసరం కావడంతో హోరాహోరీ పోరు సాగడం ఖాయం.
గత రెండు ఆసీస్ పర్యటనల్లో (2018–19, 2020–21) సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా... వరుసగా మూడోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఒత్తిడిలో కనిపిస్తోంది.
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టుకు ఇదే తొలి విదేశీ టెస్టు సిరీస్ కాగా... అతడితో పాటు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి ఈ పర్యటన మరింత కీలకం కానుంది. గత ఆసీస్ పర్యటనలో రాణించిన పుజారా, రహానే, షమీ, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేకపోగా... యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ పరీక్ష కానుంది. మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ మెరుగైన సాధనతో సిద్ధంగా ఉంది.
నితీశ్ రెడ్డి అరంగేట్రం!
ఆ్రస్టేలియా పర్యటనలో రాణిస్తే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ తొలి నాళ్లలో సచిన్ టెండూల్కర్ ‘వాకా’ పిచ్‌పై శతకంతోనే మరింత పేరు ప్రఖ్యాతలు సాధించగా... 2014 ఆసీస్ టూర్ లో కోహ్లి నాలుగు శతకాలతో చెలరేగి ‘కింగ్’ అనిపించుకున్నాడు. యావత్ ప్రపంచ దృష్టి సారించే ఆ్రస్టేలియా పర్యటన ద్వారా పుజారా, రిషభ్ పంత్ సాధించిన గుర్తింపు తక్కువేమీ కాదు. అలాగే ఇక్కడ విఫలం కావడంతోనే కెరీర్‌కు ముగింపు పలికిన ప్లేయర్లకూ కొదవలేదు.
గతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఇలాగే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లి, రోహిత్, అశ్విన్ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కనిపించే మాటల యుద్ధం ఈసారి పెద్దగా తెర పైకి రాకపోగా... తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనుండటం... ఆసీస్ సీనియర్ల నోటికి తాళాలు వేసినట్లు కనిపిస్తోంది.
తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... గాయంతో దూరమైన గిల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేయనున్నాడు. కోహ్లి, పంత్‌తో కలిసి ధ్రువ్ జురేల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.
పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి, ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు జట్టులో స్థానం పక్కా కాగా... తాత్కాలిక కెప్టెన్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు. సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్‌లలో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు.
స్మిత్ అచ్చొచ్చిన స్థానంలోనే...
డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అనంతరం సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న ఆ్రస్టేలియా జట్టు పలు ప్రయోగాలు చేసి విఫలమైంది. టీమిండియాతో సిరీస్‌కు ముందు ఆసీస్‌కు ఆ సమస్య తీరినట్లే అనిపిస్తోంది. ఇటీవల భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’జట్టుకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనీ ఈ సిరీస్‌లో ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.దీంతో స్మిత్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు.
లబుషేన్, ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్, అలెక్స్ క్యారీలతో ఆసీస్ మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ పిచ్‌పై మెరుగైన గణాంకాలు ఉన్న నాథన్ లయన్ స్పిన్ బాధ్యతలు మోయనుండగా... కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ భారత టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టడానికి అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యారు.
24న రోహిత్ శర్మ రాక...
వ్యక్తిగత కారణాలరీత్యా ఆ్రస్టేలియాతో తొలి టెస్టుకు దూరమైన భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈనెల 24న జట్టుతో చేరనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో తొలి టెస్టులో బుమ్రా జట్టును నడిపించనుండగా... మొదటి టెస్టు మూడో రోజు రోహిత్ టీమిండియాతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు (డే అండ్ నైట్) రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు.
పిచ్, వాతావరణం
పెర్త్ పిచ్ పేస్‌కు, బౌన్స్‌కు ప్రసిద్ధి. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు అకాల వర్షం కారణంగా పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడించగా... రెండు రోజులుగా బాగా ఎండ కాయడంతో వికెట్ పూర్వ స్థితికి చేరింది. పచ్చికతో కూడిన పిచ్‌పై తొలి రోజు ఆట కీలకం కానుంది.
భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఎంతో ప్రత్యేకమైంది. ఈసారి ఐదు మ్యాచ్‌లు ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువ. తొలి టెస్టు సమయంలోనే ఐపీఎల్ వేలం జరగనున్నప్పటికీ... ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అనుకోవడం లేదు. వేలంలో చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో ప్లేయర్లు చేయాడానికి ఏమీ ఉండదని అందరికీ తెలుసు.
స్వదేశంలో ఆడేటప్పుడు అంచనాల ఒత్తిడి ఉండటం సహజమే. భారత్ కఠిన ప్రత్యర్థి. వారిని ఎదుర్కొనేందుకు మేం బాగా సిద్ధమయ్యాం. ఐపీఎల్ సందర్భంగా భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. బంతిని స్వింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో రాణించే సత్తా అతడిలో ఉంది. –ప్యాట్ కమిన్స్, ఆ్రస్టేలియా కెప్టెన్
కెప్టెన్సీని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తా. దాని కోసం సదా సిద్ధంగా ఉంటా. చిన్నప్పటి నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలవాటే. గతంలో నాయకత్వం చేసిన అనుభవం ఉంది. అయితే ఇది ఒక్క మ్యాచ్‌కే... రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి బాధ్యతలు తీసుకుంటాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. రోహిత్, కోహ్లిని అనుకరించాలని చూడను.
దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. మేనేజ్‌మెంట్‌కు అతడిపై విశ్వాసం ఉంది. కోహ్లి బ్యాటింగ్‌పై వ్యాఖ్యలు చేయను. అతడి సారథ్యంలోనే జట్టులోకి వచ్చా. జట్టులో అతడి ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలుసు. –బుమ్రా, భారత కెప్టెన్
52 ఆ్రస్టేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత జట్టు ఇప్పటి వరకు 52 టెస్టులు ఆడింది. ఇందులో 9 టెస్టుల్లో గెలిచింది. 30 టెస్టుల్లో ఓడిపోయింది. 13 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి.
4 ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుండటం ఇది నాలుగోసారి. గతంలో 1947లో, 1977లో, 1991లో రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. ఐదు టెస్టులతో కూడిన మూడు సిరీస్‌లలోనూ
ఆ్రస్టేలియా జట్టే విజేతగా నిలవడం గమనార్హం.
తుది జట్లు (అంచనా)
భారత్: బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లి, పంత్, జురేల్, అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, సిరాజ్/ఆకాశ్‌దీప్.
ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్.
Comments
Please login to add a commentAdd a comment