ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 311/6
అరంగేట్రంలో కోన్‌స్టాస్ రికార్డు ‘ఫిఫ్టీ’
ఖ్వాజా, లబుషేన్, స్మిత్ అర్ధ శతకాలు
3 వికెట్లతో మెరిసిన బుమ్రా
ఆ్రస్టేలియా ప్రయోగించిన కొత్త అస్త్రం ఫలించింది. మెక్‌స్వీనీని తప్పించి ఎంపిక చేసిన 19 ఏళ్ల కుర్రాడు స్యామ్ కోన్‌స్టాస్ మెల్‌బోర్న్‌లో మెరిపించాడు. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా మన్ననలు అందుకుంటున్న బుమ్రా బౌలింగ్‌లో... టి20ల తరహాలో పరుగులు రాబట్టి ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అతడి స్ఫూర్తితో టాప్–4 ఆటగాళ్లు హాఫ్ సెంచరీలతో విజృంభించారు.
వెరసి ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆఖర్లో బుమ్రా చెలరేగకపోయుంటే పరిస్థితి మరింత దిగజారేదే! ఇప్పటికైతే టీమిండియా పోటీలోనే ఉన్నా... పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం!
మెల్‌బోర్న్: టాపార్డర్ రాణించడంతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆ్రస్టేలియాకు మంచి ఆరంభం లభించింది. టాప్–4 బ్యాటర్లు అర్ధశతకాలతో అదరగొట్టారు. ఫలితంగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో భాగంగా భారత్‌తో గురువారం మొదలైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఆ్రస్టేలియా జట్టు తొలిరోజే మంచి స్థితిలో నిలిచింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు సామ్ కోన్‌స్టాస్ (65 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 57; 6 ఫోర్లు), లబుషేన్ (145 బంతుల్లో 72; 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఒకదశలో ఆసీస్ జోరు చూస్తుంటే 400 స్కోరు ఖాయమే అనిపించినా... మేటి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (3/75) టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్మిత్‌తో పాటు కెపె్టన్ ప్యాట్ కమిన్స్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
కోన్‌స్టాస్ ల్యాప్ స్కూప్ సిక్సర్
రికార్డు స్థాయి అభిమానుల హర్షధ్వానాల మధ్య జాతీయ జట్టు తరఫున తొలి టెస్టు ఆడేందుకు బరిలోకి దిగిన టీనేజర్ కోన్‌స్టాస్ మొదటి మ్యాచ్‌లోనే గుర్తుండిపోయే ప్రదర్శనతో కట్టిపడేశాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహా బ్యాటర్లే తడబడుతున్న తరుణంలో సంప్రదాయ శైలిని పక్కనపెట్టి ఎదురుదాడి లక్ష్యంగా పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. పట్టుమని పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం కూడా లేని 19 ఏళ్ల కోన్‌స్టాస్... బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదడం విశేషం.
ఏడో ఓవర్‌లో అతడు ల్యాప్ స్కూప్ ద్వారా కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్. కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడితో మాటల యుద్ధం జరిగిన తర్వాత కూడా ఈ టీనేజ్ కుర్రాడు సంయమనం కోల్పోకుండా పరిణతి ప్రదర్శించాడు. ఈ క్రమంలో 52 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోన్‌స్టాస్ కాసేపటికే జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
స్మిత్, లబుషేన్ నిలకడ
గత మూడు టెస్టుల్లో నిలకడ కనబర్చలేకపోయిన ఆసీస్ టాపార్డర్... కోన్‌స్టాస్ ఇన్నింగ్స్ స్ఫూర్తితో చెలరేగడంతో తొలి రోజు కంగారూలదే పైచేయి అయింది. లయ దొరకబుచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఖ్వాజా 101 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... లబుషేన్ నింపాదిగా ఆడాడు. ఎలాంటి తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా ఒక్కో పరుగు జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
రెండో వికెట్ లబుషేన్‌తో కలిసి 65 పరుగులు జోడించిన అనంతరం ఖ్వాజా అవుటయ్యాడు. లబుషేన్, స్మిత్ జట్టు బాధ్యతలను భుజానెత్తుకున్నారు. దాంతో ఆసీస్ ఒకదశలో 237/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా... సిరాజ్, జడేజా ఆ తీవ్రత కొనసాగించలేకపోవడంతో ఆసీస్ ప్లేయర్లు సులువుగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించిన తర్వాత లబుషేన్‌ను సుందర్ అవుట్ చేశాడు.
బుమ్రా బ్రేక్
ఈ సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న బుమ్రా మూడో సెషన్‌లో తన తడాఖా చూపాడు. వరుస సెంచరీలతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (0)ను ఓ చక్కటి బంతితో క్లీన్»ౌల్డ్ చేశాడు. బుమ్రా సంధించిన బుల్లెట్ లాంటి లెంత్ బాల్ హెడ్ ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను గిరాటేసిన తీరు ముచ్చట గొలిపింది. ఏం జరిగిందో ఆలోచించుకునే లోపే హెడ్ బెయిల్ గాల్లోకి ఎగరగా... స్టేడియం మొత్తం ‘బూమ్.. బూమ్.. బుమ్రా’అనే నినాదాలతో హోరెత్తింది.
మరుసటి ఓవర్‌లో మార్ష్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. అలెక్స్ కేరీ (41 బంతుల్లో 31; 1 సిక్స్) చివర్లో వేగంగా పరుగులు సాధించగా... స్మిత్ అజేయంగా నిలిచాడు. రెండో రోజు కమిన్స్‌తో కలిసి స్మిత్ మరెన్ని పరుగులు జోడిస్తాడనే దానిపైనే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: కోన్‌స్టాస్ (ఎల్బీ) (బి) జడేజా 60; ఖ్వాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57; లబుషేన్ (సి) కోహ్లి (బి) సుందర్ 72; స్మిత్ (బ్యాటింగ్) 68; హెడ్ (బి) బుమ్రా 0; మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4; కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్‌దీప్ 31; కమిన్స్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 311.
వికెట్ల పతనం: 1–89, 2–154, 3–237, 4–240, 5–246, 6–299. బౌలింగ్: బుమ్రా 21–7–75–3; సిరాజ్ 15–2–69–0; ఆకాశ్‌దీప్ 19–5–59–1; జడేజా 14–2–54–1; నితీశ్ రెడ్డి 5–0–10–0;
సుందర్ 12–2–37–1.
1 అరంగేట్రం టెస్టులోనే భారత్‌పై అర్ధశతకం సాధించిన పిన్న వయసు (19 ఏళ్ల 85 రోజులు) ఆసీస్ ప్లేయర్‌గా కోన్‌స్టాస్ రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఆసీస్ తరఫున పిన్నవయసులో అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇయాన్ క్రెయిగ్ (17 ఏళ్ల 240 రోజులు; 1953లో దక్షిణాఫ్రికాపై) తొలి స్థానంలో ఉన్నాడు.
3 ఆ్రస్టేలియా తరఫున అరంగేట్రం టెస్టులో వేగవంతమైన అర్ధశతకం సాధించిన మూడో ప్లేయర్‌గా కోన్‌స్టాస్ (52 బంతుల్లో) నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (46 బంతుల్లో; 1999లో పాకిస్తాన్‌పై), ఆగర్ (50 బంతుల్లో; 2013లో ఇంగ్లండ్‌పై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
మెల్‌బోర్న్@ 87,242
‘బాక్సింగ్ డే’ టెస్టు తొలి రోజు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 87,242 మంది అభిమానులు హాజరయ్యారు. ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కు హాజరైన అభిమానుల సంఖ్య ఇదే అత్యధికం. మెల్‌బోర్న్ టెస్టు ఆరంభానికి రెండు వారాల ముందే టికెట్లన్నీ అమ్ముడుపోగా... రికార్డు స్థాయిలో ప్రేక్షకులు మైదానానికి తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment